తెలంగాణ

ఉన్నత విద్యా కమిషన్ బిల్లును వ్యతిరేకించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఉన్నత విద్యా కమిషన్‌ను వ్యతిరేకించాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు, ఎన్‌జీవోల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులతో పాటు విద్యావేత్తలు కూడా ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలిపై నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు, ఎంపీలు, వీసీలు మాట్లాడుతూ ఉన్నత విద్యా కమిషన్ ముసాయిదా బిల్లులో అనేక వైరుధ్యాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యారంగంపై అజమాయిషీ తెచ్చుకోవడానికి కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకోవాలని వారు కోరారు. 1956లో ఏర్పాటైన యూజీసీని రద్దు చేస్తూ దాని స్థానంలో హెచ్‌ఇసిఐ తీసుకురావాలనే ప్రతిపాదన సరైంది కాదని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ కన్వీనర్ ఎన్ నారాయణ, కో కన్వీనర్ డా. నాగేశ్వరరావులు ఒక వినతి పత్రం సమర్పిస్తూ, హెచ్‌ఇసిఐ బిల్లును వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈమేరకు వారు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కొత్త కమిషన్ ప్రతిపాదనతో ఉన్నత విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని పీడీఎస్‌యు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము, ఉపాధ్యక్షులు బోయినపల్లి గణేష్ పేర్కొన్నారు. కేంద్రం అనుకున్న ఆలోచనలను విద్యారంగంపై రుద్దడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందన్నారు. యూనివర్శిటీలకు స్వయం ప్రతిపత్తి ప్రకటించడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, సిలబస్ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. ఒకవేళ కేంద్ర పభుత్వం మాట వినని యూనివర్శిటీలను ఏదో ఒక సాకుతో రద్దు చేయడం లేదా నిధులు నిలుపు చేయడం జరుగుతుందన్నారు. ఈ సలహా కమిటీ కేంద్ర మానవ వనరుల మంత్రి ఆధీనంలో ఉండటం వల్ల దానికి స్వయం ప్రతిపత్తి ఉండదని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కేవలం ఆరు శాతం మాత్రమే వస్తున్నారని అందరికీ విద్య అందేలా యూనివర్శిటీలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ప్రైవేటు కార్పొరేట్ విదేశీ పెట్టుబడిదారులకు ఉన్నత విద్యను అప్పగించే కుట్రలో భాగంగా హెచ్‌ఇసీఐని తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఉందని ఆరోపించారు. ఈ ప్రతిపాదిత బిల్లును వెనక్కు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కోరింది.