తెలంగాణ

పాఠశాలల్లో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ప్రభుత్వ పాఠశాలల్లో బదిలీల ప్రహసనం విద్యార్ధుల మెడకు ఉచ్చులా మారింది. స్కూళ్లలో టీచర్లు ఉన్నారు కదా అని ప్రభుత్వ స్కూళ్లను ఎంచుకుని చేరిన విద్యార్ధులకు తాజా పరిస్థితి శాపంగా మారింది. గత నెల పాఠశాలలు ప్రారంభించింది మొదలు టీచర్లు బదిలీల్లోనే నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయినా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారు కదా అని ఎదురుచూసిన విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. ఉన్న టీచర్లు వెళ్లిపోయారే తప్ప, కొత్త టీచర్లు రాకపోవడంతో చాలా స్కూళ్లలో కనీసం ఒక్క టీచర్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ప్రాధమిక పాఠశాలలో కనీసం ఒక టీచరు, మాధ్యమిక స్కూళ్లలో ఇద్దరు, ఉన్నత పాఠశాలల్లో కనీసం ముగ్గురు ఉండేలా చూస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టి విజయకుమార్ చెబుతున్నా, చాలా స్కూళ్లలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. కొన్ని స్కూళ్లలో హెడ్మాస్టర్లు లేకపోగా, మరికొన్ని స్కూళ్లలో బోధన సిబ్బంది లేకుండా పోయారు. రోజూ సమయానికి వెళ్లాల్సిన పాఠశాలలను వీడి సమయం, సౌకర్యం ఉన్న స్కూళ్లను ఎంచుకుని కొంత మంది టీచర్లు వెళ్లిపోవడంతో ప్రముఖ పాఠశాలలు బోసిపోతున్నాయి. హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లకు మించి భవనాలు, ల్యాబ్ , లైబ్రరీ, ఆటస్థలం ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేకుండా పోయారు. భవనాలు ఉంటే ఏం చేసుకుంటాం? టీచర్లు లేకుండా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అలాంటి పాఠశాలల్లో నిన్నటి వరకూ గొప్ప పాఠశాలగా పతాక శీర్షికలకు ఎక్కిన రాజ్‌భవన్ స్కూల్ కూడా నేడు చేరింది. అక్కడ ఇంతకాలం పనిచేసిన టీచర్లు బదిలీలపై వేర్వేరు స్కూళ్లకు వెళ్లిపోవడంతో అక్కడ చాలా సబ్జెక్టులకు టీచర్లు లేకుండా పోయారు. కొన్ని సబ్జెక్టులకు టీచర్లను ఇటీవల నియమించినా, వారికి ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసి ప్రభుత్వం నుండి నేరుగా ఉత్తర్వులు పొంది బదిలీపై కొంత మంది టీచర్లు రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో పద్ధతి ప్రకారం తాము బదిలీపై రాజ్‌భవన్ స్కూల్‌కు వస్తే నేరుగా ప్రభుత్వ ఉత్తర్వులతో మీరు రావడం ఏమిటి అంటూ టీచర్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఖాళీల ప్రాతిపదికన స్కూళ్లలో విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినా, వారు స్కూళ్లకు రావడానికి మరో 15 రోజుల సమయం పట్టేలా ఉంది. వివిధ జిల్లాల్లో విద్యావాలంటీర్ల పోస్టులకు 1,57,635 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలిస్తున్న జిల్లా అధికారులు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇదంతా జరిగేలోగా రెండు నెలల కాలం వృధా అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో ఇంత వరకూ అసలు సిలబస్ మొదలుకాలేదని వారు చెబుతున్నారు.