రాష్ట్రీయం

రక్షణ దళాల గుప్పిట్లో హైటెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైటెక్స్ ముస్తాబవుతోంది. ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న 1500 మంది వివిధ రంగాల ప్రముఖుల భద్రత దృష్ట్యా హైటెక్స్‌ను రక్షణ దళాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష మంగళవారం నాడు జరిగింది. నగరం అంతా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
ప్రధానంగా సభకు కీలక అతిధులుగా శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీలు హాజరవుతున్న దృష్ట్యా భద్రతను భారతీయ రక్షణ బృందాలు, అమెరికా నుండి చేరుకున్న ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తున్నాయి. మరో వారంలో అమెరికా ప్రత్యేక భద్రతా బృందం కూడా హైదరాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే ఎస్‌పిజి, స్థానిక పోలీసులు రూట్‌లను చెక్ చేశారు. కీలక సదస్సుతో అదే రోజు మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్రమోదీ మెట్రో రైలును కూడా ప్రారంభించనున్న దృష్ట్యా భద్రతా దళాలు, రక్షణ దళాలు వేర్వేరుగా నగరం అంతా జల్లెడపడుతున్నాయి. ఇంకో పక్క అమెరికాకు చెందిన 25 మంది అధికారులు ఇప్పటికే నగరంలో రక్షణ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. హైటెక్స్‌లో జరిగే ప్రారంభ ప్లీనరీలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక సైతం పాల్గొంటున్నారు. ఆ తర్వాత జరిగే పలు సమాంతర సదస్సుల్లో కూడా హాజరవుతారు. 28వ తేదీ రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే విందులోనూ, 29న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్వహించే విందులోనూ ఇవాంక పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇవాంక ఆహార ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక మెనూ కార్డు అధికారులకు అందింది. ఇవాంకకు హైదరాబాద్ బిరియానీ చాలా ఇష్టమని తెలిసింది. దాంతో పాటు పత్తర్ కా ఘోష్, షీర్ ఖుర్మా, డబుల్‌కా మిఠా, వెజిటబుల్ కర్రీ, భగారా బైగన్, ధం కా బిరియానీ, కుబాని కా మీఠా, ఇరానీ టీ తదితర వంటకాలున్నాయి. వాటిని తయారు చేసే సంస్థకు గోప్యంగా ఈ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇవాంక కోసం రూపొందించే ఆహార పదార్ధాలు, సంస్థల పేర్లు రహస్యంగా ఉంచారు. వీటిని తనిఖీ చేసి ముందుగా వాటిని పరీక్షించేందుకు మూడు ఫోరెన్సిక్ బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఐదుగురు అధికారులు ఉంటారు. వీరంతా ఇవాంక ఆహారాన్ని పరిశీలిస్తారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆమెకు వడ్డించే ఆహారాన్ని కూడా ఈ అధికారుల బృందం పరిశీలించనుంది. మరో బృందం ఆమెకు హోటల్‌లో అందించే ఆహారాన్ని పరీక్షిస్తుంది. ప్రోటోకాల్‌లో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. అయితే ఇవాంక పర్యటన గురించి అడిగితే మాత్రం అధికారులు పెదవి విప్పడం లేదు. ఎక్కువ సమాచారం ఆమె గురించి ప్రచారం జరిగినా చివరి క్షణంలో భద్రతా అధికారులు ఆమె పర్యటన రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు అంటూ ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.