రాష్ట్రీయం

అవినీతి అనకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/ రాజమహేంద్రవరం/నల్లచెరువు, డిసెంబర్ 12: వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలపై దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ (46) ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు జరిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆజాద్ పని చేస్తున్న రాజమండ్రితోపాటు విజయవాడ, హైదరాబాద్, నూజివీడు, ఏలూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. కుటుంబ సభ్యుల పేరిట అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఊబిచెర్లలో సోలార్ పవర్ ప్లాంటు నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. పలు అవినీతి ఆరోపణలపై ఆజాద్ ఆరుసార్లు శాఖాపరమైన విచారణలు ఎదుర్కొన్నారు. విలాసవంత జీవనం ఇష్టపడే ఈయన యూరప్, చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాలు చుట్టి వచ్చాడని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా 2000లో విధుల్లో చేరాక శ్రీకాళహస్తి, విజయవాడ, వేములవాడ, పెనుగంచిప్రోలు, శ్రీశైలం వంటి చోట్ల ఈవోగా పనిచేసి, ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఆర్‌జేసీగా పని చేస్తున్నారు.
అక్రమాస్తుల చిట్టా..
ఆజాద్ సంపాదించిన ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. విజయవాడ గుణదలలో 2128 చదరపు అడుగుల్లో భవంతి, కృష్ణాజిల్లా గొల్లపూడిలో తన భార్య పేరుతో భవంతి,
హైదరాబాద్ గడ్డిఅన్నారంలో 665 చదరపు అడుగుల ఫ్లాట్ ఉన్నట్లు దాడుల్లో గుర్తించారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పెనమలూరులో 200.44 చదరపు గజాలు కొనుగోలు చేసినట్లు, గొడవర్రులో వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు.
బినామీ పేర్లతో..
భార్య శివకుమారితోపాటు ఇతర బినామీ పేర్లతో ఆజాద్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. శివకుమారి పేరుతో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 1735 చదరపు అడుగుల ఫ్లాటు, 12లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి సామాగ్రిని గుర్తించారు. బినామీ పేర్లతో అనంతపురం జిల్లా ఉబిచెర్లలో అభేద్య సోలార్ పవర్‌ప్లాంట్‌పై ఏసీబీ సీఐ ప్రతాప్‌రెడ్డి సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. తన సోదరుడు వివేకానంద పేర బినామీ పేర్లతో 36 ఎకరాల భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని సోలార్ ప్లాంట్‌కు బదిలీ చేయించినట్లు తమ విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వివేకానంద కారు డ్రైవర్ సాంబశివ ద్వారా లక్ష్మణరావు, అతని భార్య పేర ఈ భూములు రిజిస్టర్ చేయించారు. అనంతరం కుటుంబ సభ్యుల పేరుమీద సుమారు 18కోట్లు పెట్టుబడులతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు ప్రస్తుతం కొనసాగుతోంది.
ఏలూరు ఫత్తేబాద సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలా, విజయవాడ విద్యుత్ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున రూ.కోట్ల విలువైన ఐదు అంతస్తుల భవనం, గొల్లపూడిలో రూ.కోటిన్నర విలువైన 500 గజాల స్థలంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని గుర్తించారు. కొన్ని ఆస్తులు ఆయన సోదరుడు దేవీ వివేకానంద పేరుతో వున్నట్టు తేలింది. తన వద్ద పనిచేస్తున్న వాచ్‌మెన్ల పేర్లపై కూడా కొన్ని ఆస్తులను బినామీగా పెట్టినట్టు గుర్తించారు.
చరాస్తులు..
పదిలక్షల రూపాయల విలువైన గృహోపకరణాలు, లక్షా 25వేలు ఎస్‌బిఐ ఆర్‌డి బ్యాలెన్స్, ఆజాద్ పేరుతో లక్ష రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, భార్య పేరుతో 4లక్షలు రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, ఆరు లక్షల రూపాయలు రికరింగ్ డిపాజిట్‌తోపాటు హైదరాబాద్‌లోని కెనరా బ్యాంకులో లాకర్‌ను తెరిచారు. ఇందులో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి తనఖా పెట్టిన మూడు కోట్ల విలువైన డాక్యుమెంట్లు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ డిఎస్పీలు గోపాలకృష్ణ, సుధాకర్‌రావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం భాస్కర్‌నగర్ కాలనీలోని ఆజాద్ నివాసం, సిటిఆర్‌ఐ రోడ్డులోని కార్యాలయంలో సోదాలు జరిపారు. సోదాల అనంతరం రాజమహేంద్రవరం నుంచి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకెళ్ళారు. ఆజాద్ అవినీతి గురించి తెలిసినవారెవరైనా లిఖితపూర్వకంగా తెలియజేస్తే, వారి పేర్లను గోప్యంగా వుంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆజాద్‌ను ఏసిబి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిజి ఆర్‌పి ఠాకూర్ తెలిపారు.
విజిలెన్స్ విచారణకు రెండు జీవోలు ..
శ్రీకాకుళంలో ఆయన పనిచేసినపుడు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. శ్రీశైలంలో పనిచేస్తున్నపుడు ఆయనపై వేదపండితులు, అర్చకులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలులో పనిచేసేటపుడు అన్నదానానికి కొనుగోలు చేసిన వస్తువుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. విజయవాడ దుర్గ గుడి ఈవోగా పనిచేసినపుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈయనపై విచారణ జరిపించాలని విజిలెన్స్ శాఖను ఆదేశిస్తూ గతంలో రెండు జీవోలు కూడా విడుదలయ్యాయి.
చిత్రం..ఆజాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు