రాష్ట్రీయం

12వేల కోట్లతో పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రైతు సంక్షేమం కోసం 2018-19 బడ్జెట్‌లో నాలుగువేల పెట్టుబడి పథకానికి 12 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ (రాజేంద్రనగర్ వ్యవసాయ వర్శిటీ)లో ఆదివారం నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సాగు భూముల లెక్కలు తేలాయని, రాష్ట్రంలో 1.62 కోట్ల ఎకరాల సేద్యపు భూమి ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఇందులో 1.42 కోట్ల ఎకరాలు రైతులకు చెందినవని, 20 లక్షల ఎకరాలు వివాదం లేని అసైన్డ్ భూములని, మరో 2.5 లక్షల అసైన్డ్ భూముల వివరాలు తెలియాలన్నారు. యాసంగికి సంబంధించి ఒక్కో ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున చెక్కులను నవంబర్‌లో ఇస్తామన్నారు. రైతులందరికీ ప్రీపెయిడ్ కార్డులు ఇచ్చే యోచన ఉందన్నారు. 2018-19 నుంచే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. నిర్మాణంలోవున్న ప్రాజెక్టులు పూర్తి చేసి 2020 నాటికి కోటి ఎకరాలకు సాగునీటిని ఇస్తామన్నారు. రాజుల ఏలుబడిలో తెలంగాణలో నిర్మించిన చెరువులు, కుంటలు గత పాలకుల నిర్లక్ష్యానికి నిరుపయోగంగా మారాయని, ‘మిషన్ కాకతీయ’తో వాటన్నింటికీ మరమ్మతులు చేస్తున్నామన్నారు. కాలువలు లేనిచోట భూగర్భ జలాల వినియోగానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం బావులకు వినియోగిస్తున్న ఆటో స్టార్టర్లను మార్చుకోవాలని, రైతు సమన్వయ సమితులు ఈ కోణంలో కృషి చేయాలని సూచించారు. సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి పథకం, సబ్సిడీలు తదితర అంశాల్లో ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఉపయోగించుకుంటే రైతులు పండించే ఆహార ధాన్యాల విలువ ఏటా లక్షా 25వేల కోట్లు ఉంటుందని, సాగుతో సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటి వరకు రైతుల కోసం ప్రత్యేకంగా ఒక సంఘం లేదని, ఇప్పుడు వచ్చిన రైతు సమన్వయ సమితులు రైతులందరికీ వేదిక అవుతాయని ప్రకటించారు. వ్యవసాయం వాణిజ్యపరమైన కార్యక్రమం కాదని, ఇది రైతుల జీవన విధానమన్నారు. ప్రతి రైతు తన పొలానికి సంబంధించినంత వరకు ‘రాజు’ అని, గతంలో అనేక వృత్తుల వాళ్లు రైతులపైనే ఆధారపడేవారని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం జరిగింది తక్కువేనని, జరగాల్సింది మరింత ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి రైతులు స్వయంగా చొరవ చూపాలన్నారు. రైతు సమన్వయ సమితులు ప్రతి గ్రామంలో రైతు వేదికలను ఏర్పాటు చేసుకుని సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. ఒక్కో వేదికకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఆయా గ్రామాల్లో ఏదోక రకమైన భూమిని సేకరించి వేదికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతు సమన్వయ సమితులు ఆటంబాంబుల్లా పనిచేయాలని ఆకాంక్షించారు. తాను తెలంగాణ కోసం ఆందోళన చేపడితే చాలామంది హేళన చేశారని, తెలంగాణ సాధించే వరకు విశ్రమించలేదని, అలాగే రైతు సమన్వయ సమితుల కూడా సంక్షేమం కోసం నిరంతరం పనిచేయాలన్నారు. సమితుల ప్రతినిధులకు అవసరమైన శిక్షణ ఇస్తామని, అధ్యయనం కోసం ఇజ్రాయిల్ కూడా పంపిస్తామని స్పష్టం చేశారు.
కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు ఏ దుకాణంలో దొరుతున్నాయో రైతులకు తెలుసని, అలాంటి ‘కుక్కల కొడుకుల’ను గుర్తించి రైతులే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. నాలుగైదేళ్ల తర్వాత నాట్లు వేసేందుకు కూడా కూలీలు దొరకకపోవచ్చని, అందువల్ల యాంత్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. యాంత్రీకరణ కోసం ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై వివిధ పరికరాలు అందిస్తోందన్నారు. మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమితుల్లో చర్చించి పంటలు వేయడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో పంటల కాలనీల కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే పంటల ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చేప్పుడు క్రమశిక్షణ పాటిస్తూ, ఏ రోజు ఎవరెవరు పంటల ఉత్పత్తులను తేవాలో నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూముల క్రయవిక్రయాల్లో సంస్కరణలు తెస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. భూముల వివరాలకు సంబంధించి ధరణి పేరుతో ఒక వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. భూమి అమ్మేరైతు, కొనుగోలు చేసే రైతులు తహశీల్దార్ నుండి ముందస్తు అనుమతి తీసుకుని తహశీల్ ఆఫీసుకు వెళితే ఒకేరోజులో భూమి మార్పు జరిగిపోతుందన్నారు. తహశీల్ ఆఫీసులో ఎవరైనా సిబ్బంది జాప్యం చేస్తే, వారిపై రోజూ వెయ్యిరూపాయల జరిమానా విధించబోతున్నామన్నారు. ఎక్కడైనా రైతు చనిపోతే భార్య లేదా హక్కు కలిగిన వారిపేరుతో ఒకటి రెండురోజుల్లోనే ఆటోమెటిక్‌గా భూముల మార్పులు జరిగిపోయేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తదితరులు మాట్లాడారు. శాసనసభ ఉపసభాపతి పద్మదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు టి. హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, సి. లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రైతు సమన్వయ సమితి ప్రాంతీయ అవగాహనా సదస్సులో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్