రాష్ట్రీయం

విశ్వనగరంగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలక శాఖా మంత్రి కె తారక రామారావు చెప్పారు. శాసనసభలో శుక్రవారం 9 పద్దులపై జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణను వివరించారు. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు దశలవారీ ఎలక్ట్రానిక్ కార్లను ప్రవేశపెడతామన్నారు. జనాభాలో ప్రస్తుతం 42 శాతం పట్టణాల్లో ఉంటున్నారని, హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని పట్టణాలనూ బహిర్భూమిరహితంగా తీర్చిదిద్దామని, రానున్న రోజుల్లో వీటిని మరింత పరిశుభ్రమైన నగరాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగరాలకు కీలకమైన రెండు సమస్యలూ పరిష్కారమయ్యాయని చెప్పారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పంపిణీ పూర్తిస్థాయిలో జరుగుతోందని అన్నారు. వీధుల్లో ఎల్‌ఇడి దీపాలను అమర్చామని, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అన్ని పట్టణాల్లో కనీస సౌకర్యాలకు చర్యలు చేపట్టామని అన్నారు. తెలంగాణలోని 43 పట్టణాల అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరుచేశామని, రానున్న రోజుల్లో పట్టణ పురపాలికలను ఆర్ధిక స్వావలంబన దిశగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పన్ను పెంచకుండానే ఎక్కువ మంది నుండి పన్ను వసూలుచేస్తున్నామని పేర్కొన్నారు. డిపిఎంఎస్ ద్వారా ఇళ్లనిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి మంజూరు చేసే ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. అన్ని పట్టణాలకు క్రిసిల్ రేటింగ్ తీసుకుంటున్నామని, దీనివల్ల ఆయా పట్టణాలు ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే నేరుగా బాండ్లు జారీ చేసే వీలుందని అన్నారు. తెలంగాణలో 2.65 లక్షల డబుల్ బెడ్‌రూప్ ఇళ్లను నిర్మిస్తామని, అందులో లక్ష ఇళ్లను తెలంగాణలోనే నిర్మిస్తామని అన్నారు. ఎస్‌ఆర్‌డిపి ద్వారా వెయ్యి కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని, 3వేల కోట్లతో పనులు ఇప్పటికే చేపట్టడం అయ్యిందని, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఎల్‌ఇడి దీపాలు అమర్చడం వల్ల నెలకు 35 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు ఆదా అవుతున్నాయని అన్నారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టును వేగవంతం చేశామని అన్నారు. త్వరలో హైదరాబాద్ నగరంలో 826 ఆధునిక బస్‌షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. నాళాలపై ఉన్న 833 అవరోధాలు తొలగించామని, బస్తీల్లో దవాఖానాలు 18 ప్రారంభించామని, 20 చెరువులను 282 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక వంద కోట్లతో గంటిపేట చెరువు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న నిర్మాణ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ పెడుతున్నామని చెప్పారు. ఐదు రూపాయిలకే అన్నం పెట్టే 150 అన్నపూర్ణ సెంటర్లు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. మూసీనది సుందరీకరణ పనులు త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు. నాగోలు నుండి హైటెక్ వరకూ మెట్రో పొడిగిస్తామని, జూబ్లీ బస్ స్టేషన్ నుండి
ఎంజిబిఎస్ వరకూ మెట్రో ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు మెట్రో పొడిగింపు ఉంటుందని, ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. త్వరలోనే ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని, ల్యాండ్ పూలింగ్ పాలసీ కూడా సిద్ధం అవుతుందని చెప్పారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పూర్తిచేస్తామని వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా నిర్మిస్తామని చెప్పారు.