తెలంగాణ

విజిట్ వీసాలతోనే గల్ఫ్ మోసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 7: ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఎడారి దేశాల వైపు దృష్టిసారిస్తున్న యువత బలహీనతను ఆసరాగా చేసుకుని నకిలీ ఏజెంట్లు ఎంతో సులువుగా వారిని మోసగిస్తున్నారు. పేరుమోసిన కంపెనీ, పెద్ద మొత్తంలో జీత భత్యాలు, వసతి, బసతో కూడిన ఉద్యోగాలంటూ నమ్మబలుకుతూ, అమాయకుల నుంచి అందిన మేరకు దండుకుంటున్నారు. కంపెనీ వీసాల పేరు చెప్పి, వారిని విజిట్ వీసాలపై విదేశాలకు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. పరాయి దేశంలో అడుగుపెట్టిన తరువాత కానీ, బాధితులు తాము నిలువెల్లా మోసపోయామనే తెలుసుకోలేకపోతున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అప్పుసొప్పులు చేసి గల్ఫ్‌కు రావడంతో, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే అక్కడే ఎలాగోలా, ఏదోఒక పని చేయాల్సిందేనని భావిస్తూ దొంగచాటుగా పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులకు పట్టుబడుతూ జైళ్లలో మగ్గిపోతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా గల్ఫ్ బాధితుల దైన్య స్థితి వెలుగులోకి వస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుండి దుబాయ్ సర్కార్ ఆమ్నెస్టీని అమలు చేస్తుండగా, ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ వెసులుబాటును వినియోగించుకుని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు 8వేల మంది గల్ఫ్ బాధితులు ఇప్పటివరకు స్వస్థలాలకు చేరుకున్నట్టు గల్ఫ్ బాధిత సంక్షేమ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇంకనూ వేలాది మంది పరిస్థితులు అనుకూలించక అక్కడే చిక్కుబడిపోయి ఉన్నారు. ప్రధానంగా స్వదేశానికి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆపన్నహస్తం కోసం చకోరపక్షుల్లా ఎదురుతెన్నులు చూస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే తమవంతు తోడ్పాటును అందిస్తూ విమాన టిక్కెట్లను సమకూర్చడం వల్ల పలువురు ఇళ్లకు చేరుకోగలిగారు. ప్రస్తుతం ఆమ్నెస్టీ గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఇంకనూ అక్కడే చిక్కుబడిపోయి ఉన్న బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న వారిలో దాదాపు 80శాతం మంది తాము విజిట్ వీసాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. గల్ఫ్ ఉపాధి పేరిట ఆశలు పెంచుకున్న యువకులు కంపెనీ వీసాలు లభించకపోవడంతో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల వైపు దృష్టి సారించారు. అయితే అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గల్ఫ్ దేశాలనే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగ యువకుల్లో ఆశలు రేపుతూ విజిట్ వీసాలు అందజేస్తున్నారు. అక్కడ వెళ్లేందుకు వీలుగా వీసా ఉంటుందని, వెళ్లాక అక్కడ తమవారు ఉపాధి కల్పిస్తారంటూ ఆశలు చూపుతూ సందర్శక వీసాలను కట్టబెడుతున్నారు. ఒక్కో వీసాకు 60నుండి 80వేల రూపాయల వరకు వసూలు చేస్తూ గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక గానీ వాస్తవాలు తెలియడం లేదు. మూడు మాసాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతున్న నిరుద్యోగ యువకులు, ఉద్యోగాలు లభించకపోవడంతో ఏజెంట్ల మోసాన్ని గుర్తించి లబోదిబోమంటున్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించినప్పటికీ, దాని నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో గల్ఫ్ బాధితులకు ఇది అంతగా ఉపయోగపడటం లేదు.
ప్రభుత్వం గ్రామాల్లోని నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను పకడ్బందీగా నిర్వహిస్తే, గల్ఫ్ వెళ్లాలనుకునే నిరుద్యోగ యువకులకు సరైన దిశా నిర్దేశం ఏర్పడుతుంది.