రాష్ట్రీయం

వెంటాడనున్న రైల్వే కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరించినప్పటికీ రైల్వే కేసులు మాత్రం ఆందోళనకారులను వెంటాడేలా ఉన్నాయి. గత నెల 31న తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత మంది నిప్పుపెట్టిన సంగతి విదితమే. విశాఖ నుండి విజయవాడ మధ్య ఉన్న ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించటంతో పాటు, రైల్వేశాఖకు కూడా అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టి తీవ్ర నష్టం కలిగించిన అంశాన్ని రైల్వేశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దాంతో ఈ సంఘటనకు బాధ్యులుగా 45మందిని గుర్తించిన రైల్వే దర్యాప్తు బృందాలు, మరికొంత మందిని గుర్తించే పనిలో ఉన్నాయి. నిప్పుపెట్టిన సంఘటనతో సంబంధం లేకపోయినాగానీ ఆందోళనలో కాస్తంత ఉద్రేకంగా పాల్గొన్న వారిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రైల్వే దర్యాప్తు బృందాలు చాలా లోతుగా దర్యాప్తును సాగిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నష్టం కలిగించటంతో పాటు, రైలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేయటాన్ని రైల్వేశాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో కీలకమైన ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందాలు, మరింత సమాచారం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సంఘటనకు బాధ్యులైన వారిపై నమోదుచేసిన కేసులు ఎలాంటి పరిస్థితుల్లోను వీగిపోకుండా ఉండేలా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో రైల్వే దర్యాప్తు బృందాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలను తేలికగా వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ పునరావృతమవుతాయన్న ఉద్దేశ్యంతో, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన విధ్వంసంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దాంతో కాపు ఉద్యమం చల్లారినప్పటికీ, రైల్వేశాఖ ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, పూర్తి వివరాలను సేకరించటం, ఆధారాలను సేకరించటం పూర్తయిన వెంటనే రైల్వేశాఖ తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఇలాంటి కేసుల్లో రైల్వే దర్తాప్తు బృందాలు అరెస్ట్‌చేస్తే బెయిల్ లభించటం చాలా కష్టమవుతుందని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా జరిగిన వివిధ ఆందోళనల్లో రైల్వే ఆస్తులకు నష్టం కలిగించిన వారిపైనా, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపైనా నమోదైన కేసులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులను ఎత్తివేయాలని ఉన్నతస్థాయిలో పైరవీలు సాగినాగానీ, రైల్వేశాఖ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు.