రాష్ట్రీయం

మూడూ.. తెరాసకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు స్థానాలకు నలుగురు బరిలో నిలుచోగా, మొదటి ప్రాధాన్యత ఓట్లలో తెరాస అభ్యర్థులు బండ ప్రకాష్‌కు 33, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్ల చొప్పున లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు 10 ఓట్లు మాత్రమే లభించాయి. వాస్తవానికి 11 ఓట్లు లభించినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి ఓటును ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు. అందుకు కారణం దొంతి మాధవరెడ్డి తన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఉన్న పోలింగ్ ఏజెంట్ రేగ కాంతారావుకు చూపించడమే. ఓపెన్ బ్యాలెట్ విధానానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్‌గా గెలుపొందిన దొంతి తన ఇష్టానుసారం ఓటు వేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌కు ఎలా చూపిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. నిజానికి ఈ విషయాన్ని తెరాస సీరియస్‌గా పట్టించుకోవాలనుకోలేదు. కానీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయంలో సమస్య ఉత్పన్నం కావడంతో కొంత సేపు గందరగోళం, ఉత్కంఠ నెలకొంది. దీంతో రిటర్నింగ్ అధికారి వి. నరసింహాచార్యులు, పరిశీలకునిగా హాజరైన రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఇసి)ను సంప్రదించి దొంతి మాధవ రెడ్డి ఓటును పరిగణనలోకి తీసుకోరాదన్న నిర్ణయాన్ని వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. దొంతి తమ పార్టీ అనుబంధ సభ్యుడని వాదించినా, వినిపించుకోలేదు. అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడా దొంతి కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా లేదని తేల్చి చెప్పారు. అయితే దొంతి కాంగ్రెస్‌కు అనుబంధ సభ్యునిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌కు నాలుగేళ్ళ క్రితమే లేఖ ఇచ్చినట్లు కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు బలంగా వాదించారు.
ఫిరాయింపుదారులపై ఫిర్యాదు..
ఇలాఉండగా తమ పార్టీ తరఫున గెలుపొంది తెరాసలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, చిట్టెం రాంమోహన్ రెడ్డి, ఎన్. భాస్కర రావు, డిఎస్ రెడ్యానాయక్, కే. కనకయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, జి. విఠల్‌రెడ్డిలు తమ పార్టీ జారీ చేసిన ‘విప్’కు భిన్నంగా ఓట్లు వేసినందున వారి ఓట్లను పరిగణిలోకి తీసుకోరాదని రేగ కాంతారావు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించలేదు.
కౌంటింగ్ షురూ..
చివరకు గంట ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి
రౌండ్‌లోనే టిఆర్‌ఎస్ అభ్యర్థులు ముగ్గురూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు 10 ఓట్లు లభించాయి.
రుణపడి ఉన్నాం..
విజయం సాధించిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు బండ ప్రకాష్, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తమను రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు రుణపడి ఉన్నామని అన్నారు. తుది శ్వాస విడిచేంత వరకూ కేసీఆర్ మాట జవ దాటమని, పార్టీ కోసం, ప్రజల బాగోగుల కోసం అంకితమైన భావంతో పని చేస్తామని వారు చెప్పారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ కేసీఆర్‌కు అందించిన సేవల గురించి ప్రస్తావిస్తూ, సంతోష్ ‘షాక్‌అబ్జర్వర్’ వంటి వారన్నారు.
గన్ పార్కు వద్ద..
విజయం సాధించిన ముగ్గురినీ రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అభినందించారు. వారు ముగ్గురూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ ఆవరణ నుంచి గన్ పార్కు వరకూ ఊరేగింపుగా వెళ్ళారు. అక్కడ అమర వీరులకు నివాళి అర్పించి, నేరుగా టిఆర్‌ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు వారిని సన్మానించారు. కార్యకర్తలు టపాసులు కాల్చారు. అనంతరం వారు కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఓటింగ్‌కు దూరంగా..
టిడిపికి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య, ఇటీవల కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన రేవంత్ రెడ్డి ఓటింగ్‌కు హాజరుకాలేదు. బిజెపి ఎమ్మెల్యేలు ఐదుగురూ, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మజ్లీస్ మద్దతునిచ్చింది. దీంతో టిఆర్‌ఎస్‌కు ఉన్న బలానికి తోడుగా ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలూ ఓట్లు వేయడంతో ముగ్గురు అభ్యర్థులకు మొత్తం 97 ఓట్లు పోలయ్యాయి.
సిఇసి పాసులకు విలువ లేదు..
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మీడియాకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఇసి) ప్రత్యేకమైన పాసులు అందజేసింది. అయితే అసెంబ్లీలో పోలింగ్ జరుగుతున్నప్పుడుగానీ, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు గానీ ఆ పాసులు కలిగి ఉన్న రిపోర్టర్లను పోలీసులు అనుమతించ లేదు. వారంతా బయటే పడిగాపులు కాశారు. ఇసి, రిటిర్నింగ్ అధికారి ఆదేశాల మేరకే అనుమతించడం లేదని పోలీసు అధికారులు చెప్పారు. కాగా ఖద్దరు బట్టలు వేసుకుని బొకేలతో వచ్చిన సుమారు 50 మందిని అసెంబ్లీ లాబీల్లోకి అనుమతించారు.