తెలంగాణ

తుపాకి పేలి ఎమ్మెల్యే డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం గన్ మిస్‌ఫైర్ కలకలం రేపింది. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న అబ్బాస్ అదే ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న గన్‌మెన్‌తో మాట్లాడుతూ, మధ్యలో అతని గన్ చేతిలోకి తీసుకుని చూస్తుండగా అకస్మాత్తుగా మిస్‌ఫైర్ అయినట్టు తెలిసింది.
తూటా నేరుగా గుండెల్లోకి దిగబడటంతో అబ్బాస్ అక్కడికక్కడే మరణించాడు. అయితే తొలుత అబ్బాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గన్ మిస్‌ఫైర్ అయినట్టు తేలింది. అబ్బాస్ కుటుంబ సభ్యులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. తమ కుమారుణ్ని హత్య చేసి, ప్రమాదవశాత్తూ చనిపోయాడని చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇద్దరు లేక ముగ్గురు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారని, దీంతో అనుమానాలు రేకెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. డ్రైవర్ అబ్బాస్ మృతదేహాన్ని చూసేందుకు మీడియాను అనుమతించలేదు.
విచారణ జరుపుతున్నాం
తుపాకి మిస్‌ఫైర్ ఘటనలో మృతి చెందిన అబ్బాస్ కేసును విచారిస్తున్నామని, అబ్బాస్ మహబూబ్‌నగర్ జిల్లా సైదర్‌పల్లికి చెందిన వాడని ఇన్స్‌పెక్టర్ బీమారెడ్డి తెలిపారు. తుపాకి తీసుకున్న సమయంలో అబ్బాస్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలియవచ్చిందన్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం పరిశీలించిందని దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి
స్పీకర్‌ను కోరిన టి.టిడిపి ఎమ్మెల్యేలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయండి అని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ మధుసూదనా చారిని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎ. గాంధీ కలిసి ఈ మేరకు పిటీషన్ అందజేశారు. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్‌గౌడ్, కెవి వివేకానందల శాసనసభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా వారు స్పీకర్‌ను కోరారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా చర్య తీసుకోలేదని, పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపైనా చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు. అనర్హత పిటీషన్లు పెండింగ్‌లో ఉండగా, విలీనం చేయడానికి వీలు లేదని అన్నారు. వీటన్నింటిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు.

ఓల్గాకు సాహిత్య అవార్డు ప్రదానం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 2015 సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని ఫిక్కీ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగింది. ప్రముఖ రచయిత, ‘పద్మభూషణ్’ అవార్డు గ్రహీత గోపీచంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. 24 భారతీయ భాషల్లో ఉత్తమ రచనలు చేసిన రచయితలకు ఈ అవార్డులను అందజేశారు. తెలుగు భాషలో ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఓల్గా అసలు పేరు పోపూరి లలితకుమారి.