రాష్ట్రీయం

భద్రాద్రి ఆలయంలో విరిగిపడిన సింహ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో దుర్ఘటన జరిగింది. ఆలయంలోని భద్రుని మండపం వద్ద పైన ఉన్న సింహం విగ్రహం తలభాగం కింద పడిపోవడంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడేనికి చెందిన సాయిలక్ష్మి, ఆమె భర్త స్వామివార్ల దర్శనానికి ఆదివారం ఉదయం రామాలయానికి వచ్చారు. గర్భగుడిలో స్వామి దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించి భద్రుని కొండ వద్దకు వారు వచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా బరువైన సింహం విగ్రహం నుంచి తలభాగం అక్కడే ఉన్న సాయిలక్ష్మి మెడపై పడింది. పెద్దశబ్దం రావడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. పరుగున వచ్చి చూసేసరికి భక్తురాలు కిందపడిపోయింది. ఆలయ సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఆమె పక్కన మరికొందరు భక్తులు ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు రెండు కుట్లు వేశారు. ఊహించని పరిణామంతో భక్తులు భయాందోళన చెందారు. కొద్దిరోజుల క్రితమే రాజగోపురం వద్ద ఒక రాతిశిల విరిగిపడిన సంఘటన నాడు సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత పురావస్తు శాఖ అధికారులు క్షుణ్ణంగా రాజగోపురం పైభాగాన్ని పరిశీలించారు. శిల విరిగిపడిన ప్రాంతంలో ఇనుప రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు. తాజాగా సింహం విగ్రహం తల భాగం విరిగి పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. శతాబ్దాల కాలం నాటి ఆలయం కావడంతో రాజగోపురం వద్ద వర్షపు నీరు చేరటంతో రాతిశిల విరిగిపడింది. కాగా భద్రుని మండపం వద్ద కూడా ఇదే సమస్య వచ్చి వుంటుందని భావిస్తున్నారు. ఆలయంలో గత మూడు నెలల్లో ఇలాంటి ఘటనలు రెండు జరగటం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. కాగా ఆదివారం నాటి సంఘటనను ఆలయ సిబ్బంది గోప్యంగా ఉంచారు. కిందపడిన సింహం విగ్రహం తల భాగాన్ని అక్కడి నుంచి తీసేసిన సిబ్బంది సంఘటనకు సంబంధించిన వివరాలను బయటపెట్టలేదు. త్వరలో రూ.100 కోట్లతో ఆలయాభివృద్ధి పనులు ప్రారంభించనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఒకదాని వెంట మరొకటిగా జరుగుతున్న దుర్ఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి.