ఆంధ్రప్రదేశ్‌

అరాచక మూకల దురాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: తూర్పు గోదావరి జిల్లా తుని కాపుగర్జన సభలో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ముసుగులో నేరస్థుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇలాంటి ఘటన ఏ పులివెందులలో జరిగి ఉంటే ఆశ్చర్యముండేది కాదని, ప్రశాంత వాతావరణం నెలకొని ఉండే గోదావరి జిల్లాల్లో ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు. ఇది తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి దారుణమన్నారు. తాము ఎన్నికల్లో చెప్పినట్టుగా కాపు రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. అయితే బిసిల్లో చేర్చడం వల్ల బిసిలకు నష్టం కలుగుతుందనే భావనలో వారున్నందున వారికి రిజర్వేషన్లు పరిరక్షిస్తూనే 50శాతానికి పైగా హక్కు కల్పిస్తూ మరోవైపు పేద కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. తుని ఘటన జరిగిన కొద్ది నిముషాల్లోనే ముఖ్యమంత్రి తన నివాస కార్యాలయంలో డిజిపి జెవి రాముడు, మంత్రి నారాయణ, అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. రాత్రి ఏడు గంటల సమయంలో నేరుగా విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో మరోసారి సమావేశమై పరిస్థితిని పునఃసమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాపులు తనను ఎప్పుడూ ఆదరిస్తునే వచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడిన క్రమంలోనే కాపు కమిషన్ ఏర్పాటు చేసి తక్షణంగా వంద కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉండగా కాపులను బిసిల్లో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. జగన్ తండ్రి వైఎస్ ఐదేళ్ళు అధికారంలో ఉన్నా ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. విభజన తర్వాత అనేక సమస్యలతో రాష్ట్రం సతమతమవుతుంటే వాటిని అధిగమించేందుకు రాత్రింబవళ్ళు తాను కష్టపడుతూ ప్రపంచదేశాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. ఓవైపు రాజకీయదురుద్దేశంతో కుల, మత, ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతూ సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరొస్తారని ప్రశ్నించారు. అమరావతి, పట్టిసీమ, రాయలసీమ ఇలా ప్రతి అంశంలోనూ అడ్డం పడుతున్నారని, ఇప్పుడు తునిలో కాపుగర్జన పేరుతో కిరాయి రౌడీలు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని, 25 వాహనాలు, ఒక రైలు పూర్తిగా దగ్ధమైందని, ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్‌ఐలు ఎనిమిది మంది సిబ్బందితోపాటు ఐదారుగురు రైల్వే సిబ్బంది, చివరికి మీడియా వారు కూడా గాయపడ్డారని, రెండు పోలీస్టేషన్లపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాల వల్ల జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేయడం జరిగిందని, ఇందుకోసం జీఓ-30 జారీ చేశామని, చర్చ జరగకుండా జీఓ అమలు చేయడం సాధ్యం కాదని చెబుతూ.. సుప్రీం, హైకోర్టు తీర్పులను కొన్నింటిని ఉదహరించారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్ళాల్సి ఉందన్నారు. అంతేగాని దీన్ని కూడా రాజకీయం చేయాలని ఆయా పార్టీలు అడుగడుగునా తనకు అడ్డు తగులుతూ నా ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నాయని, ఇది ఎంతవరకు సరైందో ప్రజలు, కాపులే సమాధానం చెప్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోనే కాకుండా, బయట కూడా ఈ తరహా దౌర్జన్యాలకు దిగుతూ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారని, రేపు బిసిలకు కూడా అన్యాయం జరిగిపోతోందంటూ రెచ్చగొడతారా అని మండిపడ్డారు. ఈ రాష్ట్రం ఏ ఒక్క నేరస్తుడిది కాదని, అవినీతి డబ్బుతో రౌడీలను కొనుగోలు చేసి రెచ్చగొట్టి విధ్వంసం చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పోలీసులే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కాపులు విజ్ఞతతో ఆలోచించాలని, వారి ట్రాప్‌లో పడకండంటూ పిలుపునిచ్చారు. గతంలో చూస్తే ఆయా రాజకీయ పార్టీలు కాల్‌మనీ సెక్స్‌రాకెట్ పేరుతో దుర్మార్గంగా ప్రవర్తించారని, ఇప్పుడు కాపుగర్జన మాదిరిగా రేపు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో కూడా చొరబడి విధ్వంసం సృష్టించరని గ్యారంటీ ఏముందన్నారు. ఈ కార్యక్రమానికి 40 దేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇక తుని ఘటనలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ప్రత్యేక బస్సులో వారి గమ్యాలకు తరలిస్తామని చెప్పారు.

చిత్రం... విలేఖర్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు