ఆంధ్రప్రదేశ్‌

కడపలో రమేష్ ఇంటిపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు ఇంటిపై ఐటీ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లగుత్తి గ్రామంలోని సీఎం రమేష్ సోదరుల గృహ సముదాయాలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఢిల్లీతో పాటు కడప జిల్లాలోని స్వగ్రామంలో ఉన్న ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. దాడులు జరిగిన సమయంలో రమేష్‌నాయుడు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. పోట్లగుత్తిలోని స్వగృహంలో ఆయన సోదరుడు సురేష్‌నాయుడు ఐటీశాఖ అధికారులు అడిగిన పత్రాలు, బంగారు నగల వివరాలు అందజేసినట్లు సమాచారం.
కాగా ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో కొంతమంది రమేష్‌నాయుడు మద్దతుదాలు అక్కడకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, ఐటీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీఎం రమేష్‌నాయుడు ఇళ్లలో ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఆరోపించారు. సోదాల అనంతరం రమేష్‌నాయుడు సోదరుడు సురేష్‌నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ తాము చట్టబద్ధంగానే వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నామని అన్నారు. అక్రమంగా సంపాదించింది గానీ, పన్నులు ఎగవేసింది గానీ లేదన్నారు. బంగారు నగలు మాత్రమే అంచనా వేసుకుని పోయారని అన్నారు. తెలుగుదేశం నేతలపై జరుగుతున్న ఐటీ దాడులను ప్రశ్నిస్తూ కేంద్రానికి లేఖ రాసినందునే కక్షసాధింపుతో ఈ పని చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
దమ్మూధైర్యం లేకే రాష్ట్రంపై ఐటీ దాడులు
గుంటూరు: తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే ధమ్మూధైర్యం లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులను నిరసిస్తూ గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతబట్టి, నల్లజెండాలు ఎగురవేశారు. ఈసందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం పోరాడిన వారిపై ఐటీ దాడులు చేయడం దారుణమన్నారు. సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్ శాఖలను బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన సీఎం రమేష్‌పై ఐటీ దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకుడు బీదా మస్తాన్‌రావు వ్యాపారాలతో ఎంతోమందికి ఉపాధి కల్పించారని, సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించారని, అలాంటి వ్యక్తిపై ఐటీ దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన పోతుల రామారావుపై కూడా కక్షగట్టి ఐటీ దాడులు చేయించారన్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనుచరులపై కూడా ఇలానే దాడులు చేశారని, ఢిల్లీలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. జగన్ లక్ష కోట్లు దోచుకుంటే ఈడీ రూ. 43వేల కోట్ల వరకు ఎటాచ్ చేసి కేసులు పెడితే అవి నత్తనడకన సాగేలా కేంద్రం సహకరిస్తోందన్నారు. అక్రమ ఆస్థుల కేసులో శశికళ వంటివారు కూడా జైలుకు వెళ్లారని, అంతకంటే పదింతలు దోచుకున్న జగన్‌ను ఎందుకు జైలుకు పంపడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. దేశానికి ద్రోహం చేసినవారిని వదిలేసి బీజేపీకి వ్యతిరేకమైన పార్టీల వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. ఈ దాడులతో బీజేపీ రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు.
‘హోదా’ కోసం పోరాడితే ఐటీ దాడులు చేయిస్తారా?: జవహర్
విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు కోసం పోరాడిన వారిపై కేంద్రం అక్రమంగా ఐటీ దాడులు చేయిస్తోందని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి జవహర్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా, తెలుగు ప్రజలు భయపడరన్నారు. ఆత్మగౌరవం కోసం మరింత కసితో పని చేస్తారన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలో టీవీ దినకరన్‌పై ఐటీ దాడులు చేయించడాన్ని గుర్తుచేశారు. అయినా దినకరన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఐటీ, సీబీఐ లాంటి రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఒకవైపు తుపాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం అతలాకుతలమైతే, సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు చేయడాన్ని బీజేపీ కుట్రగా ఆరోపించారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారిపై మాత్రం దాడులు చేయడం లేదన్నారు. టీడీపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక తొక్కేయాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి జవహర్ హెచ్చరించారు.
కేంద్రం కుట్ర: మంత్రులు ఆనందబాబు, అమరనాథ్‌రెడ్డి
గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులు కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనందబాబు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని, అక్రమ దాడులకు తెలుగు ప్రజలకు భయపడరని, ఆత్మగౌరవం కోసం మరింత ధైర్యంతో ఎదుర్కొంటారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాల తీరును దేశవ్యాప్తంగా అందరూ ఈసడించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడుల కోసమే సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తమిళనాడు, కర్ణాటక, యుపి, ఢిల్లీలోనూ రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికలకు ముందు ఇదే రీతిలో దాడులు చేయించారని ఆయన గుర్తుచేశారు. అక్కడ ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూశామని, రాష్ట్రంలో కూడా బీజేపీని తరిమికొట్టే రోజు ముందుందన్నారు. తెలుగుదేశం పార్టీయే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడుల వల్ల రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం దెబ్బతింటుందన్నారు. గుజరాత్ కన్నా ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుండటం మోదీకి నచ్చడం లేదని, కియా పరిశ్రమను గుజరాత్‌ను తరలించేందుకు ప్రయత్నించారన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. మోదీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి వీరు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ దాడులు చేయించి, తద్వారా పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తించేలా కుట్రలు పన్నుతోందన్నారు. ఈ నాలుగేళ్లలో దేశంలో ఏ రాష్ట్రానికి రాని పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్న అక్కసుతోనే మోదీ టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారన్నారు. ఏ కోణంలో చూసినా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. పార్టనర్‌షిప్ సమ్మిట్లు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి అమరనాథ్‌రెడ్డి వివరించారు.
ప్రశ్నిస్తే దాడులా : మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు, అక్టోబర్ 12: ప్రధాని నరేంద్రమోదీ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమను ప్రశ్నించే వారిపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు అందుకు నిదర్శమన్నారు.
కడప ఉక్కు పరిశ్రమ కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేసి కేంద్రంపై పోరాడిన సీఎం రమేష్‌పై ఐటీ దాడులకు అధికారులను ఉసిగొల్పారని ఆరోపించారు. నిత్యం జనం మధ్య బతికే సీఆర్‌డీఏ సభ్యుడు బీద మస్తాన్‌రావును వారం రోజులుగా ఐటీ అధికారులు వేధిస్తున్నారని విమర్శించారు. లోక్‌సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టే సమయంలో ప్రధాని మోదీ త్వరలో అందరికీ సన్మానం జరగుతుందని ఎద్దేవా చేశారని, ఆ మాటల ఫలితమే ఈ ఐటీ దాడులని అభివర్ణించారు. బీజేపీతో లాలూచీ పడిన వైకాపాలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లేరా అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల ముందు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నారని, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంఓలో తిష్టవేసి పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు.
మోదీ, అమిత్ షా ప్రోద్బలంతోనే
విజయవాడ: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రోద్బలంతోనే టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతల ఇళ్లపై దాడులు నిర్వహించడం ద్వారా భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై దాడి చేయడం కుట్రగా వర్ణించారు. తుపాను సహాయక చర్యల్లో సీఎం సహా ప్రజాప్రతినిధులు ఉండగా ఐటీ దాడులు చేయడం దారుణమన్నారు. ఇవి సాధారణ దాడులేనని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇవి దుర్మార్గపు చర్యలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.