రాష్ట్రీయం

చకచకా.. కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాధారమైన, ప్రతిష్ట తీసుకువచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన, శరవేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరిలో పుష్కలమైన నీరు ఉందని, ఈ నీటిలో తెలంగాణ వాటా ప్రకారం పూర్తిస్థాయిలో నీటిని వాడుకునే హక్కు ఉందని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ మొదలుకుని గంధమల్ల, బస్వాపూర్ వరకు ఉన్న ప్రతినిర్మాణంపై క్షుణ్ణంగా సమీక్షించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేవని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మిషన్ భగీరథ పనులు చేపడుతున్నందు వల్ల, ఈ పనులు వేగంగా పూర్తికావలసి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరిదశ పర్యావరణ అనుమతి త్వరలోనే వస్తుందని, తాజా నిర్ణయాలకు అనుగుణంగా డిజైన్లు, ఇతర నిర్మాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అంతరాష్ట్ర ఒప్పందాలు పూర్తయ్యాయని, దీనికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి ఈ ప్రాజెక్టుకు 25 వేల కోట్ల రూపాయలు కేటాయించామని, మరో 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చుకుంటున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులను తక్కువ సమయంలో సాధించిన అధికారులను కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీలు, కాలువలు, టనె్నళ్లు, పంప్‌హౌజ్‌లు, సబ్-స్టేషన్లు, స్విచ్‌యార్డుల నిర్మాణ పనులపై ఒక్కొక్కటిగా సీఎం సమీక్షించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్‌తో పాటు ఏడు పాత జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందించాల్సి ఉందని గుర్తు చేశారు.
విద్యుత్తు శాఖ పనితీరు భేష్
విద్యుత్ శాఖ పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా
అభినందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ మూడేళ్లలో విద్యుత్ పరిస్థితి అద్భుతంగా మెరుగుపరిచారని, జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి, ప్రభాకర్‌రావును ఇతర అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని ప్రశంసించారు. జనవరి 1 నుండి వ్యవసాయానికి 24 గంటల పాటు ఇస్తున్నామని, అన్ని రంగాలకు కూడా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలో మొదటిస్థానంలో ఉన్నామని, ఇప్పటికే మూడువేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, మరో 500 మెగావాట్లు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా ట్రాన్స్‌కో చేసిన ఏర్పాట్లు బాగా ఉన్నాయని, అనుకున్న దానికంటే నెలన్నర ముందే ఈ పని పూర్తి చేయడం సంతోషకరమన్నారు. మొత్తంమీద విద్యుత్తు శాఖ పనితీరుపై తాను చాలా తృప్తిగా ఉన్నానంటూ ప్రకటించారు.
హరీశ్‌పై కోటి ఆశలు
నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా హరీష్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్టత్రో కుదిరిన ఒప్పందం అంశంలో హరీష్ ప్రత్యేక శ్రద్ద వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. ఇక నుండి ప్రతి 10 రోజులకు ఒక సారి హరీష్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని, నెలకోసారి తాను కూడా సిఎస్‌తో కలిసి కాళేశ్వరం పనులు చూస్తామని తెలిపారు. మేడిగడ్డ నుండి మిడ్ మానేరు వరకు నీళ్లు తీసుకురావడం ముఖ్యమని, ఈ పనులు పూర్తి చేసేందుకు 200 రోజులు చేతిలో ఉన్నాయన్నారు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నెలన్నరలో భగీరథ నీళ్లు
మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందని ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేందుకు అధికారులు కూడా గట్టిగా పనిచేయాలని కోరారు. ఈ పథకం గొప్పగా నడుస్తోందని, మరో నెలన్నరలో 98 శాతం గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్ భగీరథకు అవసరమైన నీరు అందించాల్సి ఉందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం అసరమయ్యే నీటిని అందించేందుకు కొత్తూరు వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ పనుల్లో వేగం పెంచాలని సిఎం ఆదేశించారు. హరీష్‌తో పాటు ఇఎన్‌సి మురళీధర్ ఈ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
సమీక్షలో సిఎం సూచనలు, అభిప్రాయాలు
* కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు సాధించేందుకు పిసిసిఎఫ్ పికె జాతో పాటు ఇతర అధికారులు బాగా శ్రమించారు. విద్యుత్ టవర్లు, లైన్లు నిర్మించేందుకు కూడా అటవీ శాఖ సహకరించాలి.
* కాళేశ్వరం నుండి సింగూరు, ఎస్‌ఆర్‌ఎస్‌పి, మిడ్‌మానేరుకు నీరు అందితేనే భగీరథ అమలు చేయగలం. ఈ అంశాన్ని అందరూ గమనించాలి.
* ప్రతి బ్యారేజ్‌పై డబల్ లేన్ రోడ్డు వేయాలి. విద్యుత్ సబ్‌స్టేషన్లు, కాలువలు,పంప్ హౌజ్‌లకు శాశ్వత ప్రాతిపదికన రోడ్లు నిర్మించాలి.
* ప్రతి పంప్ హౌజ్ వద్ద ఒక విద్యుత్ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించి, నీటిపారుదల శాఖతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి.
* ప్రతి బ్యారేజీ వద్ద అతిథి గృహం, హెలిపాడ్‌లను నిర్మించాలి.
* అన్ని పనులు సమాంతరంగా జరగాలి.
* బ్యారేజీల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలి. సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాజెక్టు వద్ద కమాండ్ కంటోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
* మేడిగడ్డ వద్ద 365 రోజులు నీళ్లు ఉంటాయి, అందువల్ల ఎంత పని జరిగితే అంత నీటిని ఉపయోగించుకోవాలి.
* అన్ని బ్యారేజ్‌ల వద్ద విద్యుత్ లైన్లతో పాటు జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలి.

చిత్రం..కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్