ఆంధ్రప్రదేశ్‌

నిఘా వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31:తుని సంఘటన మరోసారి ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. జరగబోయే పరిణామాలను అంచనా వేయడంలోనూ, తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వపరంగా జరిగిన తప్పిదాల్లో గత ఏడాదిన్నర కాలంలో ఇది రెండవదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కరఘాట్ ప్రమాదం మొదటిది కాగా తుని సంఘటన రెండోది. కాపుఐక్య గర్జన హింసాత్మకంగా మారకుండా అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర జనాభాలో 20 శాతం వరకు ఉన్న కాపు,బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాల దృష్టిలో తిరుగులేని నేత. కొన్ని సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోకుండా ఉన్న ముద్రగడ 22 సంవత్సరాల క్రితం అటకెక్కిన కాపులకు రిజర్వేషన్లు అనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
బాబు హామీలేంటి?
అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని, సాలీనా వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని టిడిపి ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. అలాగే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా టిడిపికి పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి ఆధిక్యం సాధించిందంటే కాపుల మద్దతూ కారణమే. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు నిలబెట్టుకోలేకపోయారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కమిషన్‌ను నియమించారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అయితే కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌పై కప్పదాటు వైఖరి అవలంబించారని కాపు వర్గాల్లో ఆక్రోశం మొదలైంది.
గతంలో కాపులకోసం ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం సహజంగానే వారికి నాయకుడయ్యారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఆయన నాలుగు సందర్భాల్లో ఆమరణ దీక్ష చేశారు. పట్టువదలని ‘దీక్షా’దక్షుడిగా ఆయనకు కాపు వర్గంలో బలమైన పట్టు ఉంది. రెండు నెలల క్రితం చంద్రబాబు వ్యవహారశైలిని విమర్శిస్తూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. బహిరంగ సభ నిర్వహణ కూడా హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదు. మూడు నెలల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాపు గర్జనకు సీమాంధ్ర జిల్లాలన్నిటినుంచీ కాపులు భారీ సంఖ్యలో తరలివస్తారనే సమాచారం ప్రభుత్వానికి ముందే అందింది. తదనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే పరిస్థితి హింసాత్మకంగా మారితే ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేదు. మరోవైపు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో పేరొందిన ముద్రగడను అంచనా వేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. గతంలో ఆమరణ దీక్ష చేస్తూ తనను తాను తన ఇంట్లో నిర్బంధించుకున్నారు. ఈ పరిణామానికి విస్తుపోయిన ప్రభుత్వం ఆయనను బయటకు రప్పించేందుకు నానా యాతనలూ పడింది. ఇలాంటి నేపథ్యమున్న ముద్రగడ అనూహ్యమైన నిర్ణయమేమైనా తీసుకోవచ్చని ప్రభుత్వం పసిగట్టలేకపోవడం విచిత్రం. కాపు గర్జనలో ముద్రగడ మాట్లాడుతూ హఠాత్తుగా రైల్ రోకో, రాస్తారోకోకు పిలుపునివ్వడం ద్వారా ఒక్కసారిగా ప్రభుత్వాన్ని ఊహించని చిక్కుల్లో పడేశారు. వైకాపాతో ముద్రగడ మిలాఖత్ అయ్యారంటూ ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వం పాకులాడిందే తప్ప చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని సొంత పార్టీలోని నేతలే వ్యాఖ్యానించడం విశేషం.
సభాస్థలికి పక్కనే రైల్వే ట్రాక్
తునిలో నిర్వహించిన సభా వేదిక పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ పక్కనే 16వ నంబర్ జాతీయ రహదారి ఉంది. 54 నిమిషాల సేపుమాట్లాడిన ముద్రగడ రైల్‌రోకో చేస్తామని, జాతీయ రహదారిని స్తంభింపచేస్తామని, తన కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని, తాడోపేడో తేల్చుకుందామని ప్రకటన చేశారు. దీంతో కార్యకర్తలంతా పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. రత్నాచల్‌కు నిప్పు పెట్టారు. అలాగే జాతీయ రహదారిపై బైఠాయించి వందలాది వాహనాలను నిలువరించారు.
వ్యూహం మార్చిన ముద్రగడ
ముద్రగడ ఉద్యమ సమయంలో తన వ్యూహాన్ని ఎవరితో పంచుకోరు. కనీసం ఆంతరంగికులతో కూడా మాట్లాడరు. కాపు గర్జన నిర్వహణలో కూడా తన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోలేదు. రైల్ రోకో, రాస్తారోకోకు పిలుపునిచ్చి, ప్రభుత్వానే్న కాదు, తోటి కాపు నేతలనూ ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోను చేశారు.