రాష్ట్రీయం

...రోబోల్ని చేసేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: గ్రేడింగ్‌ల కోసం విద్యార్థులను వేధిస్తూ, వారి ఆత్మహత్యలకు కారకులవుతున్న కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలపై సిఎం చంద్రబాబు కనె్నర్ర చేశారు. మీ గ్రేడింగుల కోసం వారిని వేధించి విద్యాకుసుమాలను నేల రాలుస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఈ క్షణం నుంచే మీ విధానంలో మార్పు కనిపించకపోతే ఎంతవారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మీ ఇష్టానుసారం నడుచుకుంటామంటే సహించేది లేదని మందలించారు. ఇటీవల కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఒత్తిళ్ల కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై పత్రికల్లో వస్తున్న కథనాలపై సిఎం చంద్రబాబు స్పందించి, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను పిలిపించి వారికి సుదీర్ఘంగా క్లాసు తీసుకున్నారు. బాబు ఒక్కసారిగా తమ మీద విరుచుకుపడటంతో కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు బిత్తరపోయారు. వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలను లెక్కచేయకుండా వారిపై ముఖ్యమంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యార్థులపై తీవ్ర వత్తిడి చూపి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తున్న ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానంలో అవసరమైన మార్పులు తీసుకువచ్చేలా తగు సూచనలిచ్చేందుకు కమిటీని నియమిస్తున్నట్టు సిఎం ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే విద్యా విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ కమిటీ అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు పలువురు కమిటీలో ఉంటారని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. మార్కులు, గ్రేడ్ల కోసం ఆరాటపడుతూ విద్యార్థుల్లో మానసిక ప్రశాంతతను దూరం చేసి తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్న ‘బట్టీ’ విధానాలను
విడనాడాలని సమావేశంలో ముఖ్యమంత్రి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులను హెచ్చరించారు. ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థులను ఒట్టి మరమనుషులుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అసలు సహించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సంఖ్యను పెంచి వేలాదిమంది వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నది తానేనన్నారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్‌ను విద్యా, వైజ్ఞానిక గమ్యస్థానంగా మార్చాలని అనుకుంటున్నానన్నారు. అందులో భాగంగానే ప్రపంచశ్రేణి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకువస్తున్నానన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటన్నింటినీ ఏర్పాటు చేయాలన్నదే తన సంకల్పం అన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నంత మాత్రాన కార్పొరేట్ కళాశాలలు తమ ఇష్టానుసారం నడుచుకుంటే ప్రభుత్వం ఊరుకుంటుందని అనుకోవద్దని హెచ్చరించారు. విద్యార్థుల్ని వేధించే పద్ధతుల్ని తక్షణం వదిలిపెట్టాలన్నారు. వారి పట్ల మీ వ్యవహార శైలిలో ఈ క్షణం నుంచే మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఈ మార్పును తీసుకువచ్చే ప్రయత్నాలు ఆరంభం కాకపోతే కఠిన చర్యలకు వెనకాడబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఈ మార్పు స్పష్టంగా కనిపించి వాళ్లల్లో సంతృప్తి వ్యక్తమయ్యేవరకు వదిలిపెట్టనని చెప్పారు. ఈ విషయంలో ఎంతటివారినైనా, ఎవరైనా సరే ఉపేక్షించబోనని అన్నారు. మీరు విద్యార్థుల్ని మరబొమ్మలుగా భావిస్తున్నారని మందలించారు. అతిగా చేస్తే అనర్థం తప్పదన్నారు. రాష్ట్రాన్ని ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని సంతోష సూచికను తీసుకువచ్చామని చెబుతూ, దీనికి విరుద్ధంగా భావిభారత పౌరులను ఆనందానికి దూరం చేసే విధానాలతో వారిలో ఒత్తిడి పెంచడం భావ్యం కాదని అన్నారు. ఇక నుంచి విద్యార్థుల సామాజిక సేవ (సోషల్ వర్క్)కు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. ఫిజికల్ లిటరసీ ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు, కళాశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్ని ప్రకృతితో మమేకం చేయడం, జల వనరుల పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛాంధ్ర దిశగా నడిపించడం తప్పనిసరి చేస్తున్నామన్నారు. వీటిని ఒక ప్రాజెక్టుగా తీసుకుని వాటి కోసం కృషిచేసే విద్యార్థులను మార్కులిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కమిటీ ఈ అంశాలను మరింత సమర్థంగా అమలుచేసేలా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నెలకు ఒకసారి ఈ కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో సమీక్ష చేస్తానని చెప్పారు. సమావేశంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డిజిపి నండూరి సాంబశివరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ఉన్నత విద్యా కార్యదర్శి ఉదయలక్ష్మి పాల్గొన్నారు.

చిత్రం..ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యజమానులతో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు