ఆంధ్రప్రదేశ్‌

అనంతపురం జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 17: వర్షాభావం కారణంగా తలెత్తిన కరవు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు అనంతపురం జిల్లాలో మంగళవారం నలుగురు సభ్యులున్న కేంద్ర కరవు బృందం పర్యటించింది. ఈ బృందానికి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తాగునీరు, సాగునీటి సౌకర్యం, పంట నష్టపరిహారం, పంటల బీమా, ఫ్లోరైడ్ సమస్యల్ని రైతులు, ప్రజలు ఏకరువు పెట్టారు. అలాగే పలు చెరువులు, ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణను ఈ బృందం పరిశీలించి రైతులు, కూలీలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. జిల్లాలో నెలకొన్న క్షామ పీడిత వాతావరణం, రైతాంగం, ప్రజల స్థితిగతుల్ని అంచనా వేసి, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా వాసులను ఆదుకోవడానికి అధిక మొత్తంలో నిధుల మంజూరుకు నివేదిస్తామని టీమ్ ప్రత్యేకాధికారి ముఖేష్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఒక్కరోజు పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర కరవు బృందంలో సభ్యులుగా ఉన్న బీకే.శ్రీవాత్సవ్ (డైరెక్టర్ ఇన్‌చార్జి, డీఓడీ, హైదరాబాద్), అనురాధ బటనా (రీసెర్చ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఇన్‌పుట్స్, నీతి ఆయోగ్), ముఖేష్‌కుమార్ (డిప్యూటీ డైరెక్టర్, ఎఫ్‌సీడీ ఫైనాన్స్), జీవీ.విజయ్‌కుమార్ (డీజీఎం-లీగల్, ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్) బృందం సుడిగాలి పర్యటన జరిపింది. ఈ బృందం సభ్యులు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు సమీపంలోని రక్షా అకాడమీకి చేరుకున్నారు. అక్కడి నుంచి గోరంట్ల మండలంలో పర్యటించి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చెరువును పరిశీలించారు. తర్వాత గోరంట్ల పట్టణంలో బోర్లను పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, పట్టణ ప్రజలకు శాశ్వత మంచినీటి పథకం సౌకర్యం కల్పించాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర బృందానికి విన్నవించారు. అక్కడి నుంచి పాలసముద్రం, పెనుకొండ మండలం అడదాకులపల్లి, సీకేపల్లి మండలం ప్యాదిండి, కంబదూరు మండలం తిప్పేపల్లిలో బృందం సభ్యులు పర్యటించారు. ఉపాధి హామీ పనులతోపాటు ఎండిన చీనీ తోటలు, ఎండిన బోరు బావులను పరిశీలించారు. తమకు శీతల గిడ్డంగుల సౌకర్యం కల్పించాలని, ఉపాధి హామీ నిధులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని, కరవు విలయతాండవం చేస్తోందని, వలసలు తప్పడం లేదని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు, ఉపాధి కూలీలు కోరారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కరవు పరిస్థితుల్ని వివరిస్తూ కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా నివేదించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో అనంతపురం ఆర్‌అండ్‌బీకి చేరుకున్న బృందం సభ్యులకు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసనలతో స్వాగతం పలికారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు, రైతు సంఘాల నేతలు.. బీజేపీ గో బ్యాక్, టీడీపీ డౌన్‌డౌన్, కరవు జిల్లాను ఆదుకోవాలంటూ నినాదా లు చేస్తూ, వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాపై కేంద్రానికి చిన్నచూపు తగదని, నిధులు పుష్కలంగా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం బృంద సభ్యులు జిల్లాకరవు పరిస్థితిపై వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కలెక్టర్ జీ.వీరపాండ్యన్ గత పద్దెనిమిదేళ్లుగా జిల్లాలో నెలకొన్న క్షామ పరిస్థితుల్ని కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. జాయిం ట్ కలెక్టర్ టీ.కే.రమామణి కూడా ఆయనతో పాటు ఉన్నారు.