ఆంధ్రప్రదేశ్‌

నిధుల కేటాయింపు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిధుల కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్‌కిశోర్ సింగ్ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో వివిధ పార్టీలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా సర్పంచ్‌తో పాటు తమకూ నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కోరారు. 14వ ఆర్థిక సంఘం ఈ నిధుల కేటాయింపును నిలిపివేసిందని తెలిపారు. దీనివల్ల తమకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 13వ ఆర్థిక సంఘం మాదిరిగా 15వ ఆర్థిక సంఘం తమకూ నిధులు కేటాయించాలని కోరారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని నిధులు కేటాయించాలని కొందరు సూచించగా, జిల్లా పరిషత్‌కు నిధులు కేటాయించకపోవడం దారుణమని కొందరు వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్థిక సంఘం చైర్మన్ సింగ్ స్పందిస్తూ ఈ కేటాయింపులపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. నిర్భయంగా తమ అభిప్రాయాలను చెప్పాలని, అప్పుడే గ్రామీణ ప్రాంతాలకు న్యాయం చేయగలమన్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ 10 నుంచి 13వ ఆర్థిక సంఘం వరకూ సర్పంచ్‌లకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించాయని గుర్తుచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించకుండా, పంచాయతీలకు మాత్రం అరకొరగా కేటాయించిందన్నారు. దీంతో గ్రామాల్లో సౌకర్యాల కల్పన కష్టంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవస్థలు బలోపేతం కావాలంటే నిధుల కేటాయింపు ముఖ్యమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నిధులు కేటాయించాలన్నారు. జీఎస్టీలో ఒక శాతం నిధులు గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థలకు కేటాయించడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యవౌతుందన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ జిల్లా పరిషత్‌కు రూపాయి కూడా ఆర్థిక సంఘం నిధులు కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారని, ఈమేరకు అదనపు నిధులు కేటాయించాలన్నారు. తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకపోవడం వల్ల డమీలుగా మారిపోయామని వ్యాఖ్యానించారు. ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చొరవతో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులు వినియోగిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా పీపుల్లీ జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా ప్లానింగ్ కమిటీలు ఏర్పాటు చేయలేదని, జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. నిధుల కేటాయింపునకు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలన్నారు. కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు పీసీ సాంబశివమ్, నరసన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పి కృష్ణ, బద్వేల్ ఎంపీటీసీ సభ్యుడు డి రామసుబ్బారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా గుడివాడ సర్పంచ్ అంబటి సూర్యప్రకాశరావు, కర్నూల్ జిల్లా గుడిబంద జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి కూడా నిధుల లేమి వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉపయోగించుకుని 24వేల కిలోమీటర్ల మేర సీసీరోడ్లు నిర్మించామన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆర్థిక సంఘం సభ్యులు ప్రశ్నించగా, రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతోందని జవహర్‌రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిర్వహిస్తామన్నారు. ఆర్థిక సంఘం చైర్మన్ సింగ్ మాట్లాడుతూ ఇద్దరు సర్పంచ్‌లు మినహా మిగిలిన వారందరూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.