రాష్ట్రీయం

కృష్ణానదినీ ఆక్రమిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎంతో పట్టుదలతోనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల నియమ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా రాజధాని నిర్మాణపు పనులను చేబడుతున్నారంటూ విశాఖపట్టణంకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ, తాను కలసి దాఖలు చేసిన పలు పిటిషన్లపై జారీ అయిన స్టే ఉత్తర్వులు నేటికీ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా కరకట్టపైనున్న తన నివాసిత భవనాలతోపాటు ఇతర అక్రమ కట్టడాలను సైతం దొడ్డిదారిన క్రమబద్ధీకరించేందుకు కృష్ణానదిలో 500 గజాల మేర ఆక్రమించుకోటానికి ఉద్యుక్తులవుతున్నారంటూ అదే జరిగితే ప్రవాహ ఒరవడి తగ్గిపోయి ఏకంగా ప్రకాశం బ్యారేజీకే ముప్పు వాటిల్లగలదంటూ హెచ్చరించారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడారు.
రాజధాని నిర్మాణాలకు పర్యావరణ బోర్డు అనుమతి లేదంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం హడావుడిగా రాష్ట్ర బోర్డు అనుమతి ఉందంటూ ముందస్తు తేదీలతో కూడిన పత్రాలను చూపగా అందులో ముంపు ప్రాంతాలు, పంట భూములు, మురుగుపారుదల వంటి వాటిని స్పష్టంగా చూపాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించగా నేటికీ సమర్పించకపోవటంతో ఈ నెల 28న జరగాల్సిన విచారణ మార్చి 7కి వాయిదా పడిందని, అలాగే స్టే కారణంగా గుప్పెడు మట్టి తీయటానికి వీలులేకపోయినా భూములు చదును చేయడం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటివి చేపడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్‌లపై తాను కంటెస్టు పిటిషన్‌లు దాఖలు చేయగా ట్రిబ్యునల్ సుమోటాగా తీసుకుని గుంటూరు కలెక్టర్ కాంతీలాల్ దండేను కూడా చేర్చిందని దీనిపై ఫిబ్రవరి 28న విచారణ జరగాల్సి ఉంటే ఆ కేసును కూడా కలిపి మార్చి 7న విచారించడానికి ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుందన్నారు.

నెల్లూరు ఎస్పీపై
ఓ వర్గం దౌర్జన్యం
గాలిలోకి కాల్పులు జరిపిన గన్‌మెన్లు
నెల్లూరు సిటీ, జనవరి 30: తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జిల్లా ఎస్పీ గజరావ్ భూపాల్ మాట్లాడారని ఒక వర్గం నాయకులు శనివారం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు సుమారు 3గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఆందోళన ఉద్ధృతం కావడంతో నగర డిఎస్పీ రాముడు సంఘటనా స్థలానికి చేరుకుని మైనార్టీలకు ఎస్పీ తరపున క్షమాపణ చెప్పినా ఆందోళనకారులు ధర్నా విరమించలేదు. ఎస్పీ స్వయంగా వచ్చి క్షమాపణ చెబితేనే ఆందోళన విరమిస్తామని చెప్పడంతో ఆందోళనకారుల నిర్ణయం ప్రకారం ఎస్పీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ముందుగా ఆందోళనకారులు ఎస్పీ జీపును అడ్డుకుని ధ్వంసం చేశారు. దీంతో ఎస్పీ గన్‌మెన్‌లు గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపారు.

ఎస్పీ జీపును మైనార్టీ నాయకులు తరిమారు. ఎస్పీ ఎమీచేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పిలుపు మేరకు ఎస్పీ క్షమాపణ చెప్పేందుకు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వస్తుండగా ముస్లింలు అడ్డుకుని ఎస్పీ జీపును ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నాలుగు నెలల్లో
పరిష్కరించాలి
స్టాంప్ రిజిస్ట్రేషన్
క్లెయిమ్‌లపై హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: స్టాంపులు రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22-ఏ కిందకు వచ్చే ఆస్తుల క్లైమ్స్‌ను నాలుగు నెలల్లో పరిష్కరించాలని హైదరాబాద్ కామన్ హైకోర్టు శనివారం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ వెలువరించారు. ఈ సెక్షన్ కింద పరిధిలోనికి వచ్చే ఆస్తుల క్లైమ్స్‌కు సంబంధించి గత నెల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం రెండురాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సర్వే శాఖ డైరెక్టర్, రిటైర్టు న్యాయాధికారితో కూడిన కమిటీని నియమించాలి. గత కొన్ని సంవత్సరాలుగా 22-ఏ సెక్షన్‌ను సవాలు చేస్తూ దాదాపు 1600 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. నిషేధించిన ఆస్తుల వివరాలను దేవాదాయ, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారులు వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. ఈ వివరాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు.
వచ్చే మూడు నెలల్లో ఈ ఆస్తుల వివరాలు ప్రకటించిన తర్వాత పిటిషనర్లు తమ డాక్యుమెంట్లను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందించాలన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ డాక్యుమెంట్లను మెరిట్ ప్రాతిపదికన పరిశీలించాలని కోర్టు ఆదేశించింది.

ఏపిఎస్ ఆర్టీసీ ఎండికి
టిఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: డైరక్టర్ జనరల్‌గా పదోన్నతి లభించిన సీనియర్ ఐపిఎస్, ఏపిఎస్ ఆర్టీసి ఎండి నండూరి సాంబశివరావుకు తెలంగాణ ఆర్టీసి జెఎండి జివి.రమణారావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సాంబశివరావు, రమణారావు పరస్పరం మిఠాయిలు అందించుకున్నారు. సాంబశివరావుకు తెలంగాణ ఆర్‌టిసి ఇడి ఎం.రవీందర్, సీనియర్ పిఆర్‌ఓ జి.ఆర్.కిరణ్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

‘మన సన్నద్ధత చాలదు’

‘గ్రేటర్’లో తక్షణం పోలింగ్ బూత్ కమిటీలు వేయాలి టి.టిడిపి నేతలకు బాబు ఆదేశాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ ప్రజలకు తెలుగుదేశం పార్టీపై అచంచల విశ్వాసం ఉందని, వారంతా టిడిపి వైపు చూస్తున్నా గ్రేటర్ ఎన్నికల విషయంలో పార్టీ సన్నద్ధత సరిపోదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణమే బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానిక ఓటర్లను గుర్తుపట్టే వారినే పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. తెరాస అధికారంలో ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ నేతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెరాస పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ‘నివురుగప్పిన నిప్పు’లా ఉందని, ఇది ఏ క్షణంలోనైనా బయటపడుతుందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. గ్రేటర్‌లో పునాదులు బలహీనపడి కాంగ్రెస్ చేతులు ఎత్తేయడంతో ఆ పార్టీ ఓట్లపై తెరాస ఆశలు పెట్టుకుందని, అయినా అది కుదిరే పనికాదని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు, టిడిపి-బిజెపి కూటమికి మధ్యనే పోటీ ఉందని వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధి అంతా టిడిపి హయాంలోనే జరిగిందని, గత 12 ఏళ్లలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏదీ లేదని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో కళకళలాడిన హైదరాబాద్ ఇప్పుడు కళావిహీనంగా తయారైందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రెండుసార్లు సిఎంగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనపై కెసిఆర్ మాట్లాడిన మాటలకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.
రానున్న రెండు రోజుల్లో టిడిపి, బిజెపి నేతలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం ఇంకా 1900 బూత్ కమిటీలను వేయాల్సి ఉందని, ఈ లోపు అభ్యర్ధులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు చర్చించి వాటిని పూర్తి చేయాలని అన్నారు. బూత్ కమిటీలకు ఇన్‌చార్జిలను నియమించి వారి సెల్‌ఫోన్ నెంబర్లను పార్టీ కార్యాలయానికి పంపించాలని చంద్రబాబు ఆదేశించారు.

‘జంబ్లింగ్’లోనే ఇంటర్ పరీక్షలు

ఫిబ్రవరి 4 నుంచి ప్రాక్టికల్స్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ‘జంబ్లింగ్’ విధానంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి ఎంవి.సత్యనారాయణ శనివారం వెల్లడించారు. ఫిబ్రవరి 4 నుంచి 24వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 723 పరీక్ష కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో 378 ప్రభుత్వ కాలేజీలు కాగా, 345 ప్రభుత్వ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. ఈ పరీక్షలకు 2,99,476 మంది హాజరుకానున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు, టైమ్ టేబుళ్లు, ఒఎంఆర్ తదితర సామగ్రిని ప్రాంతీయ కార్యాలయాలకు పంపించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు బోర్డు అనేక చర్యలు చేపట్టింది. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను సంబంధిత జూనియర్ కాలేజీల నుండి పొందాలని, ఈ కాలేజీలు సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించే ఎగ్జామినర్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేశామని, దాని వల్ల ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడొచ్చని అన్నారు. ప్రతి జిల్లాకు బోర్డు నుండి ఒక పరిశీలకుడిని పర్యవేక్షణాధికారిగా నియమించారు. దీంతో పాటు స్క్వాడ్ సభ్యులు కూడా నియమితులయ్యారు. జిల్లా పరీక్షల కమిటీ, హైపవర్ కమిటీలు శనివారం నుండి తమ విధులను ప్రారంభించనున్నాయి. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు బోర్డు సూచనలు ఇచ్చింది.