తెలంగాణ

ఇందూరులో చెమటోడుస్తున్న తెరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 20: రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తూ, హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల్లో విజయం సాధించడం అధికార తెరాస పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండే ఎం.పీగా కొనసాగుతుండడంతో, తన సెగ్మెంట్ పరిధిలోని తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత ఆమె భుజస్కంధాలపై పడింది. దీంతో గడిచిన నాలుగైదు రోజుల నుండి ఆమె ఆయా సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో తొలిదఫా ప్రచారాన్ని పూర్తి చేసిన మీదట, సీఎం కేసీఆర్‌చే స్థానికంగా సభలు నిర్వహించేందుకు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. మొదటి విడతలోనే జిల్లాలో కనీసం నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని తలపోస్తున్నారు. ఆలోపే ఎం.పీ కవిత తెరాస అభ్యర్థులతో కలిసి వారివారి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతుండడంతో గణేష్ మంటపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తూ, స్థానికులతో మమేకం అవుతున్నారు. తెరాస చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వల్లె వేస్తూ, ప్రతిపక్షాలను ఉద్దేశించి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలను తెరాస కైవసం చేసుకోగా, ఈసారి కూడా అదే తరహా ఫలితాలను పునరావృతం చేయాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఈమేరకు పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా మల్చుకోవాలనే తపనతో ప్రచార పర్వంలో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే, అనంతరం కొద్ది కాలానికే జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన గెలుపు సునాయాసం అవుతుందనే భావనతో తాజామాజీలకు మద్దతుగా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారని స్పష్టమవుతోంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో కవిత ఎం.పీ స్థానానికి బదులుగా శాసన సభా స్థానం నుండి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తాజామాజీలుగా మారిన సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ఆమె వచ్చే ఎన్నికల్లోనూ ఎం.పీ స్థానం నుండే పోటీ చేయడం దాదాపుగా ఖాయమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు అసెంబ్లీ పోరు సందర్భంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు లభించిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.