ఆంధ్రప్రదేశ్‌

పంటలకు శాటిలైట్ పహారా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: ‘మీరు సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో రెండో వరసలోని మూడో మొక్క ఆకుపై పురుగు ఆశించింది... మీ భూమిలో ఫలానా ప్రాంతంలో నీటి తడి తక్కువగా ఉంది... మీ చేలో మొక్కల ఆకులు కొంత మేర రంగు మారుతున్నాయి కాబట్టి, ఫలానా తెగులు వ్యాప్తిచెందవచ్చు...’ ఇలాంటి సందేశాలు నేరుగా రైతు మొబైల్‌కు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) ద్వారా లభిస్తే... ఇంకేముంది పురుగు ఆశించిన మొక్కపై మందు చల్లడం, నీటి తడి తక్కువగా ఉన్న ప్రాంతంలో నీరు పెట్టడం, రానున్న తెగులుకు ముందుగానే రక్షణ చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంటారు... వినడానికి ఇదంతా ఒక కల్పనలా ఉన్నా, ఇలాంటి సమాచారం ముందుగానే రైతుకు అందించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. వ్యవసాయపరంగా మనకంటే ఎంతో అభివృద్ధి సాధించిన ఇజ్రాయిల్ వంటి దేశాల్లో ఇలాంటి సాంకేతికత ఎప్పుడో అందుబాటులోకి రాగా, ఆ సాంకేతికతను స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి, ఒక కొత్త విధానాన్ని రూపొందించి, రైతులకు ఉచితంగా చేయూతను అందిస్తున్నాడు ఒక యువకుడు. అతనే సూర్య సుంకవల్లి. సూర్య సుంకవల్లి ఫార్మ్‌టెక్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లాలోని రెండు మండలాల్లో ఐదు గ్రామాల్లోని ఏడు వేల ఎకరాల రైతులకు ఈ సాంకేతిక సాయం అందిస్తున్నారు.
ఇజ్రాయిల్ దేశంలో అనుసరిస్తున్న వ్యవసాయ టెక్నాలజీ ఆధారంగా మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డిసీజ్, ఫెస్ట్, ఇస్పెక్ట్స్ ఎటాక్ (డీపీఈఏ) అనే విధానాన్ని రూపొందించిన సూర్య సాగునకు సంబంధించిన సాంకేతిక సలహాలు అందిస్తున్నారు.
ఈ విధానంలో ముందుగా పొలాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను సాప్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఆకుపై అంగుళంలో నాల్గవ వంతు భాగంలోవున్న పురుగును సైతం ఈ టెక్నాలజీలో పసిగట్టి రైతును హెచ్చరిస్తుంది. గంటకు 10వేల ఎకరాల చొప్పున డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరిస్తుంది. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసిన తర్వాత సాప్ట్‌వేర్ అధ్యయనం చేసి వందేళ్ళ చరిత్రను అందిస్తుంది. పంటను ఏదైనా తెగులు ఆశించివుంటే ముందుగా హెచ్చరిస్తుంది. సూక్ష్మ పోషకాల లోపం వుంటే ఆకు రంగును బట్టి తెలియజేస్తుంది. పురుగు ఆకును ఎంతవరకు తినేసిందో కూడా తెలుపుతుంది. మొత్తం మీద నాటిన రోజు నుంచి పంట చేతికి వచ్చేవరకూ వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే తెగుళ్లు, కీటకాల దాడులను ముందుగానే గుర్తించి రైతులను హెచ్చరిస్తుంది. చేలల్లో తడి (నీరు) హెచ్చు తగ్గులను గుర్తించి ముందుగానే అప్రమత్తం చేస్తుంది. ఈ సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు రైతుకు మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం మండలాల్లోని కాతేరు, కొంతమూరు, శ్రీరంగపట్నం, మురమండ, తొర్రేడు గ్రామాల్లో శాటిలైట్ ద్వారా సాంకేతిక సాగు సలహాలను రైతులకు అందిస్తున్నారు. సుమారు 7 వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాంకేతిక పహారా పత్తి, మొక్కజొన్న, సోయ, వరి పంటలపై చేపట్టారు. రైతు భూమిలో వున్న సారవంతమైన ప్రదేశాన్ని, సారవంతం కాని ప్రదేశాన్ని ఎటువంటి మట్టి నమూనాలు సేకరించకుండానే డిపిఐఎ టెక్నాలజీ ద్వారా తెలియజేస్తుంది.
ఈ సాంకేతిక సహాయం వల్ల రైతులకు రెండు రకాల లాభాలుంటాయి. ఇందులో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తిలో కీలకమైన ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గిపోతుంది. ఎందుకంటే రైతుకు ఎరువు, పురుగు మందులు ఎక్కడ, ఎపుడు వాడాలో ముందుగా తెలియజేస్తుంది. ఇపుడు చేస్తున్నట్టుగా పొలం మొత్తం ఎరువు, పురుగు మందులు వాడనవసరం లేదు. శాటిలైట్ ఇచ్చే సమాచారాన్ని బట్టి అవసరమైన మొక్కకు మాత్రమే ఎరువు అందిస్తే సరిపోతుంది. దీనివల్ల కూలీల అవసరం కూడా తగ్గుతుంది. ఈమేరకు సాగు వ్యయం కూడా భారీగా తగ్గిపోతుంది. అలాగే పంటలకు చీడ పీడలవల్ల నష్టం వాటిల్లిన తర్వాత తీసుకునే చర్య వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ కనీసం 10 శాతం నుంచి 20 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. కానీ ఈ టెక్నాలజీవల్ల జరగబోయే నష్టాన్ని ముందుగానే గుర్తించడంవల్ల దిగుబడి తగ్గే అవకాశముండదు.
అమెరికా, రష్యా, బెల్జియం, దుబాయి, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ తదితర దేశాల్లో ప్రభుత్వం రైతుకు చాలా సాయపడుతుంటాయని అంతా భావిస్తారని, అయితే ఆ సాయం మన దేశంలో మాదిరిగా సబ్సిడీల రూపంలో కాకుండా టెక్నాలజీ రూపంలో ఉంటుందని, అందువల్లే ఆయా దేశాల్లో రైతులు అత్యధిక దిగుబడులు సాధిస్తుంటారని అనేక దేశాల్లో అధ్యయనం చేసిన సూర్య సుంకవల్లి చెబుతున్నారు. 2019 రబీ నుంచి ఈ టెక్నాలజీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సూర్య సుంకవల్లి శ్రీకారం చుట్టారు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వ్యవసాయంలో మన రైతులూ అద్భుతాలు సృష్టిస్తారని చెప్పవచ్చు.