ఆంధ్రప్రదేశ్‌

సమస్యలపై నోరుమెదపరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 15: అధికార పదవులు తీసుకోవడంలో ముందున్న కర్నూలు జిల్లా నేతలు సమస్యల పరిష్కారంలో వెనుకబడిపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యుడు, 11 మంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఏకంగా 15 రాష్టస్థ్రాయి పదవులు దక్కించుకున్నా జిల్లా నేతలు పార్టీ అధినేత వద్ద జిల్లా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపడంలో విఫలమయ్యారన్న అపవాదు తలకెత్తుకున్నారు. విభజన అనంతరం రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలను కర్నూలు జిల్లా ప్రజలు కట్టబెట్టారు. టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలకు రాష్ట్రంలోనే అత్యధిక పదవులు ఇచ్చి సత్కరించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా భారీ సంఖ్యలో పదవులు పొందిన నాయకులు జిల్లా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అత్యధిక శాసనసభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను కైవశం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయకులపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
అయితే జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేయడం, ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు అభివృద్ధి విషయంలో ప్రజల అసంతృప్తి, జిల్లా నుంచి నీటిని రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా జిల్లాలోని పడమర ప్రాంతాన్ని విస్మరించడం వంటి అనేక సమస్యలు టీడీపీని ముందడుగు వేయనీయడం లేదని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. జిల్లాలో టీడీపీకి బలం చేకూర్చాలన్న ఉద్ధేశ్యమో, కర్నూలు సమస్యలపై మాట్లాడకుండా ఉండాలన్న సంకల్పమో గానీ చంద్రబాబు నాయుడు జిల్లాలో ఎవరు అడిగితే వారికి ఏదో ఒక పదవి ఇచ్చి పంపారు. పదవులు అందుకున్న నాయకులు మాత్రం సమస్యల ప్రస్తావనలో చంద్రబాబు వద్దకు వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పార్టీని నమ్ముకుని 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్ నేత కెయి కృష్ణమూర్తికి అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. రెండేళ్లు ఆయన ఒక్కరే జిల్లా తరపున మంత్రిగా ఉన్నారు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కర్నూలుకు చెందిన టీజీ వెంకటేష్‌ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆ తరువాత ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో జిల్లా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృష్ణమూర్తికి తోడు లభించిందని ప్రజలు హర్షించారు. ఆ తరువాత పలు కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు జిల్లా నుంచి పలువురిని చైర్మన్లుగా, డైరక్టర్లుగా ఎంపిక చేశారు. వాల్మీకి ఫెడరేషన్‌కు బీటీ నాయుడు, శాలివాహన ఫెడరేషన్‌కు తుగ్గలి నాగేంద్ర చైర్మన్లుగా నియమితులు కాగా ఆహార కమిషన్ డైరెక్టర్‌గా గుడిసె కృష్ణమ్మ ఎంపికయ్యారు. వీరు పడమర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. నంద్యాల ఉప ఎన్నికల అనంతరం ఎన్‌ఎండీ ఫరూక్‌ను శాసనమండలికి పంపి చైర్మన్‌గా నియమించారు. అదే పట్టణానికి చెందిన బాబన్‌ను నూర్‌బాషా ఫెడరేషన్ చైర్మన్ పదవికి, నౌమాన్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. ఆత్మకూరుకు చెందిన అహ్మద్ హుసేన్‌ను హజ్ హౌజ్ కమిటీ చైర్మన్ పదవిలో నియమించారు. ఆ తరువాత సాగునీటి అభివృద్ధి మండలి చైర్మన్‌గా నంద్యాలకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. కర్నూలు అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కేటాయించారు. గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని డోన్ నియోజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు యాదవ్‌కు కేటాయించారు. తాజాగా మండలి చైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రి మండలిలోకి తీసుకుని మైనారిటీ సంక్షేమశాఖతో పాటు కీలకమైన వైద్య విద్యాశాఖ కేటాయించారు.
కొత్తగా మైనారిటీ కార్పొరేషన్ డైరక్టరుగా కర్నూలుకు చెందిన అల్లా బకాష్‌ను నియమించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యుడు, 11 మంది నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. ఇంత మంది ఒక జిల్లా నుంచి టీడీపీ తరపున ఉండటం ఒక రికార్డని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. ఇంత మంది ప్రభుత్వ పదవుల్లో ఉన్నా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం కూడా ఒక రికార్డేనని వారు ఎద్దేవా చేస్తున్నారు. జిల్లా నుంచి పదవుల్లో ఉన్న నాయకులు ఇప్పటికైనా జిల్లా సమస్యలపై గళం విప్పి పరిష్కరించకపోతే వారి పదవుల కోసం ప్రజా సమస్యలను తాకట్టు పెట్టిన వారుగా మిగిలిపోతారని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.