రాష్ట్రీయం

కర్తవ్యం మర్చిపోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ప్రజా కర్తవ్యం గుర్తుంచుకుని అహోరాత్రులు కష్టపడుతున్నట్టు తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తన మానస పుత్రికగా అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా- భాజపా గెలుపు చారిత్రక అవసరమన్నారు. కేంద్రంతో తెలంగాణ కరవు గురించి తానే చెప్పానని, ఫలితంగా అధికంగా నిధులు వచ్చాయన్నారు. ప్రతిసారీ ఓటర్లు మోసపోరని, అభివృద్ధి చేసిందెవరో వాళ్లకు తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తన అనుబంధాన్ని వివరిస్తూ పరిపాలనలో సహకరిస్తాం, రాజకీయంగా పోరాడతామన్నారు. తెదేపా ఆవిర్భావం, తొలి రోజులు మొదలుకుని తాజాగా అమరావతి నిర్మాణానికి తాను తీసుకుంటున్న చర్యలపై దాదాపు గంటకుపైగా పూసగుచ్చినట్టు వివరించారు. హైదరాబాద్‌లో ఏ అభివృద్ధి అంశాన్ని తీసుకున్నా, అది తనవల్ల సాధ్యమైనదేనన్నారు. ఓటర్లకు తెలుగుదేశంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతోనే హైదరాబాద్ దశ తిరిగిందని, ప్రపంచపటంలో నగరాన్ని పెట్టాలనే సైబరాబాద్ నామకరణం చేశామన్నారు. సైబరాబాద్‌లో ఐటి కంపెనీలను ఏర్పాటు చేయడంతోపాటు ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేందుకు కృషి చేశామని చెప్పారు. ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఆనాడు తాను సాధించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ సర్కారుకు ఆదాయం సమకూరుస్తోందన్నారు. తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తాముంటామని, ఎక్కడ ఇబ్బంది కలిగినా వెళ్లి పోరాడతామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు కావాల్సింది పబ్‌లు, క్లబ్‌లు మాత్రమే కాదని తాము స్పోర్ట్సును ప్రమోట్ చేశామని, స్టేడియంలు నిర్మించామని, అలాగే రోడ్లు వెడల్పు చేసి వౌలిక వసతులు కల్పించామన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించి వాటిని అందంగా తీర్చిదిద్దామని, చెత్తవేయకుండా చేశామన్నారు. హైదరాబాద్ వాసులు తమవైపే ఉన్నారని, హైదరాబాద్ దశ తిప్పింది తామేనని పేర్కొన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో తిరిగినపుడు అభివృద్ధి ఎవరివల్ల జరిగిందని తాను ప్రశ్నిస్తే, అంతా మీవల్లే అంటున్నారని, అంతకుమించిన సంతృప్తి రాజకీయ నాయకుడికి ఏముంటుందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న ఆంధ్ర సిఎం చంద్రబాబు