రాష్ట్రీయం

రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రానున్న రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు వాహన తయారీదారులకు సూచించారు. ఈ సందర్భంగా 2018ని ఎలక్ట్రిక్ వాహన సంవత్సరంగా ప్రకటించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడంతో, యువతకు విస్తృతంగా ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. తయారీదారులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ త్వరలోనే పాలసీని రూపొందిస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ముందుగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా కార్యాచరణ చేపడతామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో
వాతావరణ కాలుష్యంలో వచ్చిన మార్పులను సైతం అంచనా వేస్తామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన రంగం అభివృద్ధికి గల అవకాశాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అందించాల్సిన ప్రోత్సాహంపై అధికారులు, తయారీదారులతో శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనేదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ముందుగా పదివేల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తామని చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సమావేశంలో ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో చేకూరే ప్రయోజనాలను, ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహన రంగ విధానం’ ముసాయిదాను ప్రస్తావించారు. ముందుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే యోచన చేస్తున్నామని, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఎస్‌జీఎస్‌టీలో మినహాయింపులకు పాలసీలో అవకాశం ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలతో సహా త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనాల సంఖ్య మొత్తం కోటీ 5లక్షలని అధికారులు లెక్కతేల్చారు. యూనిట్ విద్యుత్ ధర రూ.6.95గా ఉంటే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌లో కిమీ దూరం వెళ్లేందుకు రూ.1.39 వ్యయమవుతుందని, అదే పెట్రోల్ వాహనానికి రూ.3.90, డీజిల్ వాహనానికి రూ.3.25 వ్యయమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అదే యూనిట్ విద్యుత్ ధరను రూ.4కే అందించగలిగితే కిమీ దూరానికి 80 పైసలే ఖర్చవుతుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ యూనిట్లను వీలున్న ప్రతీ చోట ఏర్పాటుచేసేలా ఔత్సాహికులను ప్రోత్సహిస్తామని, ఇది వారికి మంచి ఆదాయ వనరుగా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ప్రతి అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ శాఖ ద్వారా నేరుగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు, స్టార్టప్‌లకు సంబంధించి ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రత్యేకంగా సెజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇ-రిక్షాలను నడిపేందుకు వీలుగా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో యూఎస్, చైనా, నెదర్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియాలు అగ్రగామిగా ఉన్నాయని, వాటిని అధిగమించేలా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నాయని, 2020 నాటికి వీటి సంఖ్య 90 లక్షలకు చేరుకుంటుందని, 2025 నాటికి వీటి సంఖ్య నాలుగు కోట్లు దాటుతుందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తయారీదారులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు వాహనదారులు అప్‌గ్రేడ్ కావడం వల్ల అయ్యే వ్యయ భారం, చేకూరే ప్రయోజనంపైనా ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించారు. ఈఈఎస్‌ఎల్ భాగస్వామ్యంతో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 300 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 10వేల వాహనాలు పంపిణీ చేసేందుకు ఈఈఎస్‌ఎల్‌తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదరగా, వీలైనంత త్వరలో 10వేల వాహనాలు సమకూర్చాలని ఈఈఎస్‌ఎల్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని చార్జింగ్ చేసేందుకయ్యే సమయాన్ని తగ్గించే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, ముఖ్యంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో దూసుకుపోతున్నామని ఇది ఎలక్ట్రిక్ వాహన రంగానికి శుభసూచకమని అన్నారు.
పవన విద్యుత్‌లో దేశంలోనే రాష్ట్రం అత్యధిక ఉత్పత్తి సాధించినందుకు గాను నెడ్‌క్యాప్‌కు ‘బెస్ట్ ఫెర్ఫార్మింగ్ నోడల్ ఏజెన్సీ అవార్డును’ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2016-17 సంవత్సరంలో 2,187.45 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేశామని నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ ఎం.కమలాకర్‌బాబు వివరించగా, ముఖ్యమంత్రి అభినందించారు. సమావేశంలో చివరగా ఈఈఎస్‌ఎల్‌తో సీఆర్‌డీఏ, ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, వీఎంసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
చిత్రం..ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు, అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు