రాష్ట్రీయం

లోయలో పడిన మినీ వ్యాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, డిసెంబర్ 8: తూర్పు గోదావరి జిల్లా చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన మినీ వ్యాను (టాటా ఏస్) లోయలోకి బోల్తాపడిన దుర్ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే నలుగురు మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. జిల్లా కేంద్రం కాకినాడకు చెందిన పలువురు నాలుగు మినీ వ్యాన్లలో చింతూరు హైస్కూల్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మెగా క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం అర్ధరాత్రి వారంతా చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు మీదుగా కాకినాడకు వాహనాలపై తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలు ఘాట్ రోడ్డుపైకి ఎక్కుతున్న సమయంలో ఒక వాహనం నుంచి పొగలు రావడంతో, వాహనాలను ఆపి పలువురు కిందకు దిగారు. ఆగివున్న వాహనాల టైర్లకింద డ్రైవర్లు రాళ్లుపెట్టారు. పొగ వస్తున్న వాహనాన్ని పరిశీలిస్తుండగా, ఆ వాహనం
టైరు కింద ఉన్న రాయి ఛిద్రమై వెనుకకు కదిలి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తాకిడికి రెండో వాహనం వెనుకకు కదలడంతో కిందికి దిగిన ప్రయాణికులు అప్రమత్తమై, ఆ వాహనం లోయలో పడకుండా రహదారి పక్కనే ఉన్న గుట్టకు ఢీకొట్టించడంతో ప్రమాదం తప్పింది. పెనుముప్పు తప్పిందని వారంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తొలుత పొగలు వచ్చిన వాహనం టైరు కింద ఉన్న రాయి మళ్లీ ఛిద్రమై వేగంగా వెనుకకు కదిలింది. కిందవున్నవారు ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నంచేసినా ఫలించలేదు. వాహనం వేగంగా దూసుకువెళ్లి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనతో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మందిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.
ప్రమాదం విషయాన్ని చింతూరు 108కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. చింతూరు సిఐ దుర్గాప్రసాద్ మోతుగూడెం, చింతూరు సిఆర్పీఎఫ్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తంచేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడివున్న క్షతగాత్రులను తాడు సాయంతో బయటకుతీశారు. మృతదేహాలను కూడా వెలికితీశారు. క్షతగాత్రులను 108 తదితర వాహనాల్లో చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో కాకినాడకు చెందిన కడవటి సుజిత (40), ఇంద్రపాలెంకు చెందిన వాసంశెట్టి సుశీల (50), కొండయ్యపాలెంకు చెందిన సుమితా కుమారి (40), విశాఖకు చెందిన కె వరలక్ష్మి (50), రఘు ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. గుజ్జు రమ, గుజ్జు గ్లోరి, కోశెట్టి సత్యవేణి, కోశెట్టి అనిత, కోసు విక్టర్, మంగతాయారు, రాణి గాయపడినట్టు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాలకు చింతూరులో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు చింతూరు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

చిత్రం..ప్రమాద ప్రాంతంలో మృతదేహాలను వెలికి తీస్తున్న దృశ్యం