రాష్ట్రీయం

ఉత్తరాదికి రెక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 17: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని పైడిపాల అగ్రహారం గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. గ్రామంలోని సర్వే నంబర్ 33లో శ్రీరామచంద్రప్రభు ఉత్తరాది మఠానికి చెందిన భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అంతే రెవెన్యూ అధికారులకు లక్షలు ముట్టజెప్పి కోట్ల విలువైన సుమారు 86 ఎకరాల భూములను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్‌లో తమ పేరున నమోదు చేయించుకున్నారు. మరో 184 ఎకరాల భూమిని కాజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతులు ఆందోళన బాట పట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పైడిపాల అగ్రహారం గ్రామంలో సుమారు 410 ఎకరాల భూమి శ్రీరామచంద్ర ప్రభు ఉత్తరాది మఠానికి చెందినదిగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సుమారు 15 ఎకరాలు చెరువుల రూపంలో ఉంది. మరో 25 ఎకరాల్లో పైడిపాల అగ్రహారం గ్రామం, ఏడున్నర ఎకరాల్లో శ్మశానం ఉండగా, గ్రామ కంఠానికి సంబంధించి మరికొంత భూమి ఉంది. ఇవన్నీ తీసివేయగా సుమారు 340 ఎకరాలు స్థానిక చిన్న, సన్నకారు రైతుల సాగులో ఉంది. 1938వ సంవత్సరం నుండి స్థానిక రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు అరెకరం నుండి ఐదెకరాల వరకూ కలిగివున్నారు. గ్రామం ఈనాం గ్రామంగా పిలువబడుతోంది. ఇదిలావుండగా చిన్న, సన్నకారు రైతులు 2004వ సంవత్సరంలో భూములపై తమకు హక్కు కల్పించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2004 సంవత్సరంలో సాగు చేసుకుంటున్న రైతులకు
అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉత్తరాది మఠం ప్రతినిధులూ హైకోర్టును ఆశ్రయించారు. భూములు తమ మఠానికి చెందినవని, ఎవరికీ భూములపై హక్కు లేదని స్పష్టం చేశారు. అప్పటి నుండి ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉండగా, రైతులు యధావిథిగా సాగు చేసుకుంటున్నారు. ఇటీవల కొందరు అక్రమార్కులు బడా బాబుల అండదండలతో రంగంలోకి దిగారు. స్థానిక రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుని తప్పుడు రికార్డులు సృష్టించారు. రెవెన్యూ శాఖకు చెందిన ఇన్‌ఛార్జి తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులు అక్రమార్కులు సృష్టించిన తప్పుడు ధ్రువపత్రాలకు వత్తాసు పలికారు. 33వ సర్వే నంబర్‌లోని 1-బి ఖాతా నంబరు 86 కింద శిద్దా అచ్చయ్యమ్మ, 1-బి ఖాతా సంఖ్య 84 కింద సిద్దా గంగాభవాని, 1-బి ఖాతా సంఖ్య 42 కింద యడ్ల బేతాళుడు, 1-బి ఖాతా సంఖ్య 43 కింద యడ్ల శ్రీనివాసరావు, 1-బి ఖాతా సంఖ్య 52 కింద గెడ్డం శ్రీకాంత్, 1-బి ఖాతా సంఖ్య 53 కింద వనపర్తి నాగలక్ష్మి తదితరులకు ఆన్‌లైన్‌లో 86 ఎకరాలను నమోదు చేశారు. మరో 184 ఎకరాలను 1-బి కింద ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. 184 ఎకరాలకు సంబంధించి బినామీ పేర్లు నమోదైనప్పటికీ 1-బి ఖాతాలో నమోదు కాకపోవడంతో సదరు బినామీలు సైతం ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
బ్యాంకుల ద్వారా వెలుగులోకి...
అక్రమ మార్గంలో భూములను పొందిన బినామీలు రుణాలు పొందేందుకు స్థానిక బ్యాంకులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తొండంగి గ్రామంలోని కార్పొరేషన్ బ్యాంకు, ఎ కొత్తపల్లి గ్రామంలోని గోదావరి గ్రామీణ బ్యాంకు, తుని పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు బినామీలు దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో రుణాల మంజూరుకు నిరాకరించారు. ఈ విషయం భూములను సాగు చేసుకుంటున్న రైతులు, ప్రజలకు తెలిసి తీవ్ర విస్మయానికి గురయ్యారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు శనివారం తొండంగి మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. సుమారు 80 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఈ భూముల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగా బినామీలకు ఎలా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు లక్షలు ముట్టజెప్పడంతో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ వ్యవహారం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి, బాధ్యులైన అధికారులు, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దారు శానాపతి అప్పారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి, నిందితులను కఠినంగా శిక్షించేవరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.

చిత్రం..ఉత్తరాది మఠానికి చెందిన భూములు