తెలంగాణ

కూటమిలో తిరుగుబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 15: అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే అసంతృప్తి కూడా భారీ స్థాయిలో బయటపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల్లో అసమ్మతులు బహిర్గతమయ్యాయి. మహకూటమిలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు సీట్లను ఆశించిన నేతలు తమకు టిక్కెట్ దక్కకపోవటంతో రెబల్‌గా నామినేషన్ వేస్తామని ప్రకటించారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రెబల్‌గా ఈ నెల 19వ తేదిన నామినేషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సున్నం నాగమణి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన ఎడవల్లి కృష్ణ బీఎల్‌ఎఫ్‌లో చేరారు. ఆయన కూడా ఈ నెల 19వ తేదిన నామినేషన్ వేయనున్నారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ దక్కించుకున్న వనమా వెంకటేశ్వరరావుకు తోడల్లుడైన ఎడవల్లి ఇంటికి గురువారం వనమా కుమారులు వెళ్ళగా వారిని బయటకు వెళ్ళాలంటూ ఎడవల్లి భార్య వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేయటం సంచలనం కలిగించింది. వనమాకు సంబంధించిన వారు తమ ఇంటికి రావద్దని, వస్తే ఆత్మహత్య చేసుకుంటామని ఆమె బెదిరించినట్లు తెలుస్తోంది.
అలాగే ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రియ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత రాములునాయక్ కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేయనున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు కూడా రెబల్‌గా నామినేషన్ వేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కూడా రెబల్స్ బెడద అధికంగా ఉంది.