రాష్ట్రీయం

పెట్టుబడులకు పయనీర్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: ఉద్యాన పంటల సాగును ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నామని, రానున్న కాలంలో ఆంధ్రను ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక స్థితిగతులను వ్యవసాయం మరింత పరిపుష్టం చేయాలన్నది తమ లక్ష్యమని, లాభసాటి సాగు ధ్యేయంగా పనిచేస్తున్నట్లు బాబు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి, ప్రాంతానికో ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం ఆహ్వానం మేరకు 4 రోజుల పర్యటనకు దావోస్ వెళ్లిన బాబు బృందానికి జ్యూరిచ్‌లో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా తొలిరోజు ‘పయనీరింగ్ వెంచర్స్’ చైర్మన్ రోన్‌పాల్, చీఫ్ ఇనె్వస్టర్ ఆఫీసర్ సందీప్ రాజ్‌తో సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడుల సాధనకు టెక్నాలజీని వినియోస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పరిమితమై ఉన్న ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు విస్తరించాలన్న దార్శనికతతో పనిచేస్తున్నామన్నారు. కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినా వ్యవసాయంలో వృద్ధిరేటు పెరిగిందని, వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, రెయిన్ గన్లు, మొబైల్ ఇరిగేషన్ లాంటి రక్షక చర్యలతో వ్యవసాయ రంగం రెండంకెల వృద్ధిని సాధించిందని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు దేశంలోనే తొలిసారిగా సెన్సర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నట్లు
చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ రాష్ట్రం ఒక్క ఉద్యానరంగంలోనే 30 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఆక్వా రంగాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశామని, ఆక్వాలో దేశంలోనే తమ రాష్ట్రం నెంబర్-1 అని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి ప్రణాళికతో రండి. మీకు అన్ని విధాలా సహకారం అందజేస్తాం. సింగిల్ డెస్క్ విధానం ద్వారా అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తున్నాం. నాదీ భరోసా’ అన్నారు. ‘్ఫర్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ తరహాలో పాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా పెద్దఎత్తున సహకార సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీ ప్రయాణాలు సాఫీగా జరుగుతాయి. సరుకు రవాణా సులభతరం అవుతుందని’ చంద్రబాబు వివరించారు. ఈ సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
ఐదువేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం: రోన్‌పాల్
జ్యూరిచ్‌లో పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రోన్‌పాల్ స్పందిస్తూ పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే తమ సంస్థ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని, రానున్న ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పెట్టుబడులు వెచ్చించాలని నిశ్చయించామన్నారు. ఆంధ్రలో వ్యవసాయాభివృద్ధిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ సవివరంగా ప్రకటిస్తామన్నారు.
జ్యూరిచ్‌తో సిస్టర్ స్టేట్ ఒప్పందం
చంద్రబాబు సమక్షంలో జ్యూరిచ్, ఆంధ్ర అధికారులు సిస్టర్ స్టేట్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణ, ప్రాంతీయాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. ఒప్పందానికి ముందు బాబుతో జ్యూరిచ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్ వాకెర్ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్ సాటర్, జ్యూరిచ్ ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజర్ కొరిన్ వ్యేర్ భేటీ అయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాల్లో జ్యూరిచ్ ఎంతో పటిష్టంగా ఉన్నట్లు బాబుకు కార్మెన్ వాకెర్ వివరించారు. ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యూరిచ్ తరపున ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్, ఉప మంత్రి బ్యూన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బృందంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జ్యూరిచ్‌తో సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకుంటున్న దృశ్యం