రాష్ట్రీయం

భగ్గుమన్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ, కౌన్సిల్‌నుంచి సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. 11మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, కౌన్సిల్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌తో కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. తమ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట 48 గంటల పాటు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. బయట ఎక్కడ చేసినా మళ్లీ పోలీసుల అనుమతి తీసుకోవడం, పోలీసులు అరెస్టు చేయడం వంటివి జరుగుతాయి కాబట్ట గాంధీభవన్ ఆవరణలోనే దీక్ష చేయాలని నిర్ణయించి, సాయంత్రం 6 గంటలకు దీక్షకు ఉపక్రమించారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దీక్షకు మద్దతుగా బైఠాయించారు. కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ అసలు తమను ఎందుకు సస్పెండ్ చేశారో కూడా తెలియదన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన సాగుతున్నదని విమర్శించారు. నియంత పాలన గురించి ప్రజలకు తెలియజేసేందుకే తాము దీక్షకు ఉపక్రమించామని చెప్పారు. అసెంబ్లీలో సభ్యత్వం రద్దు చేసినా, ప్రజల్లో తమ సభ్యత్వం పదిలంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ తెరాసకు ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అప్రజాస్వామికంగా తమను సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇలాఉండగా ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేపట్టారన్న వార్త తెలియడంతోనే జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్‌కు చేరుకుంటున్నారు. వారికి సంఘీభావంగా బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ దీక్షలో పాల్గొననున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు దీక్ష ముగుస్తుంది. ఇలాఉండగా ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సస్పెన్షన్, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. గాంధీ భవన్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.
ఇలాఉండగా అసెంబ్లీ, కౌన్సిల్ నుంచి సస్పెండ్ కాగానే అసెంబ్లీలో విపక్ష నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో విపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించారు. మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న అంశంపైనే చాలా సేపు చర్చించారు. రాజీనామా చేసి బస్సులో ప్రజల వద్దకే వెళదామని తొలుత భావించినా, రాజీనామాలకు అధిష్ఠానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, పైగా ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నందున ఇప్పుడు రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా, ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ సుముఖత వ్యక్తం చేయకపోతే ఎలా? అని రకరకాలుగా చర్చించి చివరకు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఇలాఉండగా అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విసిరిన హెడ్ ఫోన్‌తో కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్ కంటికి గాయమైందనడం అంతా బూటకం, నాటకం అని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పినందుకే తాను సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి వెళ్ళానని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారన్నారు. తమను ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకే ఇదంతా డ్రామా చేశారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏపపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కనీసం వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. తాను అసెంబ్లీలో తన సీటులోనే కూర్చున్నా చర్య తీసుకున్నారని ఆయన విమర్శించారు.

చిత్రం..గాంధీభవన్‌లో నిర్వహించిన నిరసనలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్