రాష్ట్రీయం

రిజర్వేషన్ల హామీలో కాపులూ మోసపోతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గీయులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 1996నుంచి తాము మోసపోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్ర, రాష్టస్థ్రాయిలో రెండు కమిషన్లు ఆమోదించినా తమను వర్గీకరించలేదని, మంజునాథ కమిషన్ సిఫార్సులతో కాపులను బిసిల్లో చేరుస్తారని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేసే విషయంలో చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాపులను భ్రమల్లోకి నెట్టారన్నారు. కాపుల కన్నా ఎస్సీల్లో పేదల సంఖ్య ఎక్కువని, వారిని ఇప్పటి వరకు వర్గీకరించలేదని విమర్శించారు. ఎస్సీల్లో ఎవరూ పుట్టాలని కోరుకోరని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఎస్సీల పట్ల వివక్షత వ్యక్తంచేశారన్నారు. ఆయనపై రాష్టవ్య్రాప్తంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. తుని సంఘటన, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు మతిభ్రమించిందని దుయ్యబట్టారు. కులాల ఓట్లతో ఎవరూ గెలవరన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ గత ఎన్నికల్లో కాపుల ఓట్లతోనే గెలిచానన్న ఆయన ప్రకటనను గుర్తుచేశారు. తాను ఎప్పుడూ కాపుల ఉద్యమానికి మద్దతు ప్రకటించలేదని, అయితే ఇచ్చిన హామీలపై నిలదీసే హక్కు వారికి ఉంటుందన్నారు. ఎస్సీల్లో ఓపిక నశిస్తే తుని లాంటి సంఘటనలు వెయ్యి జరుగుతాయన్నారు. అయితే తాము కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.

హంద్రీ నదిలో బయటపడిన
నవజాత శిశువుల మృతదేహాలు
కర్నూలు, ఫిబ్రవరి 9: కర్నూలు నగరం నడిబొడ్డున హంద్రీనదిలో నాలుగు నవజాత శిశువుల మృతదేహాలు బయటపడడం కలకలం రేపింది. ఒకే ప్రాంతంలో పూడ్చిపెట్టిన నాలుగు నవజాత శిశువుల మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గమనించారు. నగరంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉన్న హంద్రీనదిలో ఈ శిశువుల మృతదేహాలు బయటపడటంతో చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. తల్లిదండ్రులే మృత శిశువులను తెచ్చి ఇక్కడ పాతిపెట్టారా, లేక ఏదైనా ఆసుపత్రి నుంచి తెచ్చి పూడ్చారా అన్నది అంతుచిక్కడం లేదు. ఆడా, మగా అన్నది గుర్తించలేనంతగా మృతదేహాలు కుళ్లిపోయాయి. ఒకే చోట నాలుగు నవజాత శిశువుల మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో బయటపడడం అందరినీ కలచివేసింది. కాగా నగరంలోని హంద్రీనదిలో దొరికింది ఒకటే మృతదేహమని, నాలుగు కాదని 4వ పట్టణ సిఐ రామకృష్ణ తెలిపారు. హంద్రీలో మృతదేహాలు బయటపడినట్లు తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. మృతదేహం ముక్కలను సేకరించి ఫోరెన్సిక్ నిపుణులకు అందజేశామన్నారు.

గుణదల మాత మహోత్సవాలు ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 9: ప్రతి ఏటా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మూడురోజులపాటు జరిగే విజయవాడ గుణదల మాత మహోత్సవాలు మంగళవారం తెల్లవారుఝాము అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మొదటిరోజే లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసి హైస్కూలు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పూజా పీఠంపై విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, పుణ్యక్షేత్రం రెక్టార్ ఎం.చెన్నప్ప, గోల్డెన్, సిల్వర్ జూబ్లేరియన్స్ ఫాదర్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషఫ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు సందేశమిస్తూ కరుణించే.. దయచూపే చల్లని తల్లి మరియమాతను భక్తులు సందర్శించి అనేక మేళ్లు పొందుతున్నారన్నారు. స్రాయంత్రం గుణదల మాత స్వరూపాన్ని పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 6 గంటలకు సమిష్టి దివ్యపూజాబలి జరిగింది. లక్షలాది భక్తులు గుణదల కొండపై కొలువుదీరిన మరియమాతను, కొండ శిఖరాన వున్న ఏసుక్రీస్తు శిలువను దర్శించి మొక్కుబడులు తీర్చుకుని ప్రార్ధనలు చేసారు.
కలకలం రేపిన లెక్చరర్ ఆత్మహత్య
పోలీసుల అదుపులో నిందితుడు
కావలి, ఫిబ్రవరి 9: నెల్లూరు జిల్లా కావలిలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గీరా మాధవి(29) ఆత్మహత్యకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని 2వ పట్టణ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొన్నారు. స్థానిక రామ్మూర్తిపేటకు చెందిన పసుపులేటి భానుతేజ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతూ మృతురాలితో పరిచయమై అది ప్రేమగా మారినట్లు సమాచారం. అయితే వారిద్దరి మధ్య వివాహం విషయంలో అంతరాలు పెరగగా చివరికి మాధవి ఆత్మహత్యకు దారితీసినట్లు మృతురాలి లేఖలు, సెల్ఫీ వీడియోలు స్పష్టం చేయడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ పట్టణ ఎస్ ఐ అన్వర్ బాషా దీనిపై విచారణ చేపట్టగా సంబంధిత యువకుడు భానుతేజాను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకొన్న మాధవి విషయంలో నేపధ్యాన్ని అర్ధం చేసుకోలేక ఆమె బంధువులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేదు. అనంతరం కొన్ని ఆధారాలు లభ్యం కాగా మృతురాలి అక్క, బావతో పాటు తల్లి శాంతమ్మ ఒకరోజు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు.
ఇద్దరు పిల్లల్ని చంపి లొంగిపోయిన తండ్రి
పాయకరావుపేట, ఫిబ్రవరి 9: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపేసిన కసాయి తండ్రి పోలీసుస్టేషన్‌లో లొంగి పోయాడు. ఈ దారుణం విశాఖ జిల్లా పాయకరావుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని నామవారం శివారు గాంధీనగరంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పాలిక సత్తిబాబు (25) నిర్మల (20) దంపతులకు మూడున్నరేళ్ల అనుప్రియ, ఏడాదిన్నర వయస్సున్న కార్తీక్ అనే పిల్లలున్నారు. వీరిది కులాంతర వివాహం. భార్యపై అనుమానంతో సత్తిబాబు తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. గొడవ విషయాన్ని సమీపంలో ఉంటున్న తల్లిదండ్రులకు నిర్మల చెప్పింది. ఇంట్లో గొడవను అత్తామామలకు చెబుతావా అంటూ సత్తిబాబు ఆగ్రహించాడు. కోపంతో పిల్లల్ని బయటకు తీసుకువెళుతున్నానని చెప్పి, గొంతునులిమి చంపేశాడు. అనంతరం పిల్లల మృతదేహాలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పాయకరావుపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో మండలి బృందం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 9: రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావిస్తామని శాసనమండలి సభ్యుల బృందం వెల్లడించింది. మంగళవారం రాజధాని సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఈ బృందం విస్తృతంగా పర్యటించింది. ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, దేవానంద్, బొడ్డు నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సి బాబురెడ్డి రాజధాని పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు రైతుల నుంచి భూమిని సమీకరించే సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయన్నారు. వాగ్దానాలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేసి రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ఉపాధి కల్పించాలన్నారు. ఇవేమీ లేకుండా రాజధాని నిర్మాణాలకు ముందుకు పోవాలని చూడటం సమంజసం కాదని హితవుపలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాకే నిర్మాణాలకు పూనుకోవాలని సూచించారు. ఇదే అంశంపై శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. అనంతరం తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి అధికారులను కలిశారు.
ఖమ్మం పట్టణంలో హీరో అఖిల్ సందడి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 9: యువ సినీ హీరో అక్కినేని అఖిల్ ఖమ్మంలో మంగళవారం సందడి చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అశ్విత్‌రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన ఆటోనడిపి అందరిని ఆశ్చర్యపరిచాడు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం వద్ద అశ్విత్‌రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన అక్కడ భారీగా జనం ఉండటంతో ఆటోనడిపి అందరికి అభివాదం చేసి ఓ ప్రైవేటు కళాశాలకు వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం తాను బసచేసిన హోటల్‌కు అశ్విత్‌రెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించి పరామర్శించారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ వచ్చి తనను కలవాలని, కుటుంబానికి అండగా ఉంటానని స్పష్టం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అశ్విత్‌రెడ్డిని నేరుగా ఇంటి వద్ద కలవకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.