రాష్ట్రీయం

కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 23: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత, సినీ నటుడు కొణిదెల పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశంలో కులాలను విస్మరించి రాజకీయాలు చేయలేమని, అన్ని కులాలను గౌరవించాల్సిన అవసరముందని అన్నారు. ఆఖండ భారత్ విడిపోయినప్పుడు.. పాకిస్తాన్ ముస్లిం దేశంగా, భారత్ హిందు దేశంగా కొందరు చెప్పారని, కానీ మన నాయకులు మాత్రం తమది సెక్యులర్ దేశమని చెప్పారని, అందుకే లౌకికవాద దేశంగా మనది మిగిలిపోయిందని తెలిపారు. మంగళవారం కరీంనగర్ శివారులోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పవన్ సమావేశమై మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ఏ పార్టీలైనా సిద్దాంతాలు లేకుండా ముందుకు వెళ్లలేవని, జనసేనకు సంబంధించి ఏడు సిద్దాంతాలను ప్రకటించారు. కులం, మతాలను కలిపే ఆలోచన విధానం, అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటాలు, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, పర్యావరణాన్ని కాపాడటమే పార్టీ లక్ష్యమని అన్నారు. మార్చి 14లోగా పూర్తి ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన అవసరముందని అన్నారు. నిజమైన అభివృద్ధి, అవినీతి రహిత సమాజం ఒక్క రోజులో సాధ్యంకాదని, పాతికేళ్ల సుదీర్ఘ యుద్ధానికి అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ నిచ్చిందని అన్నారు. 2009లో కొండగట్టు అంజన్న తనను కాపాడారని, అందుకే ఈ గడ్డపై నుంచే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. తెలంగాణ నేల తల్లికి ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో నిబద్ధత, బాధ్యతతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని అన్నారు. నేను పెరిగింది ఎక్కువగా తెలంగాణలోనేనని, తెలంగాణ భావోద్వేగం నాలో ఉంది కనుకే తెలంగాణ అంటే చాలా ఇష్టం.. ప్రేమ అని తెలిపారు. అలాగే, తెలంగాణ యాస, భాష, సంస్కృతిని నా సినిమాల్లో ప్రోత్సహిస్తానని గుర్తు చేశారు. సంస్కృతికి గౌరవం ఇవ్వకపోతే ఎవరికైనా బాధ కలుగుతుందని, తెలంగాణ యాస, భాషను గౌరవించి ఉనికిని బలంగా చాటిచెప్పాలని అన్నారు. బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ, సదర్ ఉత్సవాలను కాపాడుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలంతా నా అన్నదమ్ములే నని, తన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. నేను ఎవరికీ తొత్తును కాదని, రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదని, విధానాలపైనే విభేదిస్తానే తప్ప మరోటి కాదని, నన్ను విమర్శించే వారిని పట్టించుకునే సమయం తనకు లేదని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమని తెలిపారు. నేను మడమ తిప్పే మనిషిని కాను, మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని వెల్లడించారు. జన సేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే నేను మీ ముందు ఎలా ఉంటానని, 2019 ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణ యువత, ఆడపడుచుల ఆకాంక్షే జన సేన ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ ఆశయాల కోసం జన సేన నిలబడుతుందని అన్నారు. నాకు అండగా ఉండండి.. మీ కుటుంబంలో ఒకడిగా చూడండి, నాకు డబ్బులు అవసరం లేదని, ప్రజాభిమానం మించిన సంపద ఏదీ లేదని తెలిపారు. నాకు పునర్జన్మ నిచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాంటూ పవన్ సమావేశాన్ని ముగించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్