ఆంధ్రప్రదేశ్‌

సేవల రంగంతో సుస్థిర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వారంగాలపై ప్రత్యేక దృష్టి * ప్రణాళికా విభాగంతో సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్ 9: సేవల రంగంతోనే సుస్థిర అభివృద్ధిని సాధించ గలమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. దీంతో పాటు వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఆక్వారంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా 20 శాతం వృద్ధిరేటు సాధ్యపడుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం ‘కాంపిటీటివ్‌నెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్’ అంశంపై ప్రణాళికా విభాగంతో మూడవ వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్టీజీ, సామాజిక, కుటుంబ వికాసం, సుస్థిర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) దేశాభివృద్ధి సూచికలలో నమూనాలుగా నిలిచాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అత్యధిక సంతృప్తి శాతం సాధించి ముందువరుసలో నిలిచిందన్నారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రం 6.2 శాతం వృద్ధిరేటు నమోదు కాగా తాము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో తమ ప్రత్యేక దార్శనిక దృష్టితో 10.5 శాతం వృద్ధిరేటు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం 11.22 శాతం వృద్ధిరేటు ఉందని దీన్ని 16 శాతానికి చేర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జాతీయ రహదారుల పరిధిలో పారిశ్రామిక నడవాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు కుదిరిన ఎంఓయూల్లో ఎన్ని కార్యాచరణలో ఉన్నాయనే అంశాలతో దార్శనిక పత్రాన్ని రూపొందించాలని కోరారు. నాణ్యమైన గాలి, మంచినీరు, సేవలు, వౌలిక సదుపాయాలతో అత్యధిక సంతృప్తి స్థాయికి రాష్ట్రాన్ని పయనింప చేయాలని ఆకాంక్షించారు. కళాత్మక సంబరాలు, క్రీడా పోటీలు, బాలలు, యువత, పెద్దలు ఆనందంగా ఆహ్లాదంగా జీవించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు చెప్పారు. రైతుబజార్లను ఆధునీకరిస్తామని, గిరిజన సహకార సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, శిల్పారామాలతో ప్రజలకు ఆనందాన్ని అందించేందుకు అనువైన వాతావరణం కల్పించామన్నారు. గతంలో వ్యవసాయానికి నీటి లభ్యతలేదని, నదుల అనుసంధానం, పట్టిసీమతో పాటు మైక్రో ఇరిగేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. జలసంరక్షణ చర్యలతో రైతులకు భరోసా ఇచ్చామన్నారు. చిత్తూరులో టెక్స్‌టైల్ పార్క్, ఓర్వకల్లులో ఫార్మా, రామాయపట్నం, కాకినాడ, విశాఖ, ఇచ్ఛాపురం, దొనకొండ, అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేలలో పారిశ్రామిక కారిడార్లకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను అభివృద్ధిచేసి ఎగుమతి, దిగుమతులకు అనువైన పరిశ్రమలు తేవాలన్నారు. అన్ని రంగాల్లో వృద్ధిరేటు కనిపించటం లేదన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందని, ఉత్పాదక రంగంలో జీవీఏ పడిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. పరిశ్రమలు ఎక్కడున్నాయో.. వృద్ధిరేటు ఎంత అనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలన్నారు. కియా మోటార్స్ తెచ్చాం.. ఆటోమొబైల్స్, మొబైల్ పరిశ్రమలు వచ్చాయి...పారిశ్రామికాభివృద్ధి అత్యంత కీలకమన్నారు. గత మూడేళ్లుగా సేవారంగంలో జీవీఏ అంతగా వృద్ధి చెందలేదన్నారు. తమిళనాడులో 53 శాతం ఉందని, తెలంగాణలో ఇతర రంగాలు క్షీణదశలో ఉన్నాయని సేవారంగంలో 9 శాతం వృద్ధిరేటు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, బిజినెస్ స్కూల్, రింగ్‌రోడ్డు, వీటన్నింటివల్ల అక్కడ ఆదాయం ఎక్కువగా ఉందన్నారు.
వ్యవసాయంతో పోల్చితే ఉద్యానవనరంగంలో నష్టాలు తక్కువగా ఉన్నాయని స్థిరమైన వృద్ధిరేటు సాధించాల్సి ఉందన్నారు. హార్టీకల్చర్, అగ్రికల్చర్, ఆక్వా ఈ మూడు రంగాలు సమతుల్యంగా అభివృద్ధి చెందితే వృద్ధిరేటు పెరుగుతుందని వివరించారు. సంబంధిత విభాగాలతో వర్క్‌షాప్ నిర్వహించుకుని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతులను వీలున్నచోట వనరులున్న ప్రదేశాల్లో వ్యవసాయ రంగం నుంచి ఆక్వా రంగానికి మళ్లించాలని అప్పుడే రైతుల ఆదాయం రెట్టింపు కాగలదన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగం ఫోకస్ అప్రోచ్‌తో లక్ష్య సాధనకు పనిచేయాలని నిర్దేశించారు. వ్యవసాయ రంగం ఆధారంగా ఆహారశుద్ధి, పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలైన ఉద్యానవన, ఆక్వా, పాడిపరిశ్రమల అభివృద్ధిపై మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ రంగాలపై దృష్టిసారిస్తే 20 శాతం వృద్ధిరేటు సాధించగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. 2014-18లో సాధించిన విజయాలు, 2019-24లో సాధించాల్సిన నిర్దేశిత లక్ష్యాలు, వ్యూహాత్మక సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకైనా సేవారంగం ముఖ్యమన్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్లు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వచ్చేందుకు హోటళ్ల నిర్మాణం జరగాలన్నారు. పర్యాటకులు రెండురోజులు గడిపి వెళ్లే విధంగా వౌలిక సదుపాయాలు ఉండాలని, దుకాణ సముదాయాలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. టూ, త్రీ, ఫోర్ స్టార్ హోటళ్ల అభివృద్ధితో పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విశాఖ, అమరావతిలో రిసార్టులు వస్తున్నాయని పర్యాటకులకు అనేక ఆకర్షణలు ఉన్నాయన్నారు. దేశంలోనే సువిశాలమైన సముద్రతీరం కలిగిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వాటర్‌ఫ్రంట్, ఎకోటూరిజం ఆకర్షణలు ప్రత్యేకతలన్నారు. కనె్వన్షన్ సెంటర్ రానుందని ఎకో, హెల్త్ టూరిజం తరహాలో అనేక శాఖల పర్యాటకం అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.

వృద్ధిసాధనకు సేవా రంగం
వృద్ధి సాధనకు సేవా రంగం తోడ్పడుతుందని చెప్పారు. స్టార్టప్స్ రావాలని ఇలాంటి ఎకో సిస్టం సర్వీస్ సెక్టార్‌లో నిర్మించాలని వివరించారు. నగర ప్రాంతాల్లో 6లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం.. రాజధాని అమరావతిలో 15-20 లక్షల మంది నివసించే అవకాశం ఉంది.. బయటి ప్రాంతాల్లో అమరావతి ప్రాంత పిల్లలు 2 నుంచి 4 లక్షల మంది వరకు చదువుకుంటున్నారు.. ఇక్కడే ప్రపంచస్థాయి విద్యాసంస్థలు నెలకొల్పితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సేవారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణప్రాంతాల్లో మురికివాడలు భవిష్యత్తులో అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్‌లు, దుకాణాలు ఏర్పాటు కావాలన్నారు. ఆ విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇవాళ రూపొందించిన భవిష్యత్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి పనిచేద్దామని ఉద్బోధించారు. కోల్డ్‌చెయిన్‌లు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులకు ఫుడ్ కోర్టులు, హోటళ్లలో రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి దొనకొండ ఇండస్ట్రియల్ హబ్ దోహదపడుతుందన్నారు. మచిలీపట్నం రేవు పూర్తయితే ఈ ప్రాంత స్వరూపమే మారిపుతోందని, పోర్టుల అభివృద్ధితో పెనుమార్పులు తెస్తామని స్పష్టంచేశారు.