ఆంధ్రప్రదేశ్‌

వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/సోంపేట ఆగస్టు 16: సముద్రంలో వేటకు వెళ్ళి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు సురక్షితంగా తీరానికి చేరారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎక్కువూరు గ్రామ తీరానికి గురువారం మధ్యాహ్నం బోటు చేరుకుంది. కాకినాడ నగరంలోని దుమ్ములపేటకు చెందిన ఎరుపల్లి లక్ష్మణరావు, ఎరుపల్లి సత్తిబాబు, గరికిన ఆనంద్, మారుపల్లి సింహాద్రి, పేర్ల సత్తిరాజు, గరికిన అప్పారావు, దాసరి కొయ్యరాజు అనే ఏడుగురు మత్స్యకారులు ఈనెల 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్ళారు. వేట ముగించుకుని 11,12 తేదీల్లోగా వీరు తిరిగి కాకినాడ తీరానికి చేరుకోవల్సి ఉంది. అయితే 15వ తేదీ వరకు మత్స్యకారులు తిరిగి రాకపోవడం, జీపీఎస్ సిస్టం, మొబైల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గల్లంతైన బోటు సమాచారాన్ని బోటు యజమాని పేతురు, జాలర్ల కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తెలియజేశారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. కోస్ట్‌గార్డ్‌కు చెందిన సి-438నౌక, డోర్నియర్ ఎయిర్‌పార్టీ సిజి 778 హెలీకాప్టర్లు గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన బోటులో జీపీఎస్ సిస్టం ఉన్నప్పటికీ బ్యాటరీ డిస్‌ఛార్జి కావడంతో సమాచారం అందడం లేదని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం ప్రకటించారు. కాగా గురువారం మధ్యాహ్నానికి బోటు సురక్షితంగా ఎక్కువూరు తీరానికి చేరుకున్నట్టు సమాచారం అందింది. ఏడుగురూ క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.