రాష్ట్రీయం

కేసీఆర్ మరో చరిత్ర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ‘మరో చరిత్ర’ సృష్టించారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ సోమవారం ప్రసంగిస్తున్నప్పుడు అడ్డుకునేందుకు యత్నించిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయించడమే కాకుండా, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.
ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై అసెంబ్లీ ఆవరణలో పలువురు పలు రకాలుగా వ్యఖ్యానించారు. సమావేశాలు సజావుగా జరగకుండా ఆటంకపరిస్తే సభనుంచి సస్పెండ్ చేయవచ్చు కానీ, పూర్తిగా సభ్యత్వాన్ని రద్దు చేయడం ఎలా సాధ్యమని, సభకు, స్పీకర్‌కు ఉన్న అధికారాలు ఏమిటి? ఈ సభ్యత్వాల రద్దు కోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలబడదని, సభ్యత్వాలు రద్దు చేయడాన్ని కోర్టు కొట్టి వేస్తుందని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ, ఈ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారం ప్రకారం సభకు పూర్తి అధికారం ఉంటుంది. అది రాష్ట్రాల చట్ట సభలు కావచ్చు లేదా లోక్‌సభ, రాజ్యసభ ఏదైనా కావచ్చు. లోగడ ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోనూ పలువురు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం జరిగింది. శిబుసోరెన్ కేసునూ ఉదాహరించవచ్చు. అంతెందుకు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న వేసేందుకు 11 మంది ఎంపీలు డబ్బులు తీసుకుంటున్నారన్న అభియోగాలు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అప్పటి లోక్‌సభ స్పీకర్ సోంనాథ్ ఛటర్జీ ఆ ఎంపీల సభ్యత్వాలను రద్దు చేశారు. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయా సభల్లో మూడింట రెండు వంతుల (2/3) సభ్యుల ఆమోదంతో తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపైనా ఒక దఫా సభ్యత్వ రద్దు వేటు పడింది. బ్యాంకింగ్ సమస్యలపై విజయ మాల్యాపైనా వేటు పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి.
కొంతమంది కరణం బలరాం సస్పెన్షన్‌ను ఉదహరిస్తున్నారు. లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం అనుచిత వ్యాఖ్యలు చేశారని, సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్ను ఆరు నెలలపాటు సభకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారు. కానీ సభ్యత్వం రద్దు చేయలేదు. తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్ళినా ఫలితం దక్కలేదు. ఆమె సస్పెన్షన్ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా కోర్టు స్పీకర్‌కు సూచన చేసిందే తప్ప ఆమె సస్పెన్షన్ తప్పు అని కానీ, సస్పెన్షన్‌ను రద్దు చేయాలనో ఆదేశించలేదు. సభ, స్పీకర్ తీసుకున్న నిర్ణయం విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూనే, పునరాలోచన చేయాల్సిందిగా సూచన మాత్రమే చేసింది.
ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ నుంచి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సభ (2/3 మెజారిటీతో) నిర్ణయం తీసుకోవడం, స్పీకర్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీనిని కోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, సీఎల్‌పీ భావిస్తోంది. సభ తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. దానిని ఆమోదిస్తూ ఆ స్థానాలకు ఖాళీ ఏర్పడినట్లు సీఈసీ ప్రకటించాల్సి ఉంటుంది. అనంతరం కోర్టులో సవాల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పైగా సార్వత్రిక ఎన్నికలకు ఇక కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు వారిరువురి సభ్యత్వాలు రద్దు అయినా, వెంటనే ఉప ఎన్నికలకు అవకాశమూ లేదు. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాత సీఈసీ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల గడువుంటే ఉప ఎన్నికలు నిర్వహించరు. కాబట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును సీఈసీ ధ్రువీకరించి, ఉప ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపేందుకు సమయం పడుతుంది. అప్పటివరకు సస్పెన్స్ తప్పదు.