రాష్ట్ర వార్తలు
తిరుపతి, ఫిబ్రవరి 4: దేశంలో మురికివాడలు లేకుండా అభివృద్ధి చేయటమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర సాంస్కృతిక, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రి శెల్జా అన్నారు. శనివారం తిరుపతి రీజనల్ సైన్స్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘మన విశ్వం’ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఇతర దేశాల్లో మ్యూజియాలు సైన్స్ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నాయన్నారు. రాజీవ్‌గాంధీ కన్న కలలు ఇప్పుడు ఫలిస్తున్నాయని, ఇప్పుడు ఐటి రంగంలో మనకున్న శక్తి మరెవరికీ లేదన్నారు. మానవాళికి ప్రాథమిక సౌకర్యాలైన మంచినీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్ల కల్పనకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు. తిరుపతి నగరంలో పేదరిక నిర్మూలనకు అవసరమైన చర్యలకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. మనిషి ఆశాజీవిగా ఉండాలని, కలలు కంటూ, వాటిని సఫలీకృతం చేసుకున్నప్పుడే అభివృద్ధిని సాధించినట్లు అవుతుందన్నారు.
13వ శాసనసభకు మునె్నన్నడూ లేని సవాళ్లు
విజయవాడ, ఫిబ్రవరి 4: ప్రస్తుత 13వ శాసనసభకు ముందెన్నడూ లేనివిధంగా పెను సవాళ్లు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ వీటికి పరిష్కార మార్గాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నగరంలో శనివారం జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలోప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఒకే సమయంలో పెద్దసంఖ్యలో శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం, అలాగే పెద్దసంఖ్యలో శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాల్సి రావటం వంటి పరిణామాలు ఎదురయ్యాయని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఉత్పన్నం కాలేదన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం మహోన్నతమైనదని, రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతోనే భవిష్యత్‌లో చోటుచేసుకునే ఇలాంటి సమస్యలన్నిటికీ ఆనాడే పరిష్కార మార్గాలు చూపుతూ కొన్ని విధి విధానాలు రూపొందించారని చెప్పారు.
ఐఏఎస్‌లనే బాధ్యుల్ని చేయడం సరికాదు: కొణతాల
విశాఖపట్నం, ఫిబ్రవరి 4: ఎమ్మార్ ప్రాపర్టీసీ, జగన్ ఆస్తుల విషయంలో సిబిఐ అతిగా వ్యవహరిస్తూ ఐఏఎస్ అధికారులనే బాధ్యులు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. శనివారం విలేఖరులతో మాట్లాడుతూ లెజిస్లేటీవ్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషీయల్‌పట్ల ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులో ఉన్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 92 మంది ఐఏఎస్ అధికారులు ఎటువంటి ఆరోపణలు లేకుండానే తమను బాధ్యులను చేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని కలవడం దురదృష్టకరమన్నారు. గత రెండేళ్ళలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వలన అభివృద్ధి కుంటుపడిందని, దీనికి రాజకీయ అనిశ్చితే ప్రధాన కారణమన్నారు. మంత్రులు, మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను అమలు చేసే ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేయడం ఏమాత్రం తగదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఒక్కటై జగన్‌పై లేనిపోని నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.
2జీ స్కామ్‌కు మూలకారణం బిజెపినే: పొంగులేటి
ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 4: 2జీ స్కామ్‌కు మూలకారణం భారతీయ జనతా పార్టీనే అని ఏఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడ శనివారం విలేఖరులతో మాట్లాడుతూ. ముందొచ్చిన వారికి ముందు కేటాయింపులనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బిజెపియేనని ఆయనఅన్నారు. స్కామ్‌లు, కేసులు, అరెస్ట్‌ల విషయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హతను బిజెపి కోల్పోయిందన్నారు. గతంలో కాకినాడలో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అనే నినాదమిచ్చి తెలంగాణ అంశాన్ని విస్మరించిన చరిత్ర కూడా బిజెపిదేనని ఆయన గుర్తుచేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం కూడా తెలంగాణ అంశం వెనుకబడటానికి ఓ కారణమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
విద్య, ఉపాధికి అత్యంత ప్రాధాన్యత: బాలరాజు
విశాఖపట్నం, ఫిబ్రవరి 4: విద్యాభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు జరిగే కల్చరల్ యూత్ ఫెస్టివల్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వచ్చే మూడేళ్ళల్లో 15 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనుందన్నారు. తొలిదశలో లక్ష మందికి ఉపాధి కల్పించామన్నారు. దీనిలోభాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన జాబ్‌ఫెయిర్‌లో 60 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు. మరో లక్ష ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలుకానున్నాయని, దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోపు యువతను వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘విద్యార్థి ప్రాంతీయ సదస్సు’ను నిర్వహించనున్నామన్నారు. దీనికి డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ హాజరవుతారన్నారు. ఏయు పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారన్నారు.
Add new comment