తెలంగాణ

జడ్చర్లలో నువ్వానేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 18: ఇద్దరూ రాజకీయ ఉద్దండులే.. ఈ ఎన్నికలు వారికి అగ్ని పరీక్షగానే మారాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మళ్లీ బరిలో నిలిచారు. అదేవిధంగా మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవిని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దింపింది. దాంతో ఈ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఆవంచ గ్రామ సర్పంచ్ నుండి మొదలుకుని వివిధ స్థానిక సంస్థల్లో రాణించి క్షేత్ర స్థాయి రాజకీయాల్లో అరితేరి మంత్రి స్థాయికి ఎదిగిన లక్ష్మారెడ్డి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉండి ఎంపీగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవుల్లో కొనసాగిన మాజీ ఎంపీ మల్లు రవికి ఈ ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్‌ను మార్చేవిగా భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో జడ్చర్ల నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఇంకా నామినేషన్ల పర్వం ముగియక ముందే గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ మల్లు రవిలు బరిలో నిలిచారు. అయితే, ఈ నియోజకవర్గం నుండి 2004లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా అప్పట్లో లక్ష్మారెడ్డి తొలిసారిగా తెరాస ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ కాంగ్రెస్‌తో కేసీఆర్ విభేదించి తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ ఎంపీ మల్లు రవిని ఉప ఎన్నికల్లో రంగంలోకి దింపింది. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మల్లు రవి జడ్చర్ల నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన ఎర్రశేఖర్‌పై మల్లు రవి గెలుపొందారు. లక్ష్మారెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. మళ్లీ 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అధిష్ఠానం మల్లు రవిని రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో మాత్రం అప్పట్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ తరపున ఎర్రశేఖర్ గెలుపొందారు. కేవలం రెండు వేలకుపైగా స్వల్ప ఓట్ల తేడాతో మల్లు రవి ఓటమి చెందారు. మల్లు రవి జడ్చర్ల ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంగాలో నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులను రాబట్టారు. 2014 ఎన్నికల్లో మళ్లీ లక్ష్మారెడ్డి మల్లు రవిపై గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సైతం ఇద్దరు రాజకీయ ఉద్దండులు మరోసారి పోటీ పడుతుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఒక్కో గ్రామంలో విచిత్రమైన సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో లక్ష్మారెడ్డి, మల్లు రవి మధ్య ఈ దఫా పోరు హోరాహోరీగానే కనపడుతోంది. గల్లీ నుండి దిల్లీ దాకా రాజకీయ పలుకుబడి గల మల్లు రవి, కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని తానై ఉండి కేసీఆర్‌ను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిన మంత్రి లక్ష్మారెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగానే మారాయి. ఇద్దరి నేతలకు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తమ రాజకీయ భవిష్యత్‌కు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టనున్నాయి. ఎవరు గెలిచిన, ఎవరు ఓడిన వారి రాజకీయం ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉంది. మహాకూటమి పొత్తుతో టీడీపీ క్యాడర్ ఇక్కడ ఉన్నందున తనకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి భావిస్తుండగా తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తుతో ఈ ఎన్నికల్లో తనకు మంచి జరుగుతుందని మంత్రి లక్ష్మారెడ్డి అంచనాలు వేసుకుంటున్నారు. లక్ష్మారెడ్డి తన ప్రచారంలో చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు రవి కూడా కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఉద్దండులుగా పేరొందిన ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ మాత్రం రసవత్తరంగా మారింది.