ఆంధ్రప్రదేశ్‌

తుపానుతో సిక్కోల్ అతలాకుతలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 11: పెను తుపాను తిత్లీ శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు, పల్లిసారధి మధ్య గురువారం తెల్లవారుజామున తీరాన్ని తాకి, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను పెనుగాలులతో సిక్కోల్‌ను అతలాకుతలం చేసింది. ప్రచండ వేగంతో గాలులు విరుచుకుపడడంతో ఉద్దానంపై మరోసారి ప్రకృతి కరాళనృత్యం చేసింది. దీంతో జిల్లాలో ఇచ్పాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పెనుగాలులకు తోడు, భారీ వర్షం కురిసింది. 7.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ భీభత్సవం వల్ల జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన ఎం.సూర్యారావు(46), వంగర మండలం ఓనేఅగ్రహారానికి ఎంది తాటి అప్పలనర్సమ్మ (62), సంతబొమ్మాళి మండలం సున్నపల్లికి చెందిన బొంగు దుర్గారావు (50), వడ్డితాండ్రకు చెందిన అప్పలస్వామి (56), టెక్కలిలో ఆంధ్రావీధికి చెందిన కొళ్ళి లక్ష్మమ్మ (70), మందస మండంలో సువర్ణపురానికి చెందిన ఎం.సంతోష్‌కుమార్ (39), ఇప్పిలి కన్నయ్యయాదవ్ (53)లు మృతి చెందారు. పెనుగాలులు నేపథ్యంలో ప్రజలకు ముందుగానే ప్రభుత్వం హెచ్చరికలు చేయడం వల్ల ప్రాణనష్టం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. తేలినీలాపురం వద్ద వేలాది ఫెలికాన్ విదేశీ పక్షుల తిత్లీ తుపాను ప్రాణాలు తీసింది. జిల్లా అంతటా ఊడ్చుకుపోయిన తీత్లి వందలాది పశువులు మృత్యువాతపడ్డాయి. 650 కి.మీ. జాతీయ రహదారి, వాటికి కనెక్టివిటీ రోడ్డులన్నీ వరద నీటి కోతకు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఉద్దానం కొబ్బరి రైతులు మరోసారి తిత్లీ వల్ల దివాలా తీసారు. 1.98 లక్షల ఎకరాల్లో చేతికి అందివచ్చే పంట పెనుగాలులకు నేలకొరిగి కురిసిన భారీ వర్షపునీటిలో ఉండిపోయింది. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, కవిటి మండలం కొత్తపాలేం వద్ద సముద్రం ముందుకు వచ్చి అలలు ఎగిసిపడ్డాయి. 30 మీటర్లు మేర సముద్రం ముందుకు వచ్చింది. సోంపేట రహదారిలో తుపాను భీభత్సానికి తాళలేక నిలిచిపోయిన కంటైనర్లు కూడా సినిమా ఫక్కీలో పల్టీలు కొట్టాయి. పలాస రైల్వే స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. జాతీయరహదారిపై పెద్దపెద్ద వృక్షాలు సైతం నేలకొరిగిపోవడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇచ్చాపురం సమీపంలో బహుదానది వరదనీటి పెరగడంతో ఏడు గ్రామాలు నీటమునిగాయి. టెక్కలి మండలంలో నౌపడా బ్రాండ్‌గేజ్ రైల్వే లైన్ మొత్తంగా కొట్టుకుపోయింది.

హుదూద్ తర్వాత ఇదే భారీ తుపాను..
2014 అక్టోబర్ 12న విశాఖను వణికించిన హుదూద్ తర్వాత అతి పెద్ద తుపాను తిత్లీ. హుదూద్ సూపర్ స్లైక్లోన్‌గా మారడంతో గంటకు 220 కి.మీ. ప్రచండ వేగంతో గాలులు వీచి ఉద్దానాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దీని దాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం కూడా భారీగా నష్టపోయింది. సరిగ్గా నాలుగేళ్ళ అనంతరం అక్టోబర్‌లో అద తేదీల్లో తీత్లీ రూపంలో తుపాను ముంచుకొచ్చింది. గత నాలుగేళ్ళలో ఏర్పడిన తుపానుల సమయంలో 70 - 90 కి.మీ. వేగానికి మించి గాలు వీయలేదు. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకూ తిత్లీ దాటికి పెనుగాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది.

పరిస్థితులపై సీఎం సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఇక్కడ కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తిత్లీ తుపాను తీరం తాకిన నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లిన మండలాల వివరాలు, పునరావాసుకేంద్రాలు, ఇతర సహాయక చర్యలపై సమీక్షించారు. ముఖ్యంగా ఉద్దానం అతలాకుతలాన్ని, అక్కడ పరిస్థితులపై పూర్తి సమాచారంతో అధికారులు సమీక్షలో పాల్గొడంతో అక్కడ పరిస్థితులన్నీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇది పెను విపత్తు
విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను తీవ్ర నష్టం కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వీలైనంత త్వరగా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం ఉదయం అధికారులతో ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల కిందట హుదూద్ తుపాను విశాఖను అతలాకుతలం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, పలాస తదితర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. భారీ ఎత్తున జీడిచెట్లు, కొబ్బరి చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలన్నారు. పలాస మున్సిపాలిటీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రాణ నష్టం ఇప్పటి వరకూ లేదని, జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంట, ఆస్తి నష్టం భారీగా జరిగిందని, జరిగిన నష్టం తీవ్రతను విశే్లషించాలన్నారు. ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారం సేకరించాలని, నేల కూలిన చెట్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. పంట, ఆస్తి నష్టం వివరాలను సేకరించాలన్నారు. సహయ చర్యలను ముమ్మరం చేయాలని, రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. విద్యుత్ సరఫరా కూడా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సహాయ, పునరాస చర్యల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలు కూడా చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు వచ్చేలా చూడాలని సూచించారు. ఏ ప్రాంతంలో విపత్తు వచ్చినా, అందరూ స్పందించి, ఆదుకోవాలని కోరారు. నేల కూలిన చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కట్టర్లను, వర్కర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి గంట కీలకమైనదేనని, అన్ని శాఖల యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, యుద్ధప్రాతిపదికన వాహన రాకపోకలు పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బంది శ్రీకాకుళం తరలించాలని, జన జీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.

ఓ వైపు సీఎం... మరో వైపు ఆర్టీజీ
తిత్లీ తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించేందుకు ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరో వైపు రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీ) సెంటర్ యంత్రాంగం.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే పనిలో బుధవారం రాత్రి బిజీగా గడిపాయి. ఆర్టీజీ, ఇస్రో ద్వారా తుపాను కదలికలపై సమాచారాన్ని సేకరించి జిల్లా అధికారులను ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్ నుంచి ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఆర్టీజీ ద్వారా శ్రీకాకుళంలోని అధికారులకు ఆ సమచారం చేర వేశారు. ఎక్కడ గుడిసె నేలమట్టమైందో, రైలు గేటు వద్ద ఏ వాహనం ఆగిందో, తదితర సమాచారం చేరవేశారు. గోపాలపూర్ వద్ద మత్స్యకారుల సమాచారం తెలిపి, కోస్టుగార్డు బృందాలను అప్రమత్తం చేశారు. ఆర్టీజీ ద్వారా మండలాల్లోని కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందచేశారు. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, జిల్లా, మండల అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. తుపాను తీరం దాటిన వెంటనే తదుపరి రెవెన్యూ, పోలీసు, విపత్తు నియంత్రణ, వైద్య శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చేసిన సూచనలను, సలహాలను క్షేత్ర స్థాయికి ఆర్టీజీ చేరవేసింది. తుపాను తీవ్రత మొదలయ్యాక, తుపాను కదలిక, తీవ్రత, ప్రభావం చూపే ప్రాంతాల గుర్తింపు, గాలి వేగం, వర్షపాతం అంచనా వేసి, సీఎంకు ఆర్టీజీ అధికారులు సమచారం అందచేశారు. రియల్ టైమ్‌లో సమాచారం తీసుకుని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

నేడు సీపీఐ బృందం పర్యటన
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ బృందం పర్యటించనుంది. తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భీభత్సం సృష్టించింది. ఇప్పటికే 8 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కే రామకృష్ణ నేతృత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం పర్యటించనుంది.

ఆర్టీజీఎస్ సేవలు భేష్!
తిత్లీ తుపానును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా వ్యవహరించిన రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ కమాండ్ సెంటర్‌కు గురువారం వచ్చిన ముఖ్యమంత్రి తుపానును ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్ సిబ్బంది పని చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. తుపాను గమనాన్ని పర్యవేక్షించేందుకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. కంటికి రెప్ప వేయకుండా తుపాను బలహీన పడే వరకూ చేసిన కృషిని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది మంచి పాఠమని వ్యాఖ్యానించారు. లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. కాగా తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్‌లోని ఏపీ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (అవేర్) కచ్చితంగా అంచనా వేసింది. తుపాను ఎక్కడ, ఎప్పుడు తీరం తాకుతుంది, తీరం దాటుతుంది, గాలి వేగం, వర్షపాతం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేసింది. ఆర్టీజీఎస్ సీఈవో బాబు.ఎ రాత్రంగా ఆర్టీజీఎస్ కమాండ్ సెంటర్‌లోనే ఉండి, పర్యవేక్షించారు. 1100, ఆర్టీజీఎస్ సిబ్బంది కూడా రాత్రంగా పని చేసి, ప్రజలను అప్రమత్తం చేయడంలో తమ పాత్ర పోషించారు. ఉత్తరాంధ్రలో 15 లక్షల మంది మొబైల్స్‌కు సంక్షిప్త సందేశాలు పంపారు. 45 వేల మందికి ఫోన్లు చేశారు.

బూరవిల్లిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం!
తిత్లీ తుపాను, తీరం దాటుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. గార మండలం బూరవిల్లిలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 42.62 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. సోంపేట మండలం బాతూరంలో 20.9 సెంటీమీటర్లు, పలాసలో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

పునరావాస చర్యలు చేపట్టాలి: జగన్
తిత్లీ తుపాను ప్రభావంతో అపార నష్టానికి గురైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్షణ సహాయకర్యలు ప్రారంభించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. తుపాను ధాటికి రెండు జిల్లాలు సర్వనాశనమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపశమన, పునరావాస పనులను చేపట్టాలన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు రెండు జిల్లాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.