తెలంగాణ

త్వరలో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒకేసారి శుభవార్తను అందించింది. ఈ నెల నుండే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అదే విధంగా జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనాలు 12 నెలల పాటు ఇచ్చేందుకు కూడా సీఎం ఆమోద ముద్ర వేశారని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికీ 10వ తరగతి వరకే మధ్యాహ్న భోజనం అమలు అవుతోందని ఆయన పేర్కొన్నారు. సన్నబియ్యంతో పేద విద్యార్ధులకు కడుపు నింపుతున్న ఈ పథకాన్ని తమకూ వర్తింపచేయాలని జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు, అధ్యాపకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరాయని అన్నారు. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఒక కమిటీని వేశారని, కమిటీ సూచనతో ముఖ్యమంత్రి కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు అంగీకరించారని చెప్పారు. ఈ నెల నుండే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని అన్నారు. వీటిలో దాదాపు 4 లక్షల మంది చదువుకుంటున్నారని, వారందరికీ లబ్ది చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మధ్యాహ్న భోజన పథకం కాలేజీ విద్యార్ధులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఆ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులకు కూడా గౌరవ వేతనాన్ని ఇక నుండి ఏటా 12 నెలలు చెల్లించనున్నామని పేర్కొన్నారు. విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత వేతనాలు లేకుండా ఖాళీగా ఉంటున్న అధ్యాపకులు ఇకపై అలా ఉండాల్సిన పనే్లదని తెలిపారు. దీనివల్ల జూనియర్ కాలేజీల్లో 3728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు లబ్ది పొందుతారని అన్నారు.
కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానవ వనరుల అభివృద్ధి వల్లే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ బాధ్యతను తమకు అప్పగించారని అన్నారు. తెలంగాణలో ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలే ఉండటంతో వారికి ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 611 గురుకుల విద్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాక ముందు 50 ఏళ్లలో 270 గురుకులాలు ఉండగా, తెలంగాణ వచ్చాక 881 గురుకులాలు అయ్యాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు నాలుగేళ్లుగా చేస్తున్న కృషికి ఇపుడిపుడే ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రెండు లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ స్కూళ్లలో చేరారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి సర్వీసు రూల్స్, కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారాన్ని అందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. వంద కోట్ల రూపాయిల వ్యయంతో ఆరు లక్షల మంది బాలికలకు ఆరోగ్య రక్షణ కిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ అధ్యాపకులకు ఉప ముఖ్యమంత్రి సత్కరించి వారికి బంగారు పతకం, ప్రశంసాపత్రం, షాల్‌తో అభినందించారు. ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేకుండా వారికి పాయింట్లు ఇచ్చి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీఈఆర్‌టీ రూపొందించిన ‘అనుభవాత్మక అభ్యసనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయకుమార్ తదితర అధికారులు, వివిధ వర్శిటీల వీసీలు కూడా హాజరయ్యారు.