రాష్ట్రీయం

చెప్పిందే.. చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: తెలంగాణ ఆవిర్భావంతో తెరాస అధికారంలోకి వచ్చి పారిశ్రామిక విధానానికి కొత్తరూపు కల్పించిందని, టిఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రంలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించామని సిఎం కె చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌విండో విధానం అమలులో ఉన్నా, అవి పరిమితులు, షరతులతో కూడుకున్నవన్నారు. కానీ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అమలుచేస్తున్న సరళతర సింగిల్ విండో విధానంతో తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 5017 కొత్త పరిశ్రమలకు అనుమతులు లభించాయని, 1.07 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసకొండల మండలం శాయంపేట శివారులో నిర్మించే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి సిఎం కెసిఆర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. వరంగల్ నగర శివారులో నిర్మించే ఔటర్ రింగురోడ్డు, నగరంలోని కాజీపేట వద్ద నిర్మించే రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జికి, మడికొండలోని ఐటిపార్కులో రెండో దశ ఇంక్యుబేటర్ కేంద్రానికీ సిఎం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ వ్యవసాయరంగంతోపాటు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసి లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పరిశ్రమని చెప్పారు. ఈ టెక్స్‌టైల్ పార్కు మొదటి దశ నిర్మాణం పూర్తయితే 27 వేలమంది ప్రత్యక్షంగా, 50 వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో ఎన్నో అద్భుతాలు చూస్తారన్నారు. అమలు జరుగుతున్న చట్టాలు పాతవేనని, కానీ నిబద్ధత ఉంటే ఏదైనా సాధించవచ్చని తమ ప్రభుత్వం నిజం చేసి చూపుతోందని వ్యాఖ్యానించారు. పైసా లంచం ఇవ్వకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్ట్టూ అనుమతుల కోసం తిరగకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు లభించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ ప్రాంతం పేదది కాదని, కానీ దోపిడీకి గురవుతోందని ఉద్యమ సమయంలో తాను బహిరంగంగా చెప్పానని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తక్కువ కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణను అగ్రభాగాన నిలిపామన్నారు. గత పాలకులు అనుసరించిన విధానాల కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని, తెలంగాణ ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరంగల్ జిల్లాలో అధునాతన భారీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అలాగే, అధికారంలోకి రాగానే వివిధ రాష్ట్రాలలోని చేనేత పరిశ్రమల స్థితిగతులు, అక్కడికి వలస వెళ్లిన రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికుల పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి పరిశీలన చేయించిన ఫలితంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత పరిశ్రమకు సంబంధించి వేర్వేరు ఉత్పత్తులు తయారవుతున్నాయని, కానీ ఇక్కడి మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం పూర్తయితే అన్ని ఉత్పత్తులు ఇక్కడే తయారువుతాయన్నారు. శంకుస్థాపన జరిగిన రోజే 22 ప్రముఖ పరిశ్రమల యాజమాన్యాలతో ఇక్కడి మెగా టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు ఎంఓయు కుదుర్చుకోవటం శుభపరిణామంగా చెబుతూ, ఈ సంస్థల నుంచి 3900 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ద్వారా మన గడపలోనే మనకు ఉపాధి అనే ఉద్దేశ్యం నెరవేరుతుందని, ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన తెలంగాణకు చెందిన చేనేత కార్మికులను వెనక్కి రప్పిస్తామన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటులో భాగంగా మామునూరు ఎయిర్‌పోర్టును రెగ్యులర్ అవసరాలకు అవకాశం లేకపోయినా పారిశ్రామిక అవసరాలు తీర్చేలా అవసరమైతే రాష్ట్రప్రభుత్వ నిధులతో తిరిగి తెరిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, కెటి రామారావు, ఎంపిలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రొఫెసర్ సీతారాంనాయక్, దయాకర్, జడ్పీ చైర్‌పర్సన్ పద్మ, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రాలు.. టెక్స్‌టైల్ పార్కు ప్రారంభసభలో మాట్లాడుతున్న సీఎం కెసిఆర్, *భారీగా హాజరైన ప్రజలు