రాష్ట్రీయం

దండకారణ్యంలో మారణకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్/ నర్సంపేట/ భూపాలపల్లి, మార్చి 13: దండకారణ్యం దద్దరిల్లింది. పచ్చటి అడవిలో మరోమారు నెత్తురు చిందింది. బస్తర్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మంగళవారం మారణహోమం సృష్టించారు. మెరుపుదాడే లక్ష్యంగా మాటు వేసి 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టారు. సీఆర్‌పీఎఫ్ జవానే్ల లక్ష్యంగా రహదారిపై శక్తివంతమైన మందుపాతర అమర్చిన మావోలు అదునుచూసి పేల్చేశారు. భయానక పేలుడుతో కకావికలమైన జవాన్లను తుపాకులతో వేటాడారు. ఒక్కో జవాన్‌పై ముగ్గురు, నలుగురు చొప్పున తుపాకులు గురిపెట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. చత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేర్ జిల్లా అడవుల్లో ఈనెల 2న ఎన్‌కౌంటర్‌లో 10మందిని కోల్పోయిన మావోయిస్టులు అదను చూసి దెబ్బకొట్టారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, మాతృదేశం కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన ప్రతి జవాన్‌కు వందనాలర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కోసం పని చేస్తున్న 212 బెటాలియన్‌కు చెందిన 22 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు సెలవుల నిమిత్తం స్వగ్రామాలకు వెళ్లారు. వీరంతా సెలవుల అనంతరం
మంగళవారం భద్రాచలం చేరుకొని స్థానిక బెటాలియన్ క్యాంపులో రిపోర్టు చేశారు. ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై సుకుమా జిల్లాలో ఉన్న కిష్టారం వెళ్లి అక్కడి పోలీసుస్టేషన్‌లో రిపోర్టు చేశారు. అక్కడి నుంచి 6కి.మీ. దూరంలోని కాసారం క్యాంపునకు ప్రత్యేకమైన్ ప్రొటెక్టెడ్ వాహనాల్లో బయలుదేరారు. అయితే వీరి కదలికలను ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు కిష్టారం సమీపంలోని పలోడి అటవీ ప్రాంతంలో మాటువేశారు. రహదారికి అడ్డంగా మైన్‌ఫ్రూవ్ వాహనాన్ని సైతం పేల్చివేసే శక్తివంతమైన ఐఈడీ మందుపాతరను అమర్చారు. జవాన్ల వాహనాలు అక్కడకు చేరుకోగానే చెట్ల మాటునుంచి మందుపాతరలను పేల్చివేశారు. మందుపాతర పేలడంతో కకావికలమైన జవాన్లను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 9మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఏఎస్సై ఆర్కేఎస్ తోమర్‌తో పాటు హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు అజయ్ యాదవ్, మనోరంజన్ లంకా, జితేంద్రసింగ్, శోభిత్‌వర్మ, మనోజ్‌సింగ్, ధర్మేంద్రసింగ్, చంద్రలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే భారీ సంఖ్యలో బలగాలను అక్కడకు పంపారు. ఇదే ఘటనలో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన వారిని హెలికాప్టర్‌లో రాయపూర్‌కు తరలించారు. మందుపాతర పేల్చి కాల్పులకు దిగిన మావోలు మృతిచెందిన బలగాల వద్ద ఆయుధాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే మరొక వాహనం వస్తున్నట్లు భావించిన మావోలు సమీప అడవుల్లోకి పారిపోయారు. కాగా ఘటనకు ముందు మంగళవారం ఉదయం మావోయిస్టులు కోబ్రా బలగాలపై కాల్పులకు దిగారు. బలగాలు వారిని తీవ్రంగా ప్రతిఘటించాయి. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే మావోలు కోబ్రా బలగాలపై కాల్పులు జరిపి అడవుల్లోకి పరారయ్యారని తెలుస్తోంది. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగాక అదునుచూసి సీఆర్‌పీఎఫ్ జవాన్లు వస్తున్న ఒక వాహనాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో సుమారు 100మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ముందే ఊహించినా..
తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈనెల 2న జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతిదాడి తప్పదని తెలంగాణ, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ప్రతిదాడి ఉంటుందని ఇరు రాష్ట్రాల పోలీసులు ముందే భావించారు. ఈనెల 9న మావోలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దండకారణ్యంలో కూంబింగ్‌ను పెంచిన పోలీసులు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎన్‌కౌంటర్ జరిగి పట్టుమని 10 రోజులు తిరగకుండానే మావోలు తమ వ్యూహాన్ని అమలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. ఎన్‌కౌంటర్ అనంతరం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరంగా ఉన్నట్లు నిఘా వర్గాలు ముందుగానే ఊహించాయి. కానీ మావోయిస్టులు కొన్ని రోజులు వౌనంగా ఉండి బలగాలు ఊహించని సమయంలో దెబ్బకొట్టారు. మావోయిస్టులు విసిరిన అంబుష్ వ్యూహంలో చిక్కుకుని సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంతర్మథనంలో పడింది. మావోయిస్టుల ఏరివేతకు పొరుగు రాష్ట్రాల సహకారం, కేంద్ర సహాయంతో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాన స్థాయిలో బలగాలను నష్టపోవడాన్ని రమణ్‌సింగ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి అనంతరం రమణిసింగ్ మాట్లాడుతూ అస్థిత్వం కోల్పోయిన మావోయిస్టులు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెనుకబడిన సుక్మా వంటి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, అభివృద్ధిని అడ్డుకునేందుకే మావోలు ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బిక్కుబిక్కుమంటున్న మన్యం
తెలంగాణ -చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని మన్యంలో పోలీసు బలగాలు గత రెండు నెలల కాలంగా కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. మహదేవ్‌పూర్ నుండి భద్రాచలం వరకు గోదావరి నదీ పరీవాహాక ప్రాంతంలో ఇరు రాష్ట్రాల పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, సీఆర్‌పీఎఫ్ ప్లాటూన్ బలగాలు మోహరించాయి. దండకారణ్యంలో కొరకరాని కొయ్యగా మారిన మావోలను అణచివేసే లక్ష్యంతో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల పోలీసు అధికారులు మావోయిస్టుల లక్ష్యంగా సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్నారు. ఒకవైపు పోలీసులు, మరో వైపు మావోయిస్టుల పరస్పర కాల్పుల మోతతో మన్యం దద్దరిల్లుతోంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకోస్తుందోననే భయాందోళనల మధ్య బోర్డర్‌లో నివసిస్తున్న గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. పూజారి కాంకేడ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పది రోజలు క్రితం మీడియాకు ఆడియో టేపును విడుదల చేసిన విషయం పాఠకులకు తెల్సిందే. ఇదే సమయంలో అధికార పార్టీ నాయకులపై దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో మన్యంలో టీఆర్‌ఎస్ నాయకులెవరూ రాత్రిళ్లు తమ ఇళ్లల్లో ఉండడం లేదు. మరికొంతమంది నాయకులు పట్టణాలలో తలదాచుకుంటున్నారు.

చిత్రాలు..సీఆర్పీఎఫ్ బలగాలపై మావోలు దాడికి దిగిన ప్రాంతం
*సంఘటనా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాల మృతదేహాలు