రాష్ట్రీయం

ముంచుతున్న గండికోట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, డిసెంబర్ 4: కరవు సీమకు జీవనాడి అయిన గండికోట జలాశయంలో నీటి నిల్వపై అధికారుల అంచనాలు తారుమారవుతున్నాయి. జలాశయం ముంపు గ్రామాల లెక్కల్లో ఇంజినీర్ల అంచనాలు తప్పా యి. ఫలితంగా గండికోట బ్యాక్‌వాటర్ ముందే గ్రామాలను ముంచెత్తుతోంది. దీంతో ముంపువాసులు అధికారులపై మండిపడుతున్నారు. ఓ పక్క నీళ్లు ఊళ్లలోకి వస్తుంటే ఏంచేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సీమకు జీవనాడి అయిన గండికోట జలాశయాన్ని 26.68 టీఎంసీ సామర్థ్యంతో కడప జిల్లాలో నిర్మించారు. ఈ జలాశయం నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో సుమారు 2.6 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. జలాశయం కింద 22 గ్రామాలు ముంపునకు గురవుతాయని అప్ప ట్లో ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. మొదటి విడతగా 14 గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. రెండో విడత సర్వే కొనసాగుతోంది. జలాశయంలో సోమవారానికి 7.5 టీఎంసీ నీరు నిల్వ ఉంది. మండల కేంద్రమైన కొండాపురం శివారులోకి గండికోట బ్యాక్‌వాటర్ చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాస్తవానికి కొండాపురం మూడో విడత సర్వేలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కడప జిల్లాలో కోల్పోయిన పట్టు సాధించడానికి పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గండికోట
జలాశయంలో ఈ ఏడాది 12 టీఎంసీ నీరు నిల్వ చేసేందుకు పూనుకుంది. తద్వారా వామికొండ, సర్వారాయసాగర్‌తో పాటు పులివెందులకు నీటిని తరలించాలని సంకల్పించింది. ఈక్రమంలో గండికోటలో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇంజినీరింగ్ అధికారుల నివేదికల ప్రకారం మొదటి విడత 14 ముంపు గ్రామాల ప్రజలకు రూ.480 కోట్ల పరిహారం పంపిణీ చేసింది. మలివిడతలో ముంపునకు గురయ్యే గ్రామాల్లో చేపట్టిన సర్వే కొనసాగుతోంది. గతంలో ఇంజినీరింగ్ అధికారుల నివేదికల మేరకు జలాశయంలో కనీసం 12 టీఎంసీ నీరు నిల్వ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా గోరకల్లు, అవుకు జలాశయం మీదుగా గండికోటకు తరలిస్తోంది. ప్రస్తుతం గండికోట జలాశయంలో 7.50 టీఎంసీల నీరు నిల్వ చేశారు. జలాశయంలోకి 22 టీఎంసీల నీరు చేరినప్పుడు మండల కేంద్రమైన కొండాపురం మునకకు గురవుతుందని గతంలో అధికారులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలు తారుమారు చేస్తూ 7.50 టీఎంసీల నీటి నిల్వకే కొండాపురం వద్దకు గండికోట జలాలు చేరుకున్నాయి. దీంతో కొండాపురం ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నీటి నిల్వ మరింత కొనసాగితే తమ గ్రామం మొత్తం నీట మునుగుతుందని భయపడుతున్నారు. గ్రామంలోకి నీరు చేరిన విషయం తెలుసుకున్న స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆర్డీవో నాగన్న గ్రామానికి చేరుకోగా ప్రజలు అడ్డుకుని నిర్బంధించారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలకు సర్దిచెబుతున్నారు. రెండో విడత సర్వే కొనసాగుతున్నందున బాధితులకు సరైన న్యాయం జరిగేంత వరకు నీటి విడుదల ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సర్వే పూర్తి, పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు గండికోట జలాశయంలో ఇంతకుమించి నీరు నిల్వ చేయకుండా స్థిరత్వాన్ని కొనసాగించాల్సన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గండికోట జలాశయంలో 7.30 టీఎంసీలకే ఈ పరిస్థితి ఉంటే గరిష్ఠంగా 26.78 టీఎంసీల నీరు నిల్వ చేస్తే మరెన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే.
చిత్రం..గండికోట జలాశయం బ్యాక్ వాటర్
కొండాపురం గ్రామ శివారులోకి చేరిన జలాలు