రాష్ట్రీయం

ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి నడుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/ బుచ్చినాయుడు కండ్రిగ, జనవరి 22: రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్‌లో నిర్ణయించిన ప్రకారం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే రానున్న ఎన్నికల్లో ఏ ఇతర ఆలోచనలు లేకుండా బీజేపీతో కలసి నడవడానికి తాను సిద్ధమేనని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 68వ రోజైన సోమవారం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పాదయాత్ర సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ప్రభావం అంతగాలేదన్న జగన్, రాష్ట్భ్రావృద్ధికి దన్నుగా నిలిచి ప్రత్యేక హోదా కల్పిస్తే బీజేపీతో జతకట్టడానికి వెనుకాడనన్నారు. 2014 ఎన్నికల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడన్నారు. అందుకు కారణం నరేంద్రమోదీ, జనసేన నేత పవన్ కల్యాణ్ టీడీపీ వెంట ఉండటంతోపాటు చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలిచ్చి మోసం చేయడమేనన్నారు. బాబు ప్రజలనే కాకుండా నరేంద్ర మోదీని కూడా తప్పుదారి పట్టించారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తనపై కేసులు పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్‌ను వీడిన తరువాతే తనపై కేసులు బనాయించారన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు ఇంకా ఆపదవిలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
అధికారమిస్తే దళితులకు ఎన్నో చేస్తా
రానున్న ఎన్నికల్లో వైకాపాకు అధికారం ఇస్తే దళితులకు వారి భూములు వారికి ఇప్పించి ఉచితంగా బోర్లు వేయిస్తానని, దళిత మహిళలకు పక్కా ఇళ్లు కట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తానని, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.2000 పెన్షన్ ఇప్పిస్తానని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైకాపా అధ్యక్షుడు జగన్ చేపట్టిన మహా సంకల్ప పాదయాత్ర సోమవారం చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పల్లమాలలో సాగింది. ఈక్రమంలో రాయలసీమ జిల్లాల్లో జగన్ పాదయాత్ర ముగిసినట్లయింది. కాగా పల్లమాలలో జరిగిన దళితుల ఆత్మీయ సమావేశంలో జగన్ ఉద్వేగంగా, ఉత్సాహంగా మాట్లాడారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తీసుకొస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం వారి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడితే అదనపు చెల్లింపులు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేయగలిగిన ఘనుడు చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రకరకాల వేషాలు వేసి ప్రజలను నమ్మించి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను అటకెక్కించారన్నారు. తాను అధికారంలోకి రాగానే విద్యార్థులకు యేడాదికి రూ.20,000 ఉపకార వేతనంగా అందిస్తానన్నారు. శ్రీసిటీలో స్థానికులకు ఉద్యోగాలిచ్చే విధానాన్ని అమలు చేయిస్తానన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలు నీచాతినీచమైనవన్నారు. దళితులు స్నానం చేయరని, చదువుకోరని ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం ఎంత వరకు ధర్మమన్నారు. మరోమంత్రి అచ్చెన్నాయుడు ఒక ఎస్సీ మహిళా అధికారిని కాలితో తన్నినా చర్యలు లేవన్నారు. మరోవైపు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని వ్యాఖ్యానించడం దళితుల పట్ల వారికున్న చిన్నచూపునకు అద్దం పడుతుందన్నారు. దళితుల అసైన్డ్భూములను ఆక్రమించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో 33లక్షల ఎకరాలను, 22లక్షల మంది దళితులకు అందించినట్లు చెప్పారు. ఆయన భూములిస్తే చంద్రబాబువాటిని లాక్కొంటున్నాడన్నారు. తాను ప్రకటించిన నవరత్నాలు దళితులకు వరప్రసాదాలని చెప్పారు. దళితుల చిట్టిపిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్నారు. అపుడే దళిత కుటుంబాల తలరాతలు మారుతాయన్నారు. పాదయాత్ర ముగిశాక ఎస్సీ గర్జన నిర్వహించి అవసరమైతే డిక్లరేషన్ చేస్తానన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, నారాయణ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..పల్లమాల పాదయాత్రలో వృద్ధులను పలుకరిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్