ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్‌లో పోలవరం విద్యుత్ ప్లాంట్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 13: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులు డిసెంబర్‌లో చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణాన్ని నవయుగ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం మట్టి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కొండను తొలిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సివిల్ పనులు చేపట్టి పూర్తిచేయనున్నారు. ఇటీవల ఏపీ జెన్కో ఉన్నతాధికారులు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏపీ జెన్కో పోలవరం పవర్ హౌస్ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఎస్‌ఎస్ కొలగాని మూర్తి పనులను ఉన్నతాధికారులకు వివరించారు. ఈసందర్భంగా డిసెంబర్‌లో సివిల్ పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధంచేశారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం జల విద్యుత్ ప్లాంట్‌ను రూ.4205.66 కోట్ల అంచనాతో చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి అఖండ గోదావరి ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పనులు జరుగుతున్నాయి. అవసరమైన భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులవుతున్న ఆదివాసీలకు ఇంకా భూమికి భూమి ఇవ్వాల్సివుంది. అనువైన భూమిని నిర్వాసితులకు అప్పగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. విశిష్టమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైన మొత్తం యంత్రాంగానికి అక్కడనే జెన్కో క్వార్టర్స్ కూడా నిర్మించనుంది. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుని విద్యుత్ ఉత్పత్తిని అతి తక్కువ ధరకు చేయడానికి అవకాశం ఉండటంతో మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూపకల్పనచేశారు. అంగుళూరు గ్రామం వద్ద మొత్తం 450 ఎకరాల్లో ఒక్కోటి 80 మెగావాట్ల సామర్ధ్యం గల 12 హైడల్ యూనిట్లు నిర్మాణం చేయనున్నారు. ప్లాంటు మట్టి తవ్వకం పనులు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగానే జరుగుతున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి తర్వాత గోదావరి నదిలోకి కాటన్ బ్యారేజి వైపు నీరు విడిచిపెడుతుంది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచే కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరం నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది.
ఈ విద్యుత్ కేంద్రాన్ని మొత్తం 58 నెలల్లో పూర్తిచేయడానికి ప్రణాళిక ఏపీ జెన్కో చేసింది. 40 నెలల్లో మూడు యూనిట్లు, మిగతా 9 యూనిట్లను 18 నెలల్లో పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. ఏజీ జెన్కో జల విద్యుత్ కేంద్ర నిర్మాణం, నిర్వహణలో దేశంలోనే రెండవ స్థానంలో వుంది. అనుభవం కలిగిన ఇంజనీర్లు ఉండటంవల్ల నిర్ధేశిత సమయానికి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులో వస్తుందని అంచనావేస్తున్నారు.
మట్టి పనులు పూర్తికావడమే తరువాయి వెంటనే సివిల్ పనులు మొదలుపెట్టడానికి ఏపీ జెన్కో సిద్ధంగావుంది. దీనికి తోడు నవయుగ సంస్థ టర్బైన్లు కూడా అక్కడిక్కడే తయారుచేసే విధంగా సాంకేతికత జాయింట్ వెంచర్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి అతి తక్కువ ధరకు విద్యుత్ లభ్యంకానుంది.