తెలంగాణ

కేసీఆర్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 13: కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి బంగారు తెలంగాణ చేయమని అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ 300 కోట్ల రూపాయలతో ఇంటిని, మూడు కోట్లతో బాత్‌రూంను కట్టుకుని కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్‌అలీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారని, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఏం ఒరిగిందని ఆయన దుయ్యబట్టారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కామారెడ్డి జిల్లా రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు భాజాభజంత్రీలతో ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తూ, అక్కడ ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఎన్నికల ప్రచార రథంపై నుంచి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు అస్త్రాలు కురిపించారు. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో పుట్టిన ప్రతి పసికందుపై 50 వేల అప్పు మోపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో టీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే, తెలంగాణ రాష్ట్రంలో పనికి మాలిన పథకాలు ప్రవేశపెట్టి, 2లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వల్ల లాభ పడింది టీఆర్‌ఎస్ సర్కార్ తప్ప ప్రజలు కాదని అన్నారు. సబ్సిడీ ట్రాక్టర్‌ల ఎర చూపి ఇతర పార్టీల కార్యకర్తలను పార్టీలోకి లాగుతున్నారని ఇది నీచ రాజకీయం అని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కామారెడ్డిలో కరెంట్ సమస్య లేకుండా చేశానని అన్నారు. కానీ కామారెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా చేసిన గంప గోవర్ధన్ కరెంట్ స్తంభాలకు కనీసం విద్యుత్ బల్బులు కూడా పెట్టించలేదని అన్నారు. తన హయాంలో ప్రతి గ్రామానికి విద్యుత్ స్తంభాలు ఇచ్చి కరెంట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కానీ టీఆర్‌ఎస్ పాలనలో గంప గోవర్ధన్ ఒక్క గ్రామంలో అయిన విద్యుత్ స్తంభాలు వేయించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే కార్మికులకు పని కల్పిస్తాం అని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తామనీ.. తన హయాంలోనే 5లక్షల ఇళ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే సంవత్సరానికి తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, గల్ఫ్ బాధితులకు 500 కోట్ల నిధులు కేటాయిస్తామని, రేషన్ దుకాణాల ద్వారా 7కిలోల సన్న బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులు ఇస్తామని అన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత గల్ఫ్ బాధితులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. 2004లో తనను ఆశీర్వదించిన తరహాలో ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు ఎడ్లరాజిరెడ్డి, మాచారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.