ఆంధ్రప్రదేశ్‌

లాలూచీ రాజకీయాలతోనే రాఫెల్‌పై జగన్, పవన్ వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/ విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రపంచంలోనే భారీదిగా నిలిచిన ‘రాఫెల్’ కుంభకోణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిస్థాయి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగానే రాఫెల్‌పై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నోరు విప్పడం లేదని ఆదివారం కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన విమర్శించారు. రక్షణ విభాగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన కంపెనీతో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం గర్హనీయమన్నారు. రూ. 526 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని రూ. 1670 కోట్లకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ఒప్పందంలో ఒక్క అనిల్ అంబానీకే లక్ష కోట్ల రూపాయలు ముట్టినట్టు ఆరోపించారు. యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రూ. 59వేల కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. ఇందుకు నరేంద్ర మోదీ పూర్తిస్థాయి బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని విమర్శించే ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాఫెల్ కుంభకోణంపై ఎందుకు నోరు విప్పడం లేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలకు భయపడే వారు మిన్నకుండిపోయారని విమర్శించారు. నాలుగేళ్లుగా మోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నారు. దేశంలోని బడాబాబులకు లాభం చేకూర్చేలా పెద్దనోట్లు రద్దుచేసి సామాన్యులను ఆర్థిక వెతలకు గురిచేశారన్నారు. జీఎస్టీ వల్ల కొన్ని సంస్థలకే లాభం చేకూరిందని, మరెన్నో సంస్థలు దివాలా తీశాయని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు.

నోరు విప్పితే జైలు తప్పదనే జగన్ భయం:దేవినేని ఉమా
దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ కుదుర్చుకున్న రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై ప్రపంచమంతా మాట్లాడుతుంటే నోరువిప్పితే ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతో వైఎస్ జగన్ నోరువిప్పటం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతి ప్రయోజనాలు తాకట్టుపెడుతూ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకోవడంపై జగన్ ఎందుకు నోరువిప్పటం లేదో చెప్పాలన్నారు. నోరువిప్పాలంటే సీబీఐ కేసులు, ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా అంతా రాఫెల్ యుద్ధ విమానాలపై చర్చించటంతో పాటు స్వయంగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై మాకు సంబంధంలేదని అంటే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ కనీసం మాట్లాడడం లేదన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడే భాషకు, టీవీల్లో కూర్చుంటే ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని, ప్రజలు చాలా విజ్ఞలని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పదేళ్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి వైసీపీ పార్టీలోకి చేరాలనుకుని బేనర్లు కట్టి చివరి నిమిషంలో అమిత్‌షా ఫోన్‌తో బీజేపీ అధ్యక్షుడు అయ్యాడన్నారు. రాష్ట్రంలో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి వైసీపీ నేత సీట్లను అమ్ముకునే స్థితికి వచ్చారన్నారు. పోలవరం రివైజ్డ్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని, దాన్ని ఆమోదించి అనుమతులు ఇవ్వాలని, అందుకు 300 కేజీల డబ్బాల పేపర్లు ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపుతున్నామన్నారు. ఆన్‌లైన్‌లో కూడా సపోర్ట్ అనుమతుల పేపర్లు ఉంచామన్నారు. పోలవరంలో క్రమంతప్పకుండా వెళ్లినట్లే పనుల పురోగతిని సమీక్షిస్తున్నామని మంత్రి ఉమా వివరించారు.