రాష్ట్రీయం

ఎంపీల తీరువల్లే హోదా రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పార్లమెంటులో ఎంపీలు సవ్యంగా వ్యవహరించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ, వైకాపా నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేదా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని ఆయన పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగిన జాయింట్ ఫైండింగ్ కమిటీ ముగింపు కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడారు. తెలంగాణ అంశాలను కూడా పరిశీలిస్తున్నామని, వాటిని కూడా ఆంధ్రా ప్రత్యేక హోదా అంశాలతో అనుసంధానం ఎలా చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని, ఎంపీలు సరిగా పనిచేయకపోవడంతోనే ప్రత్యేక హోదా రాలేదని జనసేన అధినేత ఆరోపించారు. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధుల కేటాయింపుపై జనసేన ఆధ్వర్యంలో నిజనిర్థారణ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ మేధోమథన సమావేశం విజయవంతం అయిందని అన్నారు. ప్రత్యేక హోదా, హామీల అమలు విషయంలో తాము ఎందుకు ఇంత గట్టిగా పోరాడుతున్నామో అర్థం చేసుకోవాలని పవన్ అన్నారు. అప్పట్లో రాజకీయ అనుభవజ్ఞులు కొద్దిమంది అనుకుని ఆంధ్రా, తెలంగాణలను కలిపారు. తెలంగాణకు అండగా నిలబడతాం అని చెప్పారు. అయితే వాటిని పాటించకపోవడం వల్ల దశాబ్దాలపాటు సమస్య పేరుకుపోయి జఠిలమై, తెలంగాణ విడదీయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇపుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెడితే ప్రజల్లో విసుగు వచ్చేస్తుందని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనూ ఎంపీలు సరిగా స్పందించలేకపోయారని, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లలేకపోయారని, ఇపుడు ఎన్‌డిఎ ప్రభుత్వం హయాంలోనూ అదే జరుగుతోంది. దీనివల్ల రాజకీయ నాయకులు లబ్ది పొందవచ్చేమో అని అనుకుంటున్నారు, కాని అంతిమంగా నష్టపోయేది ప్రజలు మాత్రమేనని పవన్ వ్యాఖ్యానించారు.
ఒకసారి తప్పు జరిగిపోయింది, విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను కలిపారు, తర్వాత వాటిని కలిసి ఉంచవచ్చని పెద్దమనుషులు చెప్పారు, అది చేయలేకపోవడంతో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలు కోల్పోయారు. అది సమసిపోయిందనుకున్నారు, నివురు గప్పిన నిప్పులా ఉన్న ఉద్యమం బద్ధలై 10 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మా రాష్ట్రం మాకు కావాలి, మీరంతా వెళ్లిపోండి అనే పరిస్థితికి దారితీసింది అని అన్నారు. రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారని, స్వాతంత్య్రానంతరం జరిగిన ఈ సమస్య ఇపుడు విద్యార్థులకూ తగిలే పరిస్థితి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. ఇంకోసారి ఈ తప్పు జరగకుండా ఉండాలనే ఖచ్చితమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అందుకు ఇది కేవలం మొదటి మెట్టుమాత్రమేనని, ఈ సమావేశంలో తెలంగాణ గురించి కూడా చర్చ వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇంకా విస్తృతంగా చూడాల్సి ఉందని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఏపీకి చాలా ఇస్తామన్నారు, తెలంగాణకు మేజర్‌గా ఇవ్వాల్సినవి ఇచ్చేశారు, అయితే తెలంగాణ విషయంలోనూ కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా మిగిలే ఉన్నాయి, దానిపై ప్రమోద్ తదితరులు బృందంగా కూర్చుని వాటిని కూడా జత పరుస్తారని అన్నారు. సమావేశంలో పవన్‌కళ్యాణ్‌తో పాటు పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు, తోట చంద్రశేఖర్, అవుట్‌లుక్ మాజీ పబ్లిషర్ మహేశ్వరి, ఆర్ధిక వేత్త డాక్టర్ అమీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆ సమాచారం లేదు
ఏపీ నుండి ఇద్దరు అధికారులు వచ్చి కేంద్రం అందజేసిన సాయంపై వివరించనున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ప్రశ్నించగా అలాంటి సమాచారం ఏమీ లేదని అన్నారు. జెఎఫ్‌సి ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీకి సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ అధికారులు ప్రేంచంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యంలను నియమించినట్టు తెలిసింది. వారిద్దరూ వచ్చి కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌లతో కూడిన కమిటీకి సహకరించనున్నట్టు తెలిసింది. ఇలావుండగా ఆదివారం విజయవాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ నిర్వహించే సభకు జనసేన మద్దతు ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.