రాష్ట్రీయం

కంచ ఐలయ్య అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 3: వివాదాస్పద రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యను ఖమ్మం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలో జరుగుతున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రే ఐలయ్య ఖమ్మం చేరుకున్నారు. ఈ మహాసభకు అనుమతి ఉన్నప్పటికీ పాల్గొనేందుకు ఐలయ్యకు అనుమతి లేదని పోలీసులు ముందునుంచే చెపుతూ వచ్చారు. ఆదివారం మహాసభల ప్రాంగణానికి వెళ్లేందుకు సీపీఎం కార్యాలయం నుంచి తన అనుచరులు, సీపీఎం కార్యకర్తలతో కలిసి రోడ్డుపైకి వచ్చిన ఐలయ్యను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా సీపీఎం శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో తోపులాట జరిగింది. నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలతో పాటు పోలీసులు భారీగా సీపీఎం కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఐలయ్యను కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు. ఐలయ్యను తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ప్రభుత్వం భయపడుతోంది
*ఐలయ్య ధ్వజం
తనవద్ద గన్ను లేదని, కేవలం పెన్ను మాత్రమే ఉందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని ఐలయ్య వ్యాఖ్యానించారు. అరెస్టు సమయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందరికీ సమన్యాయం చేస్తామంటున్న ప్రభుత్వం అవకాశవాద ధోరణిని అవలంబిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, టీఆర్‌ఎస్ నేతల అంతుచూసే వరకు వదలనని హెచ్చరించారు. ఇదిలావుంటే, ఐలయ్య అరెస్టును నిరసిస్తూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తమ సభలో పాల్గొనేందుకు వచ్చిన అతిథిని అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఖండించారు. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసుకునే సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉక్కుపాదం మోపుతోందని, దీన్ని ప్రజల మద్దతుతో తిప్పికొడతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

చిత్రం..ఖమ్మంలో ఐలయ్యను అరెస్టు చేస్తున్న పోలీసులు