రాష్ట్రీయం

కృష్ణ..కృష్ణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో విజయవాడ నగరానికి సమీపంలోని పవిత్ర సంగమం వద్ద నదీహారతి చూడాలని వచ్చిన పర్యాటకులను బోటు రూపంలో మృత్యువు కబళించింది. మరికొద్ది సేపటిలో తీరానికి చేరుతున్నామన్న సమయంలో జరిగిన దుర్ఘటన విహార యాత్రలో తీరని విషాదం మిగిల్చింది. అధికారుల పర్యవేక్షణ లోపం, బోటు నిర్వాహకుని నిర్లక్ష్యం కలిసి 16మంది ఉసురు తీసింది. నదీహారతి చూడాలన్న కోరిక తీరకుండానే వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. 18మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల బంధువుల రోదనలతో పవిత్ర సంగమం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనకు కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా, ఘటనపై పర్యాటక మంత్రి అఖిలప్రియ విచారణకు ఆదేశించారు. కార్తీక మాసం ఆఖరి ఆదివారం, వారాంతం కూడా కావడంతో కృష్ణమ్మ హారతిని చూసేందుకు ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు 62మంది రెండు బస్సుల్లో విజయవాడ వచ్చారు. వారిలో 32 మంది, నెల్లూరుకు చెందిన ఆరుగురు బోటు ద్వారా పున్నమి ఘాట్ నుంచి పవిత్ర సంగమం వద్దకు చేరుకునేందుకు ఘాట్ వద్దకు సాయంత్రం 5.15 గంటలు దాటిన తర్వాత వచ్చారు. ఘాట్ వద్ద పర్యాటక శాఖ బోటును ఎక్కేందుకు ప్రయత్నించగా, సమయం మించిపోవడంతో
బోటును నడిపేందుకు పర్యాటక సిబ్బంది నిరాకరించారు. దీంతో అక్కడున్న ప్రైవేట్ బోటు ఎక్కారు. పవిత్ర సంగమం వద్దకు త్వరగా వెళ్లవచ్చన్న ఆశతో ఆ ప్రైవేట్ బోటు ఎక్కారు. 41 మందితో ప్రయాణిస్తున్న బోటు 5.50 గంటలకు బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
* లైఫ్ జాకెట్లు అవసరం లేదన్న సిబ్బంది
ప్రైవేట్ బోటు ఎక్కుతున్న సమయంలో లైఫ్ జాకెట్ల గురించి బోటు నిర్వాహకులను పర్యాటకులు అడిగారు. అయితే లైఫ్ జాకెట్టు అవసరం లేదని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతామని వారు నమ్మబలికారు. దీంతో పర్యాటకులు ఎక్కిన బోటు బయలుదేరింది. కృష్ణా -గోదావరి నదులు కలిసే సంగమ ప్రాంతం వద్దకు వచ్చే సమయంలో బోటు బోల్తాపడింది. దీంతో బోటుపై వున్నవారు బోటు కిందికి నీటిలో పడిపోవడంతో ఎక్కువ మంది మృతిచెందారు. సంగమ ప్రాంతానికి బోటు వచ్చేసరికి నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బోటు రెండుసార్లు కుదుపులకు గురైందని ప్రాణాలతో బయటపడిన పర్యాటకులు చెబుతున్నారు. భయంతో పర్యాటకులంతా బోటుకు ఒకవైపు రావడంతో బోల్తాపడిందని తెలుస్తోంది. రెండు నదులు కలిసే ప్రాంతం కావడంతో నది ఉద్ధృతి ఎక్కువగా ఉందని, ఆ ప్రాంతంలో సుడిగుండం వంటిది ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
* రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్
ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, ఆగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రంగంలోకి దిగి కొందరిని కాపాడారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికి ఒడ్డుకు చేర్చిన మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఆరుగురు మహిళలున్నారు. మృతులంతా ఒంగోలుకు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, మరింత సమాచారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.
* అనుమతి లేకుండానే..
ప్రమాదానికి గురైన బోటు రివర్‌బే అనే సంస్థకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ బోటు అనధికారికంగా రాయపూడి నుంచి పవిత్ర సంగమం వరకూ నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బోటును కాకినాడ నుంచి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్న తరుణంలో ఘటన జరిగిందంటున్నారు. 30మంది మాత్రమే బోటులో ప్రయాణించేందుకు వీలున్నా 41 మందిని అనుమతించడం కూడా ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
* సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కేరళ పర్యటనలో ఉన్న సిఎం చంద్రబాబు బోటు బోల్తా ఘటనపై దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి కామినేని శ్రీనివాస్, డీజీపీ నండూరి సాంబశివరావులను దుర్ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా బోటు నడుపుతున్నట్లు సీఎంకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఘటనపై పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటం, రాత్రి కావడం, చలిగాలుల వల్ల గాలింపు చర్యలకు కొంత విఘాతం కలుగుతోంది. అయితే రాత్రి సమయంలోనూ గాలింపు చర్యలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ప్రత్యేక లైట్ల సాయంతో కొనసాగిస్తోంది. నీటి ఉద్ధృతి కారణంగా నదిలో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. 14 బోట్లను, 40మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
*
సంతోషయాత్ర ఇవ్విధి
సంతప్త హృదిని మిగుల్చ సంతాపముతో
సుంతయు తోచక ఏదో
చింతింతై కనులు నిండ చిందెను నీరే!