తెలంగాణ

టీడీపీ వ్యూహాత్మక తప్పిదం... టీఆర్‌ఎస్‌కు అందివచ్చిన ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: టీఆర్‌ఎస్‌ను గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టిన టీడీపీ ఒక అభ్యర్థి ఎంపికలో వ్యూహాత్మక తప్పిదం చేసింది. ఈ తప్పిదాన్ని టీడీపీపై చేయబోయే విమర్శకు టీఆర్‌ఎస్‌కు చిక్కిన బ్రహ్మాస్త్రంగా టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్‌గా చేసుకుని ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెట్టారని, తెలంగాణ జుట్టు చంద్రబాబు చేతికి అప్పగించార’ని టీఆర్‌ఎస్ ఇప్పటికే నిప్పులు చెరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడానికే టీఆర్‌ఎస్ ఇలాంటి విమర్శలు చేస్తుందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. కానీ ఇంతకాలం టీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా తెలంగాణ నడిబొడ్డు కూకట్‌పల్లి నుంచి ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని టీడీపీ బరిలోకి దింపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇంకా ఈ గడ్డపై నందమూరి కుటుంబం రాజకీయ పెత్తనం అవసరమా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాన్ని సంధించడానికి టీఆర్‌ఎస్ పదును పెడుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించడానికి కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ఉదంతాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన పార్టీగా, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు దొడ్డిదారిన తిరిగి తెలంగాణపై రాజకీయ ఆధిపత్యాన్ని సాధించడానికే నందమూరి సుహాసినిని బరిలో దింపారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది. కూకట్‌పల్లి అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దింపిన నందమూరి సుహాసికి తెలంగాణ గడ్డతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఇది పుట్టినిల్లు, మెట్టినిల్లు కాకపోయినా పోటీ చేయడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని టీఆర్‌ఎస్ విమర్శనాస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. నందమూరి సుహాసిని నామినేషన్ వేసే వరకు ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరు స్పందించవద్దని పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ అధిష్టానం సూచించినట్టు తెలిసింది. నామినేషన్ల ఘట్టం ముగిసాక ప్రారంభమయ్యే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో కూకట్‌పల్లి అభ్యర్థి అంశం ద్వారా చంద్రబాబును టార్గెట్ చేసుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణపై ఆంధ్రపెత్తనాన్ని కొనసాగించే కుట్ర దాగి ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విమర్శనాస్త్రాలకు పదును పెడుతోన్నట్టు సమాచారం.