రాష్ట్రీయం

కరవుకు పాతరేస్తా... నదుల అనుసంధానంతో సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: రాష్ట్రంలో కరవుకు పాతరేసేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఎన్ని కష్టాలెదురైనా, ఆర్ధిక పరిస్థితి సహకరించకున్నా భగీరథ ప్రయత్నాన్ని ఆపేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన ముందున్న లక్ష్యమన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు వేలాది అనుచరులతో ఆదివారం తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్ధం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లాను కరవు తాకకుండా కృష్ణా- పెన్నా అనుసంధానం, సోమశిల ప్రాజెక్టుకు జలాలు, సంగం బ్యారేజీని సకాలంలో పూర్తిచేయటం తన ముందున్న లక్ష్యాలన్నారు. ప్రతి వర్షపు బొట్టూ భూగర్భజలంగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఖర్చుతో 10 లక్షల పంట కుంటలు తవ్వుతున్నామన్నారు. గతంలో పోలీస్ స్టేషన్‌లో విత్తనాలు, ఎరువులను అందించే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అవసరమైనమేర సాగునీరు, విద్యుత్‌ను పుష్కలంగా అందిస్తున్నాం అన్నారు. ఇక పంటలను పండించే బాధ్యత రైతాంగంపైనే ఉందన్నారు. స్వార్ధం కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని, అత్యధిక జనాభావున్న రాష్ట్రానికి అత్యధికంగా అప్పుల వాటా ఇచ్చి తెలంగాణకు ఆదాయ వనరులు కల్పించిందన్నారు. అయినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తనపైవున్న నమ్మకం, విశ్వాసంతో దేశ విదేశీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. విభజనవాదులు సిగ్గుపడేలా, అసూయపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానన్నారు. ఇందుకోసం రిక్షావాలా ఒక మంచి సలహా ఇచ్చినా తాను గౌరవంగా స్వీకరిస్తానని, అలాగే ఎవరైనా అభివృద్ధికి అవరోధం కల్పించే ప్రయత్నం చేస్తే బులెట్‌లా దూసుకుపోతానని హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతంలోని నెల్లూరుకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. బెంగుళూరు- చెన్నై- కృష్ణపట్నం మధ్య ఇండస్ట్రీ కారిడార్, అలాగే విశాఖ నుంచి చెన్నై వరకు కృష్ణపట్నం, ఏర్పేడు మీదుగా మరో ఇండస్ట్రీ కారిడార్ రాబోతోందన్నారు. నెల్లూరులో మరో విమానాశ్రయం రాబోతున్నదన్నారు. ఇంతకాలం నెల్లూరు జిల్లావాసులు హోటళ్లు, ఇతర వ్యాపారాలతో దేశం నలుమూలలకు వెళ్లారంటూ, ఇకముందు ప్రపంచం నుంచే ఇక్కడకు వలసలు రాబోతున్నాయన్నారు. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ముందుకొచ్చాయని, దీనివలన 10 లక్షల మంది నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రపంచ దేశాల్లోని తెలుగు యువకులు తనమీద విశ్వాసంతో జాబుకావాలంటే బాబు రావాలంటూ విస్తృత ప్రచారం చేశారంటూ, అలాంటి వారిని విస్మరించేది లేదన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 225కు పెరుగుతాయని, పార్టీలో కొత్తగా చేరేవారికీ పుష్కలంగా అవకాశాలు ఉంటాయన్నారు. ఆనం సోదరుల ప్రవేశంతో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం మరింత బలోపేతం కాగలదన్న నమ్మకం, విశ్వాసం తనలో ఉందన్నారు.

చిత్రం... చంద్రబాబు సమక్షంలో అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం సోదరులు

దావోస్‌కు నేడు చంద్రబాబు
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న ఏపి సిఎం

హైదరాబాద్, జనవరి 17: బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త రూపునిచ్చేందుకు ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. దావోస్ నగరంలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సు సందర్భంగా ‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్’ నినాదంతో ప్రచార రథాన్ని పరుగులు పెట్టించబోతోంది. ఈ మేరకు ప్రత్యేక ప్రచార రథాన్ని దావోస్ నగర వీధుల్లో ఆర్థిక సదస్సుకు వారం రోజుల ముందే తిప్పుతూ ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలకు పిలుపునిస్తూ ముందుకు సాగుతున్న ప్రచార రథం ఈసారి సదస్సుకు ఒక ఆకర్షణగా నిలవబోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడురోజులపాటు దావోస్‌లో జరిగే సదస్సుకు అధికార గణంతోపాటు పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 18న బయలుదేరి వెళుతున్నారు.

వౌలిక వసతులకు ప్రాధాన్యం

విద్యుత్ శాఖాధికారులకు బాబు ఆదేశం
ఏపిలో వెల్లువెత్తనున్న ఉద్యోగాలు
అజయ్ జైన్ ఆశాభావం

హైదరాబాద్, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులు, వౌలిక సదుపాయాల శాఖను ఆదేశించారు. అవగాహన ఒప్పందాల అమలుకు ఉన్నత స్ధాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆమోదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు 21 అవగాహన ఒప్పందాలు ఖరారు చేశారు. 1.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 20,922 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు నిర్దేశించిన ఈ ప్లాంట్లలో 27,555 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పవన విద్యుత్‌లో రూ.50,225 కోట్లతో 7125 మెగావాట్లు, సౌర విద్యుత్ రంగంలో రూ.15,407 కోట్లతో 2201 మెగావాట్ల విద్యుత్, వృథా, హీట్ ఎనర్జీ విభాగంలో రూ.324కోట్లతో 36 మెగావాట్లు, థర్మల్ విద్యుత్‌లో రూ.71,860 కోట్లతో 11,560 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు సిఐఐ సదస్సులో ఖరారు చేశారు. సాలీనా వంద నిమిషాల కంటే తక్కువగా విద్యుత్ అంతరాయం కలిగే విధంగా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కృష్ణపట్నం, శ్రీ సిటీ, విశాఖపట్నం, కాకినాడతో పాటు అన్ని పారిశ్రామిక జోన్లలో నిరంతర విద్యుత్ ఇవ్వాలన్నారు. అన్ని మండల, అర్బన్ ప్రాంతాల్లో పరిశ్రమలను గుర్తించాలన్నారు. సిఐఐ సదస్సులో 4.78 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమల యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నిరంతర విద్యుత్ అవసరమని, దీనికి వౌలిక సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పరస్పరం సమాచార మార్పిడితోనే పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. పారిశ్రామిక వేత్తలకు వెంటనే అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ రంగంలోపెట్టుబడులను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. ఒక్క సిఆర్‌డిఏ ప్రాంతంలోనే 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నామన్నారు. ఏడు లక్షల ఎకరాల భూమిని గుర్తించామన్నారు.